పవన్‌ కళ్యాణ్‌ జనసేన 2019 ఎన్నికల్లో తొలి సారి పోటీ చేసి సంచలనాలు నమోదు చేస్తుందని అనుకున్నా తేలిపోయింది. ఎన్నికలకు ముందు వరకు బలమైన సంస్థాగత నిర్మాణం లేకపోవడంతో ముందు నుంచి పార్టీపై ఉన్న అంచనాలు కాస్త బొక్కబోర్లపడ్డాయి. పవన్‌ పార్టీ ఏపీలో అన్ని చోట్ల పోటీ చేసినా బీఎస్పీ, క‌మ్యూనిష్టులకు కేటాయించిన 35 స్థానాలు వదిలేస్తే మిగిలిన 140 సీట్లులో మాత్రమే పోటీ చేసింది. అందులోనూ రాయలసీమ ప్రాంతంలో పలు చోట్ల జనసేన నుంచి చాలా బలహీనమైన అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అసలు అక్కడ జనసేన నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఎవరో పవన్‌ కళ్యాణ్‌ అభిమానులకు, జనసైనికులకే తెలియని పరిస్థితి. మరీ పార్టీపై అభిమానంతో ఉన్నవారు అభ్యర్థితో సంబంధం లేకుండా గాజుగ్లాసుపై ఓటు వేసి సరిపెట్టడం మినహా చేసేందేమి లేదు. 


ఇక హిందూపురం లాంటి ఎంపీ సీటుకు కూటమి తరపున కూడా అభ్యర్థిని పెట్టే దిక్కు లేదు. ఓవర్‌ ఆల్‌గా ఎన్నికల్లో జనసేన ఎలా పెర్ఫామ్‌ చేసింది ? ఏ ఏ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చారు ? ఎక్కడెక్కడ పవన్‌ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయి ? పవన్‌ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటి ? పవన్‌ సోదరుడు నాగబాబు నరసాపురం ఎంపీగా గెలుస్తాడా ? విశాఖలో జేడీ పరిస్థితి ఏంటి ? అన్న అంశాలపై పవన్‌ ఇప్పటికే అంతర్గతంగా ఓ నివేదిక తెప్పించుకున్నట్టు  జ‌న‌సేన‌ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఓవర్‌ ఆల్‌గా జనసేన ముందు నుంచి కనీసం 20% ఓటు బ్యాంకు చీలుస్తామన్న ఆశలు, అంచనాలతో ఉంది. తీరా ఎన్నికలు జరిగాక జనసేన ఓటు బ్యాంకు 11-13 శాతానికి మాత్రమే పరిమితం అయినట్టు సమాచారం. జనసేన అంతర్గత నివేదికల్లోనూ ఇదే తేలిందట. మూడు కోట్ల పైచిలుకు ఉన్న ఓట్లలో జనసేనకు 40-45 లక్షల ఓట్లు వరకు వచ్చే అవకాశం ఉందట. యువతలో ఉన్న సైలెంట్‌ ఓటింగ్‌ పూర్తిగా జనసేన వైపు మొగ్గితే 50 లోక్షల ఓట్లు క్రాస్‌ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని తెలుస్తోంది.


జనసేన ఆశలు పెట్టుకున్న ఎంపీ స్థానాలు ...
జనసేన రెండు ఎంపీ స్థానాలు కచ్చితంగా గెలుస్తామన్న ధీమాతో ఉంది. విశాఖపట్నంలో సీవీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ, నరసాపురం నుంచి నాగబాబుకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జనసేనతో పాటు రాజకీయ వర్గాల్లోనూ ప్రచారం ఉంది. విశాఖపట్నంలో జేడీకి అనుకూలంగా జరిగిన క్రాస్‌ ఓటింగ్‌, నరసాపురంలో క్రాస్‌ ఓటింగ్‌తో పాటు ప్రధాన పార్టీలు క్షత్రియ సామాజికవర్గానికి సీటు ఇవ్వడంతో కాపు ఓటు బ్యాంకు నాగబాబుకు అనుకూలంగా మళ్లినట్టు తెలుస్తోంది. అలాగే అమలాపురం లోక్‌సభ సీటును సైతం జనసేన గెలిచే ఛాన్స్‌ ఉన్నట్టు కోనసీమలో బలమైన టాక్‌ వినిపిస్తోంది. అలాగే కాకినాడ, మచిలీపట్నం, అనకాపల్లి, రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గాల్లో సైతం జనసేన అభ్యర్థులు గట్టిగా ఓట్లు చీల్చినట్టు తెలుస్తోంది. ఈ లోక్‌సభ సెగ్మెంట్ల పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో 45 సంవత్సరాలకు పైబడిన కాపు సామాజికవర్గం ఓటర్లు అసెంబ్లీకి తనకు నచ్చిన పార్టీకి వేసి ఎంపీకి జనసేనకు వేసినట్టు సమాచారం అందుతోంది. ఇది జనసేనకు ఎంత వరకు లబ్ది చేకూరుస్తుంది అన్నది చూడాలి.


ఎమ్మెల్యే సీట్లపై జనసేన లెక్కలేంటి..?
ఇక చాలా సర్వేల్లో జనసేన 3-6 సీట్లకు మాత్రమే పరిమితం అవుతుందని చెబుతున్నారు. జనసేన ఎన్ని సీట్లు గెలుస్తుందని ఖ‌చ్చితంగా ఎవ్వరూ చెప్పలేకపోయినా కనీసం 40 స్థానాల్లో జనసేన పార్టీ గట్టి పోటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. 20 నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు త్రిముఖ పోటీలో ఉండగా మరో 20 నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు చెమటలు పట్టించారు. ఈ త్రిముఖ పోటీలో అభ్యర్థుల గెలుపు ఓటములు స్థానిక పరిస్థితులను బేస్‌ చేసుకుని రకరకాలుగా ఉండనున్నాయి. జనసేన గట్టి పోటీ ఇచ్చే నియోజకవర్గాలు ఉభయగోదావరి జిల్లాలతో పాటు విశాఖ, శ్రీకాకుళం, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఉన్నాయి. వీటిలో భీమవరం, గాజువాక, నరసాపురం, కాకినాడ రూరల్‌, రాజోలు, పి. గన్నవరం, తాడేపల్లిగూడెం, అమలాపురం, గుంటూరు పశ్చిమం, యలమంచలి లాంటి నియోజకవర్గాల్లో గెలుస్తామన్న ధీమాతో కూడా ఉన్నారు. ఏదేమైనా జనసేన గెలిచే సీట్ల కన్నా చీల్చే ఓట్ల ప్రభావం మాత్రం ప్రధాన పార్టీలపై ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: