ఏపీలో ఎన్నిక‌లు జ‌రిగి ఫ‌లితాల వైపు అన్ని పార్టీలు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న సంగ‌తి తెలిసిందే. రాజ‌కీయ పార్టీలు ఎవ‌రికి వారు త‌మ ధీమాను వ్య‌క్తం చేస్తున్నాయి. రాజ‌కీయ విశ్లేష‌కులు మాత్రం అధికార తెలుగుదేశం, ప్ర‌తిప‌క్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మ‌ధ్యే అధికారం కోసం పోరు ఉంటుంది త‌ప్పించి మ‌రే పార్టీకి ఆ అవ‌కాశం లేదంటున్నారు. ఇంకా స్ప‌ష్టంగా చెప్పాలంటే...వైసీపీదే అధికారమ‌ని తేల్చేస్తున్నారు. అయితే, జ‌న‌సేన పార్టీ నేత‌, మాజీ జేడీ లక్ష్మీ నారాయణ మాత్రం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌మ‌దే అధికార‌మని, 88 సీట్లు వ‌స్తాయ‌న్నారు.


జనసేన తరుపున విశాఖపట్నం అభ్యర్థిగా లక్ష్మీ నారాయణ పోటీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఫ‌లితాల కోసం నిరీక్ష‌ణ సాగుతున్న త‌రుణంలో విజయనగరం జిల్లా ఎస్‌.కోటలో ప‌ర్య‌టించిన ల‌క్ష్మీనారాయ‌ణ స్థానికులతో ముచ్చ‌టించారు. అనంత‌రం విలేకరులతో మాట్లాడిన లక్ష్మీ నారాయణ...ఏపీలో జనసేన అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ప్రభుత్వం జనసేనదే అని, తమ పార్టీ 88 సీట్లు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ప్ర‌క‌టించారు. బీఎస్పీ, సీపీఐ, సీపీఎం మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు లక్ష్మీ నారాయణ చెప్పారు.


ఈ సంద‌ర్భంగా పొత్తుల గురించి సైతం ల‌క్ష్మీనారాయ‌ణ ప్ర‌క‌టించారు. జ‌న‌సేన త‌ర‌ఫున తామెవరికీ మద్దతు ఇవ్వబోమని ప్ర‌క‌టించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఎవరి మద్దతు అవసరం లేదని లక్ష్మీ నారాయణ అన్నారు. ఇక త‌న వ్య‌క్తిగ‌త అంశాల గురించి వివరిస్తూ తన సర్వీసును విడిచిపెట్టి మంచిపని చేశానని, ప్రజల మధ్య సంతోషంగా గడుపుతున్నానని లక్ష్మీనారాయణ చెప్పారు. ఇదిలాఉండ‌గా, జ‌న‌సేనకు 88 సీట్లు రావ‌డం ఏ లెక్క ప్ర‌కార‌మ‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: