తెలుగుదేశంపార్టీ ఓటమి ఖాయమని జరుగుతున్న ప్రచారం నేపధ్యంలో మొన్న జరిగిన పోలింగ్ పై తెలుగుదేశంపార్టీ పరిస్ధితి ఏమిటి అనే విషయమై చంద్రబాబునాయుడు పోస్టుమార్టమ్ నిర్వహించనున్నారు. అందుకు మొత్తం 175 నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్ధులు, 25 మంది లోక్ సభ అభ్యర్ధులతో పాటు పార్టీ సీనియర్ నేతలను 22వ తేదీన నిర్వహించనున్న సమావేశానికి హాజరుకవాలంటూ ఆదేశించారు.

 

సమావేశానికి హాజరయ్యే వాళ్ళందరూ పోలింగ్ కేంద్రాల వారీగా ఉన్న ఓట్లు, పోలైన ఓట్లు అందులో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పోలయ్యాయనే అంచనాలతో ఓ నివేదికను సిద్ధం చేసి తీసుకురావాలని చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. అంటే అసెంబ్లీ అభ్యర్ధులు ఒక నివేదికను, పార్లమెంటు అభ్యర్ధులు మరో నివేదికను తీసుకురావాలన్నమాట. అలాగే ఆయా నియోజకవర్గాల్లోని సీనియర్ నేతలు కూడా ఇంకో నివేదికను సిద్ధం చేస్తారన్నమాట.

 

పోలింగ్ కేంద్రాల వారీగా ఓట్లు, పోలైన ఓట్లు తదితరాలతో ఫారం 17-సి సర్టిఫికేట్ ను అధికారులు జారీ చేస్తారు. ఈ సర్టిఫికేట్ ను అధికారులు అన్నీ పార్టీల ఏజెంట్లకు ఇస్తారు. ఆ సర్టిఫికేట్లను సేకరించే బాధ్యత చంద్రబాబు బూత్ కన్వీనర్లకు అప్పగించారు. అయితే ఇప్పటికే టిడిపి 29 వేల సర్టిఫికేట్లను సేకరించింది. అంటే 46,500 సర్టిఫికేట్లను సమావేశాలనికి తీసుకురావాలని చంద్రబాబు చెప్పారు.

 

  పోలింగ్ కేంద్రాల వారీగా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడిందనే విషయంపై చంద్రబాబు సీరియస్ గా దృష్టి సారించారు.  ఇపుడు అభ్యర్ధులు, నేతలు ఇచ్చే నివేదికలతో రేపటి పోలింగ్ రోజు ఫలితాలను భేరీజు వేసుకుంటారన్నమాట. అంటే అభ్యర్ధులు, సీనియర్ నేతలు ఏవో కాకిలెక్కలు వేసేసి నివేదికలు ఇవ్వటానికి అవకాశం లేదు. పోలింగ్ కేంద్రాల పరిధిలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయనే అంచనాల మీదే టిడిపికి ఎన్ని సీట్లు వస్తాయనే లెక్కలు తేలుతాయి. కాబట్టి టిడిపి నేతలు చాలా జాగ్రత్తగా నివేదికలు ఇవ్వాల్సుంటుంది.

 

సరే పోలింగ్ అయిపోయిన తర్వాత ఈ లెక్కలన్నీ వేసుకుని ఉపయోగం ఏమిటి ? అనే ప్రశ్న రావచ్చు. కానీ ఇటువంటి కసరత్తులు చేయటంలో చంద్రబాబు చాలా ఎక్స్ పర్ట్. పార్టీ బలమే సంస్ధాగత నిర్మాణం మీద ఆధారపడిన విషయం అందిరకీ తెలిసిందే. మొన్నటి పోలింగ్ లో జనాలు టిడిపికి వ్యతిరేకంగా ఓట్లు వేసినా చేయగలిగేది ఏమీ లేకపోయినా అందరినీ ఏదో బిజిలో ఉంచటమంటే చంద్రబాబుకు అదో తుత్తి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: