తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన ఐటీ గ్రిడ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సేవామిత్ర యాప్ పేరుతో ప్రజల వివరాలు సేకరించి.. వైసీపీ, ఇతర ప్రతిపక్షాల అనుకూల ఓటర్లను గుర్తించి.. పకడ్బందీగా వారి పేర్లను జాబితా నుంచి టీడీపీ తొలిగించింద‌ని ఆరోపణలు వెల్లువెత్తిన సంగ‌తి తెలిసిందే. ఈ తతంగానికి హైదరాబాద్‌లోని ఐటీగ్రిడ్ అనే సంస్థ కేంద్రంగా మారిందని వార్త‌లు వ‌చ్చాయి. అయితే, మొన్నటివరకు తెలంగాణ, ఏపీ రాష్ర్టాల ఆధార్ డాటానే ఐటీగ్రిడ్ సంస్థ టీడీపీకి చెందిన సేవామిత్ర అనే యాప్ కోసం తస్కరించినట్టు తేలింది. తాజాగా పంజాబ్‌తోపాటు మరో రెండు ఉత్తరాది రాష్ర్టాలకు చెందిన ప్రజల ఆధార్ డాటా సైతం ఆ సంస్థ హార్డ్‌డిస్కుల్లో ఉన్నట్టు బయటపడింది. ఊహించని విధంగా అనేక రాష్ర్టాలతో లింకులు వెలుగుచూస్తుండటంతో సిట్‌బృందం ఆ దిశగా దర్యాప్తు ముమ్మరంచేసింది.


ఐటీ గ్రిడ్స్ ఉదంతంపై ద‌ర్యాప్తు చేస్తున్ ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం గతంలోనే ఏపీ, తెలంగాణకు చెందిన 7.82 కోట్ల మంది ఆధార్ వివరాలు ఉన్నట్టు గుర్తించారు. తాజాగా మరో మూడు రాష్ర్టాలకు చెందిన రెండు కోట్ల మందికిపైగా పౌరుల ఆధార్ సమాచారం కనుగొన్నట్టు తెలిసింది. తెలుగు రాష్ర్టాలతోపాటు ఇతర రాష్ర్టాల పౌరుల డాటాను ఎందుకు సేకరించారు? ఆ సమాచారంతో ఏంచేసి ఉంటారు? అనే కోణంలో అధికారులు దర్యాప్తులో వేగం పెంచారు. సిట్‌లోని నిపుణుల బృందం ఐటీగ్రిడ్స్ కార్యాలయంలో స్వాధీనం చేసుకున్న 60 హార్డ్‌డిస్కుల్లోని సమాచారాన్ని రిట్రీవ్ చేయడంతోపాటు వాటిని ఎఫ్‌ఎస్‌ఎల్‌కు చేరవేస్తూ శాస్త్రీయపద్ధతిలో ఆధారాలు సేకరించే పనిలో ఉన్నట్టు తెలిసింది. హార్డ్‌డిస్కుల్లోంచి మరికొంత సమాచారం వస్తేనే మరిన్ని కొత్త అంశాలు తెలిసే వీలుంటుంది.


ఐటీ గ్రిడ్ సంస్థ నిర్వాహకులు ఏపీలోని ఆయా నియోజవకర్గాల ఓటరు జాబితాలు తీసుకుని, సేవామిత్ర యాప్‌లో ఓటర్ల పేర్లను ఫీడ్‌చేసి, పేరు, కులం, మతం, ఆధార్ నంబర్, సెల్‌ఫోన్ నంబర్ తదితర వివరాలను పొందుపరిచేలా ఒక ఫార్మాట్ తయారుచేశారని సమాచారం. ప్రభుత్వ పథకాలు అందుకుంటున్న లబ్ధిదారుల వివరాలు, వారు ఎవరికి మొగ్గుచూపుతున్నారనే విషయాలు సహా 15 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళి రూపొందించిన సంగ‌తి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: