విశాఖ అంటే ప్రశాంతతకు మారుపేరు. హడావుడి లేకుండా సాగిపోయే జీవితం. కల్లోలం లేని కడలి కెరటాలు, పచ్చని కొండలు, వెచ్చని వాతావరణం, పదహారు వన్నెల పడుచుగా విశాఖ అందరికీ గుర్తుంటుంది. సిటీ ఆఫ్ డెస్టనీ అని విశాఖకు మరో పేరు. అందమైన  నగరం అంటే విశాఖే ఠక్కున  గుర్తుకువస్తుంది. జీవితంలో  ఒకసారి అయినా విశాఖ రావాలని అంతా అనుకుంటారు. 


అటువంటి విశాఖ ఇపుడు మరో రకంగా పేరు తెచ్చుకోవడం ఇక్కడ జనాలకు బాధగా ఉంది. డర్టీ  కల్చర్ గా పేరు పడిన రేవ్ పార్టీలకు విశాఖ కేంద్ర బిందువు కాబోతోందని ఇటీవల పరిణామాలు రుజువు చేస్తున్నాయి. విశాఖను టూరిజానిక్ రాజధానిగా చేయాలన్నది ప్రజల కోరిక. పాలకులు ఆ దిశగా అడుగులు వేయకపోయినా రేవ్ పార్టీలకు కేరాఫ్ అడ్రస్ గా మారుస్తున్నారని అంటున్నారు.



తాజగా విశాఖ బీచ్ రోడ్డులో జరిగిన రేవ్ పార్టీ వెలుగు చూడడంతో ఒక్కసారిగా నగర ప్రజల చూపు ఇటువైపు మళ్ళింది. ఏమైంది ఈ నగరానికి అనుకొవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విశాఖలోని కొందరు బడా బాబుల ప్రమేయం, జోక్యంతో రేవ్ పార్టీలు గుట్టు చప్పుడు కాకుండా  చాలా రోజులుగా జరుగుతున్నాయని అంటున్నారు. 



అదే విధంగా మత్తుకు, మాదక ద్రవ్యాలకు విశాఖ యువత కొంతమంది ఆకర్షితులయ్యారని కూడా తెలుస్తోంది.  నిషేధిత మాదక ద్రవ్యాలైన మిధిలిన్ దైఆర్సీ మిధైన్ పిటామిన్, లైసర్జిక్ యూసిడ్ డై ఇధలమైడ్  రేవ్ పార్టీల్లొ దొరకడం పెద్ద షాక్ గా పేర్కొనాలి. అత్యంత ప్రమాదకరమైన ఈ మాదక ద్రవ్యాలపైన యువత మక్కువ పెంచుకోవడం దారుణమే. వీటిని ముంబై, గోవా తదితర ప్రాంతాల నుంచి దిగుమతి చేస్తున్నారట. వీటిని గ్రాం నాలుగు వేల రూపాయులు వంతున యువత కొనుగోలు చేయడం విశేషం



ఇక రేవు పార్టీలో మాదక ద్రవ్యాలే కాదు, మందు కూడా ఏరులై పారుతోంది. అలాగే అసాంఘిక కార్యకలాపాలకు రేవు పార్టీలు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నాయి. బడా బాబుల వారసులు చాలా సులువుగా అనుమతి తెచ్చుకుంటూ ఈ పార్టీలను నడిపిస్తున్నారని అంటున్నారు. అందుకే అంతా తెలిసి జరుగుతున్నా ఎక్కడా కేసులు లేవని అంటున్నారు. ఇపుడు మీడియా కంటబడి రచ్చ కావడంతో కొంతమందిపై కేసులు పెడుతున్నారు. కానీ అసలు సూత్రధారులు దొరికితేనే తప్ప రేవు పార్టీల కధ అంతం కాదంటున్నారు. ఏది ఏమైనా విశాఖకు మాయని మచ్చగా రేవు పార్టీలను ఇక్కడ మేధావులు పేర్కొంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: