ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ తెలుగు రాజకీయాల గురించి తెలిసిన వాళ్లకు ఈ పేరు సుపరిచితం. దివంగత మాజీ మంత్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి రాజకీయ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నరేంద్ర గుంటూరు జిల్లాలో పొన్నూరును కేంద్రంగా చేసుకుని గత ఐదు ఎన్నికల్లో గెలుస్తూ ఓటమిలేని రారాజుగా ఉన్నారు. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న నరేంద్ర 1994లో జరిగిన ఎన్నికల్లో తొలి సారి ఘన విజయం సాధించి అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. 1994 నుంచి 2014 ఎన్నికల వరకు ఓటమి అనేది లేకుండా ఐదు సార్లు వరుస విజయాలు సాధిస్తున్నారు. 2004 నుంచి గత మూడు ఎన్నికల్లోనూ ఎన్నికల టైమ్‌లో ప్రతి సారి ఈ సారి నరేంద్ర ఓడిపోతున్నారని ప్రత్యర్థులు, మీడియా వర్గాలు అనుకోవడం తీరా ఎన్నికల ఫలితాల్లో అటూ ఇటూ మలుపులు తిరిగి విజయం నరేంద్రనే వరించడం జరుగుతోంది. 2004లో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్‌ ప్రభంజనం వీచి గుంటూరు జిల్లాలో 19 అసెంబ్లీ సీట్లలో 18 చోట్ల కాంగ్రెస్‌ విజయం సాధిస్తే పొన్నూరు నుంచి నరేంద్ర ఒక్కడు మాత్రమే విజయం సాధించి ఏక్‌ నిరంజన్‌ అయ్యాడు. 


2009 ఎన్నికల్లో ఎన్నారై మారుపూడి లీలాధర్‌ రావు నరేంద్రను ఖ‌చ్చితంగా ఓడిస్తారని ఎన్నికలకు ముందు చాలా మంది చెప్పారు. తీరా ఎన్నికల ఫలితాల్లో మళ్లీ నరేంద్రదే పైచేయి అయ్యింది. గత ఎన్నికల్లో రావి వెంకటరమణ చేతిలో నరేంద్రకు తప్పదని మరో సారి ప్రచారం జరిగింది. మళ్లీ షరా మామూలుగా విజయం నరేంద్రనే వరించింది. నరేంద్ర గత ఐదు ఎన్నికల్లోనూ ఓ సెంటిమెంట్‌తో విజయం సాధిస్తూ వచ్చారు. ఆయన గెలిచిన ప్రతి సారి కొత్త ప్రత్యర్థిని ఎదుర్కొంటూ వచ్చారు. ఐదు ఎన్నికల్లో ఐదుగురు వేరు వేరు ప్రత్యర్థులపై నరేంద్ర విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో సైతం నరేంద్రకు పాత సెంటిమెంట్‌ మరో సారి రిపీట్‌ అయ్యింది. కిలారు రోశ‌య్యను ఈ ఎన్నికల్లో ఎదుర్కొన్నారు. దీంతో ఆరు ఎన్నికల్లో ఆరుగురు కొత్త ప్రత్యర్థులను ఎదుర్కొన్న అరుదైన రికార్డును నరేంద్ర సొంతం చేసుకున్నారు. ఎన్నికలకు ముందు వరకు గుంటూరు లోక్‌సభ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా ఉన్న కిలారు రోశ‌య్యకు జగన్‌ చివరి క్షణంలో పొన్నూరు అసెంబ్లీ సీటు ఇచ్చారు. 

Image result for dhulipalla narendra kumar

టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న మోదుగుల వేణుగోపాల రెడ్డి వైసీపీలో చేరి గుంటూరు ఎంపీగా పోటీ చెయ్యడంతో కిలారు రోశ‌య్యకు చివరి క్షణంలో పొన్నూరు అసెంబ్లీ సీటు కేటాయించాల్సివచ్చింది. గత ఐదు ఎన్నికల్లోనూ నరేంద్ర ఎన్ని అష్టకష్టాలు పడ్డా ఎన్నికల చివరిలో ప్రతి సారి సమీకరణలు మారడంతో గెలుస్తూ వస్తున్నారు. 2004లో నరేంద్రకు సరితూగే అభ్యర్థి లేకపోవడం, క్యాస్ట్‌ ఈక్వేషన్‌ మిస్‌ అవ్వడం ఆయనకు కలిసి వస్తే.... 2009లో గెలుపు ముంగిట ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థి లీలాధర్‌ వేసిన రాంగ్‌ స్టెప్‌తో మళ్లీ నరేంద్ర గెలిచారు. ఇక గత ఎన్నికల్లో రావి వెంకటరమణ చివరి వరకు గెలుపు బాటలో ఉన్నా ఎన్నికలకు రెండు రోజుల ముందు ఆయనపై ఓ కేసు నమోదై ఆయన నియోజకవర్గంలో అందుబాటులో లేకుండా పోవడంతో నరేంద్రకు మళ్లీ కలిసి వచ్చింది. ఈ సారి నరేంద్ర కొత్త ప్రత్యర్థినే ఎదుర్కొన్నా నియోజకవర్గంలో పరిణామాలు నరేంద్రకు ఏ మాత్రం సానుకూలంగా లేవు. నియోజకవర్గంలో 40,000 పైచిలుకు ఉన్న కాపు సామాజికవర్గంలో ఈ సారి మెజారిటీ జనాలు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కిలారు రోశ‌య్యకు ఓటు వేసినట్టు తెలుస్తోంది. 


పొన్నూరు సిటీలో ఉన్న మైనార్టీలు సైతం వైసీపీ వైపే మొగ్గు చూపగా నియోజకవర్గంలో భారీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ ఓటర్లు ఫ్యాన్‌కే ఓటు వేశారు. ఈ సారి నియోజకవర్గంలో నరేంద్ర తీరుతో బీసీలతో పాటు కమ్మ సామాజికవర్గంలోనూ కొంత మార్పు స్పష్టంగా వచ్చింది. నరేంద్ర తీరుతో పాటు, నరేంద్ర సోదరుడు వ్యవహారం కూడా ఆయనకు మైనస్‌గా మారింది. ప్రతి సారి కాపు సామాజికవర్గంలో మెజారిటీ ఓటర్లు నరేంద్ర వైపు ఉంటుండగా ఈ సారి మాత్రం తమ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి బరిలో ఉండడంతో ఎమ్మెల్యే ఓటు వరకు కిలారు రోశ‌య్యకే వేసినట్టు తెలుస్తోంది. అదే టైమ్‌లో కొందరు కాపు సామాజికవర్గం ఓటర్లు ఎమ్మెల్యేకి వైసీపీ నుంచి పోటీ చేసిన రోశ‌య్యకు వేసి ఎంపీ సీటును మాత్రం జనసేన అభ్యర్థికి వేసినట్టు తెలుస్తోంది. పవన్‌ కళ్యాణ్‌ మీద అభిమానం ఉన్న వారు సైతం ఎమ్మెల్యే సీటు స్థానికంగా తమ వర్గానికే చెందిన వైసీపీ అభ్యర్థికే వేసేందుకే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. ఇలా జనసేన నుంచి కూడా కిలారు రోశ‌య్యకు అనుకూలంగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్టు తెలుస్తోంది. 

Image result for kilaru rosaiah

ఈ క్రాస్‌ ఓటింగ్‌ భారీ సంఖ్యలో ఉండడంతో ఇప్పుడు నరేంద్ర వర్గంలో గుబులు మొదలైంది. వరసగా ఐదు సార్లు గెలుస్తూ వస్తున్న నరేంద్ర నియోజకవర్గాన్ని అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెయ్యలేకపోవడం ఒక మైనస్‌ అయితే ఈ సారి ఓ మార్పు చూస్తే ఎలా ఉంటుందని నియోజకవర్గ ప్రజలు చాలా మంది అనుకోవడం కూడా ఆయనకు ఇబ్బందిగానే ఉంది. ఏదేమైన ఈ సారి పొన్నూరు ప్రజలు మార్పు కోరుకుంటున్న వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. మంత్రి పదవి రాలేదని అలకబూనిన నరేంద్ర ఈ ఐదేళ్లలో పార్టీ అధికారంలో ఉన్నా అంత క్రియాశీలంకంగా లేక తన సీనియార్టీ ఉపయోగించి అనుకున్న స్థాయిలో నిధులు రాబట్టలేకపోయారన్న అపవాదు కూడా ఆయనపై ఉంది. మరి నరేంద్ర డబుల్ హ్యాట్రిక్‌ మిస్‌ చేసుకుంటాడా ? కిలారు నరేంద్రను ఓడించి జయింట్‌ కిల్లర్‌గా నిలుస్తాడా ? లేదా నరేంద్ర అంతిమంగా మళ్లీ విజయం సాధించి డబుల్ హ్యాట్రిక్‌ కొడతాడా ? అన్నది చూడాలి. ఏదేమైనా నరేంద్ర గెలుపు మాత్రం ఈ సారి అంత సులువు కాదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: