పోలింగ్ రోజున ఇనిమెట్ల గ్రామంలో దౌర్జన్యం చేయాలన్న ఉద్దేశంతోనే టీడీపీ నేత కోడెల శివప్రసాద్ అక్కడికి వెళ్లారని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు.  నేడు ఆయన  మీడియాతో మాట్లాడుతూ.. ఇనిమెట్ల గ్రామ చరిత్రను తిరగేస్తే, ఆ గ్రామంలో ఏ రోజునా తగాదా లేదు, ఫ్యాక్షన్ గొడవలు, ఎన్నికల సమయంలో దాడులకు పాల్పడిన సంఘటనలు లేవని అన్నారు. ‘చంద్రబాబుకు జగన్ పోటీనా? నాకు అంబటి రాంబాబు పోటీనా?’ అంటూ టీడీపీ నేత కోడెల శివప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. 


ఇనిమెట్ల గ్రామంలో చిచ్చుపెట్టేందుకే కోడెల వెళ్లారని, ప్రజలు తిరగబడటంతో దానికి బెంబేలెత్తిపోయారని విమర్శించారు.  గత ఎన్నికల్లో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో వైసీపీ ఓడిపోవడం వల్లే జగన్ సీఎం కాలేకపోయారని, అదే ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి తనపై పోటీ చేసిన కోడెలకు కేవలం 924 ఓట్ల మెజార్టీ మాత్రమే వచ్చిందని, ఈ విషయాలు కోడెలకు గుర్తులేవా అని ప్రశ్నించారు.  చట్ట ప్రకారం పని చేయాలని, సూచించిన అంబటి, పోలీస్ శాఖకు ఓ హెచ్చరిక చేశారు.


కోడెల శివప్రసాద్ హయాంలో ఏవో పోస్టింగ్స్ వచ్చాయని చెప్పి, ఆయన్ని కాపాడేందుకు ప్రయత్నం చేస్తే కనుక వాళ్లకు కూడా శిక్ష తప్పదని హెచ్చరించారు.  అహంకారపూరితంగా కోడెల మాట్లాడటం సమంజసం కాదని హితవు పలికారు. ‘బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావదె సుమతి’ అన్న పద్యం కోడెల కోసం రాసినట్టు ఉందని సెటైర్లు విసిరారు.  మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడ్డ రోజున ప్రజాస్వామ్య బద్ధంగా దాడి జరుగుతుందని, ఆ దాడిని ఎదుర్కొనేందుకు కోడెల శివప్రసాద్ సిద్ధంగా ఉండాలంటూ వైసీపీ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. 


ఈ నలభై ఏళ్ల రాజకీయ జీవితమంతా పోలింగ్ బూత్ లు క్యాప్చర్ చేయడం, ఎన్నికల సిబ్బందిని, అధికారులను బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయడం, బాంబులు వేయడం, వర్గాల మధ్య తగాదాలు పెట్టడం వంటి దుర్మార్గపు చర్యలు చేశారని దుమ్మెత్తి పోశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: