ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తన కనుచూపు మేరకు ఏ ఆస్తులున్నా..వాటిని కబ్జా చేసి నాది అనిపించుకునేవాడు గ్యాంగ్ స్టర్ నయీమ్.  అతని ఆగడాలకు ఎంతో మంది తెలంగాణ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.  అలాంటి నయీమ్ టాస్క్ ఫోర్స్ ఎన్ కౌంటర్ చేసింది.  అయితే నయీమ్ చనిపోయిన తర్వాత అతని గురించి పోలీసులు ఒక్కో ప్రదేశాల్లో ఆస్తులను కనిపెడుతుంటే..అతడు చేసిన నేరాలు వెలికి తీస్తుంటే ముక్కున వేలేసుకున్నారు.  నయీమ్ పేరు వింటేనే ఎందుకు భయపడతారో అతని మరణం తర్వాత వెలుగు లోకి వచ్చిన దారుణాలను చూస్తే అర్థం అయ్యింది.  అయితే అతని ఆస్తుల విషయంపై ఎన్నో రకాలు కథనాలు వెలుగులోయి వచ్చాయి. తాజాగా ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ ఆస్తుల వివరాలను ఎట్టకేలకు పోలీసులు లెక్కగట్టారు.


నయీమ్‌ ఆస్తుల విలువ అక్షరాలా రూ.2వేల కోట్లుగా సిట్‌ లెక్కతేల్చింది. 1019 ఎకరాల వ్యవసాయ భూములు, 29 భవనాలు, రెండు కిలోల బంగారం, రెండు కోట్ల నగదు ఉన్నట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)  వెల్లడించింది.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు గోవా, చత్తీస్ గఢ్, ముంబైలలో కోట్ల విలువ చేస్తే ఇళ్ల స్థలాలు ఉన్నట్లు సిట్ అధికారులు చెబుతున్నారు. నయీమ్‌పై మొత్తం 251 కేసులు నమోదయ్యాయని, వీటిలో 119 కేసులు దర్యాప్తు పూర్తయ్యాయని సిట్ వెల్లడించింది. ఇంకా 60 కేసులు కొలిక్కిరావాల్సి ఉందని, మరో రెండు నెలల్లో అన్ని కేసులను పూర్తిచేస్తామని సిట్ పేర్కొంది. ఇదిలావుండగా నయీమ్ తన భార్య, సోదరి, అత్త, అనుచరుల పేర్లపై ఆస్తులు కూడబెట్టినట్లుగా సిట్ గుర్తించింది.


అలాగే నయీమ్ సోదరి, అతని దగ్గర బంధవుల పేర్లపై ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకునేలా సిట్ తగిన ఆధారాలు సేకరించింది. హైదరాబాద్ లో అల్కాపురి, మణికొండ, పుప్పాలగూడలో కోట్ల విలువ చేసే ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఉన్నాయి. భువనగిరి, యాదగిరిగుట్టలోని 16 వెంచర్లలో 18 కోట్ల విలువ చేసే 180పైగా ఓపెన్‌ ప్లాట్లు ఉన్నాయి. గోవాలో కోకనట్ హౌజ్, ఛత్తీస్‌గఢ్‌ రాయ్‌పూర్‌లో 2 కోట్ల భవనం ఉన్నాయి.  ప్రస్తుతం పొజిషన్‌లో ఉన్న వారి ఆదాయ వ్యవహారాలు, డాక్యుమెంట్లు, తదితరాలన్నీ పక్కాగా ఉండటంతో వాటిని స్వాధీనం చేసుకోవడం అంత సులభం కాదని తెలిసింది.


అతని అనుచరుల పేరిట రిజిస్ట్రేషన్‌ అయిన కొన్ని భూముల్లోనూ స్వాధీనం అంత సులభం కాదని సమాచారం. ఆస్తులను సీజర్‌ ప్రాపర్టీ నుంచి తొలగించుకునేందుకు ఏకంగా హైకోర్టుకు వెళ్లారని తెలిసింది.  నయీమ్‌ మొత్తం 1,019 ఎకరాల భూమి సంపాదించినట్లు గుర్తించినా ఈ కేసుల్లో ఆధారాలు దొరక్క అధికారులు తంటాలు పడుతున్నారు. 15 ఏళ్ల క్రితం జరిగిన ఈ సెటిల్‌మెంట్ల విషయంలో కొందరు బాధితులు ఫిర్యాదు చేసినా ఆ భూములు అనేక మంది చేతులు మారాయి. ఇదిలావుండగా నయీమ్ జరిపిన సెటిల్‌మెంట్స్ సంపాదించినభూములు చేతులు మారడంతో సిట్ దర్యాప్తుకు కొంత ఇబ్బంది కలుగుతోంది. అయినప్పటికీ కేవలం రెండు, మూడు నెలల్లో నయీమ్ అక్రమార్జన కేసును పూర్తి చేస్తామని సిట్ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: