ఎన్నిక‌ల స‌మ‌యం అంటే హామీలకు అడ్డూ అదుపు లేకుండా ఉంటాయి. ఆయా పార్టీలు, నేత‌లు ఓటర్లపై వరాల జల్లు కురిపిస్తున్నాయి. తమ పార్టీ గెలిస్తే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని పార్టీలు ప్రకటిస్తున్నాయి. అయితే, తాజాగా ఇచ్చిన హామీ ఓ రేంజ్‌లో ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకుంటోంది, జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది. దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఈ క్రేజీ హామీ ఇచ్చింది ఓ పార్టీ.


ఇంత‌కీ ఏం జ‌రిగిదంటే... ఢిల్లీకి చెందిన షాంజీ విరాసత్‌ పార్టీ ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తోంది. ముస్లింలకు ఆ పార్టీ  బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. తమ పార్టీ ఈ ఎన్నికల్లో గెలిస్తే రంజాన్‌ పండుగ రోజు ముస్లింలకు సగం ధరకే మద్యం.. ఉచితంగా మాంసం ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఇక ముస్లిం మహిళలకు తగినంత బంగారం కూడా ఇస్తామని పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇక ఇవే కాకుండా.. పీహెచ్‌డీ వరకు ఉచిత విద్య, విద్యార్థులకు మెట్రో, బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణం చేసే వెసులుబాటు కల్పిస్తామన్నారు. ప్రయివేటు విద్యా సంస్థల్లో చదువుకునే వారికి ఉచితంగా విద్యను అందిస్తామని పేర్కొన్నారు. ఆడబిడ్డ పుడితే రూ. 50 వేలు, ఆడ పిల్లల పెళ్లిళ్లకు రూ. 2,50,000 ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా నిరుద్యోగ భృతి కింద రూ. 10 వేలు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు రూ. 5 వేలు పెన్షన్లు ఇస్తామని చెప్పారు.

ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలకు మే 12న ఆరో దశలో ఎన్నికలు జరగనున్నాయి. నార్త్‌ - ఈస్ట్‌ ఢిల్లీ నియోజకవర్గం నుంచి షాంజీ విరాసత్‌ పార్టీ నుంచి పోటీ చేస్తున్న  అమిత్‌ శర్మ.. ఈ విషయాలను పోస్టర్‌ లో పొందుపరిచి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నిక‌ల హామీలు ఏ  మేర‌కు ఓట్లు రాల్చుతాయో వేచి చూడాలి మ‌రి.


మరింత సమాచారం తెలుసుకోండి: