ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడుకు ప‌రువు స‌మ‌స్య ఎదుర‌వుతోంది. ఇప్ప‌టికే తెలంగాణ‌లో జెండా ఎత్తేయ‌డం, అధికారంలో ఉన్న‌ ఏపీలో ఓట‌మి దాదాపు ఖ‌రారు అయిపోయిన చంద్ర‌బాబుకు పొరుగు రాష్ట్రంలోనూ ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు. తాజాగా చంద్ర‌బాబు ఇత‌ర రాష్ట్రాల్లో ప‌ర్య‌ట‌న‌కు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. అయితే, ఆయ‌న ప్ర‌చారం చేసిన తొలి అభ్య‌ర్థే ఓడిపోవ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది.


మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు నిఖిల్ కర్ణాటకలోని మండ్య నుండి ఎంపీగా పోటీచేస్తుండగా ఏపీ సీఎం చంద్రబాబు  మండ్య జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ప్రచార సభలో మాట్లాడిన బాబు మీ అందరి జాగ్వార్ నిఖిల్ కోసం ఇక్కడకి వచ్చానని.. ఎందరో తెలుగు వాళ్ళు కన్నడ సీమలో స్థిరపడ్డారని.. వారంతా కన్నడ సంస్కృతి, సంప్రదాయాలలో మమేకమయ్యారన్నారు. బెంగుళూరు, మైసూర్ అంటే తెలుగు వాళ్లకు ఎంతో ఇష్టమన్నారు. కర్ణాటకకు ధాన్యాగారంగా మండ్య ఉండడం ఆనందంగా ఉందని.. కావేరీ నీళ్లతో తడిసాక ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారిందన్నారు. దేవెగౌడ అనేక సాగునీటి ప్రాజెక్టులు చేపట్టి రైతుబంధుగా నిలిచారని.. మధ్యతరగతి రైతు నుండి అసాధారణ నేతగా ఎదిగిన ఘనత దేవెగౌడదేనన్నారు. దేవెగౌడ పేదలు, అణగారిన వర్గాల కోసం కృషి చేశారని, నిరాడంబరత, దృఢ సంకల్పం, సమర్ధగల నేత దేవెగౌడ అన్నారు.


అయితే, కర్ణాటక రాజకీయం మాండ్య లోకసభ స్థానం చుట్టూనే పరిభ్రమిస్తోంది. మాజీ ప్రధాని దేవెగౌడ మనువడు, సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ మాండ్య నుంచి పోటీచేయడమే ఇందుకు కారణం. ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత అంబరీష్ సతీమణి సుమలత స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ నెల 18న ఈ నియోజకవర్గంలో ఎన్నిక జరుగనుంది. కాగా, సుమలత బీజేపీ మద్దతు కోరారు. ఆమెకు బీజేపీ పరోక్షంగా సహకరిస్తోంది. మ‌రోవైపు అధిష్ఠానం ఆదేశాల్ని ధిక్కరించి కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే ప్రచారంలో పాల్గొంటున్నారు. రాష్ట్రంలో సంకీర్ణ సర్కారును నడుపుతూ మిత్రులుగా ఉన్న జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు మాండ్యలో కత్తులు దూసుకుంటున్నాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా బద్ద శత్రువులుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీ నేతలు ఇక్కడ అలయ్‌బలయ్ అంటూ కలిసి తిరుగుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ, రైతు సంఘాల మద్దతుతో సుమలత ప్రచారంలో దూసుకుపోతున్నారు. మిత్రధర్మాన్ని విస్మరించి కాంగ్రెస్ నేతలు సుమలతకు సహకరించడం దేవెగౌడను కలవరపెడుతున్నది. స్థూలంగా బాబు ప్ర‌చారం చేసిన పొరుగు రాష్ట్ర అభ్య‌ర్థుల్లో తొలి వ్య‌క్తికి ఓట‌మి ఖాయ‌మంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: