తెలంగాణ రాష్ట్రంలో పలుచోట్ల వడగండ్ల వాన అన్నదాతకు తీరని నష్టాన్ని మిగల్చింది. గాలిదుమారం బీభత్సం సృష్టించింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మామిడి కాయలు రాలిపోయి అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు.  అకాల వర్షంతో హైదరాబాద్‌లోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్నిచోట్ల ప్రధాన రహదారులపైనా నీరు నిలిచిపోయింది.


అకాల వ‌ర్షం, వ‌డగాలుల‌కు సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ అర్బన్ జిల్లాల్లో పిడుగులుపడి ముగ్గురు మృతిచెందారు. ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో భారీ గాలులతో వర్షం కురిసింది. నగరంలో కుండపోత వర్షంతో ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. పెద్దతండాలో బానోత్ మోహన్ ఇంటిపై పిడుగుపడింది. కూసుమంచి మండలం నర్సింహులగూడెంలో పలు ఇండ్ల పైకప్పులు లేచిపోయాయి. నేలకొండపల్లి మార్కెట్‌యార్డులో నిల్వచేసిన ధాన్యం తడిసిపోయింది. ఖమ్మం రూరల్, అర్బన్, రఘునాథపాలెం, కారేపల్లి తదితర మండలాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. రాష్ట్ర ప్ర‌భుత్వం న‌ష్టం అంచ‌నా వేసేందుకు బృందాల‌ను సిద్దం చేస్తోంది.


రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో శుక్ర, శనివారాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం గురువారం వెల్లడించింది. మరాఠ్వాడా నుంచి కోమెరిన్ ప్రాంతం వరకు ఇంటీరియర్ కర్ణాటక, ఇంటీరియర్ తమిళనాడు మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నదని, దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాం తాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఈ రెండింటి ప్రభావంతో వానలు పడుతాయని పేర్కొన్నది.


గ్రేటర్ హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం కురిసింది. ఉపరితల, అల్పపీడన ద్రోణుల ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్‌లోని చిలుకూరు, గండిపేట, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో గురువారం తేలికపాటి జల్లులు పడ్డాయి. గరిష్ఠ ఉష్ణోగ్రత 39 డిగ్రీలు, కనిష్ఠం 24.9 డిగ్రీలుగా నమోదైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: