ఏపీలో సాధారణ ఎన్నికలు ముగియడంతో ఎవరికి వారు ఎవరు ? సీఎం అవుతారు, టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి, వైసీపీ గెలిచే సీట్ల లెక్కేంటి, జనసేన ఎన్ని ? సీట్లు గెలుస్తుంది, పవన్‌ పోటీ చేసిన రెండు చోట్ల గెలుస్తాడా, ఓడుతాడా ? అని రకరకాలుగా బెట్టింగులు వేస్తున్నారు. సీఎం చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పంలో మాత్రం ఆయన మెజారిటీ మీద భారీగా బెట్టింగులు జరుగుతున్నాయి. ప్రతీ ఎన్నికల్లోనూ చంద్రబాబు మెజారిటీ మీద బెట్టింగులు జరగడం సహజమే అయినా ఈ సారి ఆయన మెజారిటీ తగ్గుతుందని బెట్టింగులు కాస్తున్నవారే ఎక్కువ ఉండడం విశేషం. అలాగే కుప్పంలో చంద్రబాబుకు వచ్చే మెజారిటీకంటే పులివేందులలో వైసీపీ అధినేత జగన్‌కు వచ్చే మెజారిటీనే ఎక్కువ ఉంటుందని కూడా సీమ అంతటా భారీ ఎత్తున బెట్టింగులు జరుగుతున్నాయి. ఇక గత ఎన్నికలతో పోలిస్తే సైతం చంద్రబాబు మెజారిటీ తగ్గుతుందని వైసీపీ వర్గీయులు భారీ ఎత్తున బెట్టింగులకు వేస్తున్నారు. 


2014 ఎన్నికల్లో చంద్రబాబుకు 47,600 ఓట్ల మెజారిటీవచ్చింది. 2009 ఎన్నికల్లో 70,000 మెజారిటీ లభించింది. 2004లో దాదాపు 61,000 మెజారిటీ కుప్పం ప్రజలు చంద్రబాబుకు కట్టపెట్టారు. 2009లో 70,000 ఓట్ల మెజారిటీ తెచ్చుకున్న చంద్రబాబు మెజార్టీ గత ఎన్నికల్లో  47,600 ఓట్లకు తగ్గిపోయింది. చంద్రబాబు కుప్పం వచ్చిన ప్రతి సారి తన మెజారిటీ అంశాన్ని ప్రస్తావిస్తూ కుప్పం నియోజకవర్గాన్ని తాను ఎంతో అభివృద్ధి చేసినా ఇక్కడ ప్రజలు తన మెజారిటీని తగ్గించారని కాస్త అసహనం వ్యక్తం చేస్తు ఉండేవారు. అలాగే కుప్పం నియోజకవర్గ టీడీపీ నాయకులను బహిరంగ సభల్లోనే చెడుగుడు ఆడేవారు. ఈ సారి గత ఎన్నికల కంటే మెజారిటీ పెంచుకోవాలన్న లక్ష్యంతో చంద్రబాబు కుప్పంపై ప్రత్యేక దృష్టి సారించారు. చివరకు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి సైతం హైదరాబాద్‌ నుంచి కుప్పం నాయకులకు మెజారిటీ పెంచాలని దిశానిద్ధేశం చేశారు. మనం ఎంత కష్టపడినా నియోజకవర్గంలో చాలా మైనస్లు ఉన్నాయని.. వాటిని ఐదేళ్ల కాలంలో ఎందుకు సరిదిద్దుకోలేకపోయామని భువనేశ్వరి సైతం కుప్పం నాయకులపై కాస్త అసహనం వ్యక్తం చేసిన ఆడియోలు సైతం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. 


ఈ సారి కుప్పం నియోజకవర్గంలో పోలింగ్‌ శాతం కూడా 85.25 శాతానికి పెరిగింది. దాదాపు అర్థరాత్రి అవుతున్నా పోలింగ్ బూత్‌ల వద్ద మహిళలు బారులు తీరి ఓట్లు వేశారు. దీంతో ఈ పెరిగిన తమకు కలిసివస్తుందని టీడీపీ అనుకూల వర్గీయులు లెక్కలు వేసుకుంటున్నారు. అయితే వైసీపీ బీసీ అభ్యర్థిని రంగంలోకి దించడంతో ఈ సారి బీసీల్లో చాలా మార్పు వచ్చినట్టు తెలుస్తోంది. బీసీల్లో న్యూట్రల్‌ జనాలు, మహిళలు వైసీపీ వైపు మొగ్గు చూపగా, వైసీపీకి సాంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న ఎస్సీల్లో మెజారిటీ వర్గాలు ఈ సారి ఫ్యాన్‌కే జై కొట్టాయి. యువతలో ఈ సారి కొన్ని వర్గాలు జనసేన వైపు, కొన్ని వర్గాలు వైసీపీ వైపు చూసినట్టు కుప్పం పోలింగ్‌ సరళి చెప్పింది. పెరిగిన ఓటింగ్‌ శాతం సైతం ప్రభుత్వ వ్యతిరేఖత వల్లే అని ఇక్కడ కొన్ని రాజకీయ నివేదికల్లో సైతం తేలింది. 


సీఎంగా చంద్రబాబు మీద నియోజకవర్గంలో చాలా మందిపై ఎంత ప్రేమ ఉన్నా స్థానిక నాయకులపై ఉన్న వ్యతిరేఖత బాబును దెబ్బ కొట్టినట్టు తెలుస్తోంది. ఏదేమైన ఈ సారి కుప్పంలో చంద్రబాబు మెజారిటీ తగ్గడం ఖాయంగా కనిపిస్తోంది. అదే టైమ్‌లో చంద్రబాబుకు మెజారిటీ భారీగా తగ్గుతుందని నియోజకవర్గంతో పాటు రాయలసీమ జిల్లాల్లో భారీ ఎత్తన బెట్టింగులు నడుస్తున్నాయి. గత ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే చంద్రబాబుకు ఈ సారి మెజారిటీ తగ్గుతుందని రూపాయికి రెండు రూపాయిలు చప్పున వైసీపీ సానుభూతి పరులు బెట్టింగులకు దిగుతున్నారంటే ఇక్కడ చంద్రబాబు మెజారిటీ తగ్గుతుందన్న దానిపై సందేహాలు ఉన్నాయి. అలాగే పులివేందులలో జగన్‌కు భారీ మెజారిటీ వస్తుందని ఆ మెజారిటీతో పోలిస్తే చంద్రబాబుకు కుప్పంలో మెజారిటీ చాలా తక్కువగా ఉంటుందన్న బెట్టింగులు కూడా నడుస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: