రాబోయే ప్రభుత్వం వైసిపినే అనే చర్చ రోజురోజుకు పెరిగిపోతున్న నేపధ్యంలో పార్టీలో మంత్రిపదవులపై ఊహాగానాలు పెరిగిపోతున్నాయి. సామాజికవర్గాల సమతూకం పాటించటం ఎవరికైనా తప్పదనుకోండి అది వేరే సంగతి. మొత్తం 175 ఎంఎల్ఏల్లో ఎవరిని తీసుకున్నా తీసుకోకపోయినా మొదటిసారి గెలిచిన వారికి మాత్రం అవకాశం ఇవ్వకూడదని జగన్మోహన్ రెడ్డి గట్టినిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

 

మొత్తం ఎంఎల్ఏలను నాలుగు రకాలుగా విభజించాలి. మొదటిసారి పోటీ చేస్తున్నవారు మొదటి రకం. గతంలోనే ఇతర పార్టీల్లో గెలిచి మొన్నటి ఎన్నికల్లో వైసిపి తరపున మొదటిసారి పోటీ చేస్తున్నవారు రెండో క్యాటగిరి. వైసిపిలోనే పోయిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి తాజాగా రెండోసారి పోటీ చేసిన వారు మూడో రకం. వైసిపి తరపున రెండోసారి పోటీ చేసిన ఎంఎల్ఏలు నాలుగో రకం.

 

నాలుగో రకం ఎంఎల్ఏలతో ఎటువంటి సమస్య లేకపోయినా మిగిలిన మూడు క్యాటగిరిల్లోని ఎంఎల్ఏ అభ్యర్ధులుగా పోటీ చేసిన వారితోనే సమస్యలు. ఒకవేళ పార్టీ తరపున ఎంత ఎక్కువమంది ఎంఎల్ఏలు గెలిస్తే జగన్ కు అన్ని సమస్యలు. మొదటి రకంలోకి సుమారు   80 మంది వస్తారు.  రెండో రకంలోకి ఓ 20 మంది వస్తారు.

 

అందుకనే జగన్ గట్టిగా ఓ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. మొదటిసారి ఎంఎల్ఏలుగా గెలిచిన వారిని మంత్రివర్గంలోకి తీసుకోకూడదని. ఎందుకంటే, మంత్రివర్గం సంఖ్య 25కి మించకూడదు. కాబట్టి పరిమిత సంఖ్యలోనే తన టీంలోకి ఎవరిని తీసుకోవాలన్నది ఏ ముఖ్యమంత్రికైనా పెద్ద సమస్యే. తీసుకోవాల్సిన 25లోనే సామాజికవర్గాల సమతూకాన్ని పాటించటం ముఖ్యం.

 

పోయిన ఎన్నికల్లో వైసిపి తరపున 67 మంది గెలిచారు. వారిలో 22 మందిని చంద్రబాబు లాగేసుకున్నారు. మిగిలిన వారిలో అత్యధికులకు జగన్ మళ్ళీ టికెట్ ఇచ్చారు. అందరూ చెప్పుకుంటున్నట్లు నిజంగానే గాలి ఉంటే రెండోసారి ఎంఎల్ఏలుగా పోటీ చేస్తున్న వారందరూ గెలవటం దాదాపు ఖాయం. కాబట్టి వీరిలో నుండి మంత్రులుగా ఎంపిక చేసుకోవటమే కష్టం. ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టే జగన్ గట్టి నిర్ణయం తీసుకున్నారని సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: