దేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. కొండ ప్రాంతాలు, మూలన విసిరేసిన రాష్ట్రాలు, సరిహద్దు రాష్ట్రాలు ఇలా భౌగోళిక పరిస్థితులు ద్రుష్ట్యా ఆయా రాష్ట్రాలను కొంత అంచనా వేయడానికి వీలు అవుతుంది. అక్కడ శాంతి భద్రతలు కూడా ఎపుడూ ఒకేలా ఉండవు, ఏ క్షణం ఏం జరుగుతుందోనని జనం భయపడే పరిస్థితులు కొన్ని చోట్ల ఉన్నాయి.


అలాటి చోట్ల ఎన్నికల సంఘం శ్రద్ధ పెట్టి తక్కువ లోక్ సభ సీట్లు ఉన్నా కూడా  విడతల వారీగా ఎన్నికలను జరిపిస్తోంది. అంటే ప్రతీ నాలుగైదు లోక్ సభ సీట్లకు ఎన్నికలు అన్న మాట. ఇక ఏపీని  మొదటి నుంచి ప్రశాంతతకు మారు పేరుగా చూశారు. అందుకే ఒకే మారు పాతిక లోక్ సభ సీట్లు, 175 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరిపించారు. ఐతే ఏపీలో జరిగిన గొడవలు, ముగ్గురు  చనిపోవడం, చోటు చేసుకున్న హింస చూసిన తరువాత మాత్రం ఏపీపై ఉన్న అభిప్రాయం  దేశం మొత్తం  మార్చుకునేలా ఉన్నాయనిపిస్తోంది.


ఏపీ అంటే అభివ్రుధ్ధి, శాంతికి మారు పేరు  అన్న మాటలకు ఇపుడు అర్ధాలు మారిపోతున్నాయి. ఇక్కడ మొదటి విడత ఎన్నికల్లో చెలరేగిన హింసను చూసిన వారు ఇదేంటి ఇలా జరిగింది  అనుకునేలా పరిస్థితి ఉంది. దీనికి అయిదేళ్ల పాటు ఏపీని పాలించిన టీడీపీ మొదటి ముద్దాయి అయితే, ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించిన  వైసీపీ రెండవ ముద్దాయిగా భావించాల్సి వస్తుంది. ఎక్కడా తగ్గకుండా రెండు పార్టీలు వ్యవహరించిన తీరుతోనే ఏపీ ఎన్నికలు కొంత అపహాస్యం పాలు అయ్యాయి.


ఇక ఎన్నికల అనంతరం కూడా సీఎం హోదాలో చంద్రబాబు మాటలు, చేసిన కామెంట్స్ ఎన్నికల సంఘానికి తప్పులు ఆపాదిస్తూ వాడిన భాష కూడా అభ్యంతరకరం. ఆయన ఏకంగా ఈసీని కూడా రాజకీయ కోణంలోకి లాగడం ఆక్షేపణీయం. దేశంలో రాజకీయం,  పార్టీలు పక్కన పెడితే ఈసీ శాశ్వతం, ఇవాళ ఒకరు అధికారంలో ఉంటారు, రేపు మరోకరు ఉంటారు. అయితే మన కోసం, పవర్  కోసం,  వ్యవస్థలపైన నమ్మకం లేకుండా చేయడం దారుణమే.


నిజానికి ఈసీ పనితీరు విషయంలో ఏమైనా ఉంటే  ఇలాంటి సందేహాలు అభ్యంతరాలు వెలిబుచ్చే హక్కు బాబుకు నూటికి నూరు పాళ్ళు ఉంది. కానీ సమయం, సందర్భం చూడాలిగా. ఎన్నికలకు ఆరు నెలల ముందున ఆయన ఈ విధంగా ఈసీ ద్రుష్టికి సమస్యలు తీసుకువస్తే బాగుండేది. ఈవీఎంల విషయంలో అన్ని పార్టీలు కూడా ఇపుడు కాదు మాట్లాడడం, అయిదేళ్ల కాలంలో అభ్యంతరాలు లేవనెత్తి వాటిని పరిష్కరించుకోవాలి. పోలింగ్ జరుగుతున్నపుడు మాట్లాడితే ఎవరికి నష్టం, ఓటరు నైతిక స్థైర్యం దెబ్బ తింటే బాధ్యులు  ఎవరు. ప్రజాస్వామ్యానికి ఓటరే పునాది


ఐనా సరే ఏపీలో అర్ధరాత్రి వరకూ నిలబడి ఓటు వేసిన ప్రతీ ఓటరుకూ నీరాజనం పట్టాల్సిన సమయం ఇది. వారి గొప్పతనాన్ని ఎంత పొగిడినా తప్పే. ప్రజాస్వామ్యం  కోసం ఓటరు పడే తాపత్రయం అలా ఉంటే రాజకీయం చేయాలనుకునే వారు మాత్రం ఏకంగా వ్యవస్థలకే తూట్లు పొడుస్తున్నారు. ఇది మంచి విధానం కాదు. ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి.  ఈసీ కూడా ఏపీ పరిస్థితులను సరిగ్గా అంచనా వేయలేకపోయిందా అనిపిస్తోంది. ఓవైపు అసెంబ్లీ, మరో వైపు పార్లమెంట్ ఎన్నికలు, పైగా ఢీ అంటే ఢీ అంటున్న రాజకీయం. అందువల్ల కనీసం రెండు విడతలుగా పోలింగ్ జరిపితే బాగుండేదేమో. ఏది ఏమైన వ్యవస్థలు ముఖ్యం. , అవే శాశ్వతం , ప్రతీ ఒక్కరూ దీన్ని గుర్తు పెట్టుకునే మాట్లాడితే బాగుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: