ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ తీసుకున్న నిర్ణ‌య‌మైన పెద్ద నోట్ల రద్దు వెనుక లక్షల కోట్ల రూపాయల విలువైన కుంభకోణం దాగి ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ సంచలన ఆరోపణలు చేశారు. ఇది మొత్తం అమిత్‌షా నేతృత్వంలో సాగిందని, ఇందులో రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా), ఆర్బీఐ వంటి ప్రభుత్వ సంస్థల ప్రమేయం ఉన్నదని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు ప్రకటనకు కొన్ని నెలలముందే దాదాపు రూ.3 లక్షల కోట్లు విలువచేసే నకిలీ కరెన్సీ విదేశాల నుంచి భారత్‌కు చేరిందని ఆరోపించారు. శుక్రవారం ఆయన ఢిల్లీ, అహ్మదాబాద్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు వీడియోలు ప్రదర్శిస్తూ.. కుంభకోణం ఎలా సాగిందో వివరించారు.  పెద్ద నోట్లరద్దు ప్రకటనకు ఆరునెలల ముందే ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకంతో కూడిన కొత్తనోట్లను ముద్రించారని ఈ వీడియోలను బట్టి తెలుస్తున్నదన్నారు. దేశవ్యాప్తంగా పేరున్న రాజకీయ నాయకులు, బడా పారిశ్రామికవేత్తల దగ్గర పాతనోట్లను తీసుకొని వారికి కొత్తనోట్లు చేరవేసినట్టు స్పష్టమవుతున్నదని చెప్పారు.


ఈ సంచ‌ల‌నాల‌కు వీడియోల‌ను ఆధారం చేసుకున్న కపిల్ సిబల్.. వీటని అసలైన వీడియోలే అని నిర్ధారించలేమన్నారు. తమకు లభించిన ఆధారాలను బట్టి ఈ వివరాలు చెప్తున్నామన్నారు. తాను ముందునుంచీ నోట్ల రద్దును దేశ చరిత్రలోనే అత్యంత భారీ కుంభకోణంగా చెప్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఈ వీడియోలు నిజమే అయితే తన ఆరోపణలు నిజమేనని తేలుతుందని చెప్పారు. మోదీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలన్నింటినీ తన గుప్పిట్లో పెట్టుకున్నదని, ఈ వీడియోలపై విచారణ జరుగుతుందని తాను భావించడం లేదన్నారు. ఈ వీడియోల్లో ఉన్న వ్యక్తులను ఈడీ అరెస్టు చేయాలని.. కానీ ఇది అసాధ్యమని చెప్పారు. కాబట్టి ప్రజలే ఈ వీడియోలను చూసి ఏం చేయాలనేది నిర్ణయించుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలో లేదా దోపిడీని కొనసాగించాలో వారి చేతుల్లోనే ఉన్నదన్నారు.


క‌పిల్ సిబ‌ల్ చెప్పిన మాట‌లు ఇవి``మొదటి వీడియోను బట్టి ఈ కుంభకోణం ప్రభుత్వంలోనే సాగినట్టు తెలుస్తున్నది. ఈ వీడియోలో.. రాహుల్ శ్రీరంగ్ రత్రేకర్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ముంబైలోని ట్రైడెంట్ హోటల్‌లో ఓ గదిలో ఒక వ్యక్తిని కలిశారు. రాహుల్ ఐడీ కార్డుపై క్యాబినెట్ సెక్రటేరియట్‌లో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నట్టు ఉన్నది. ఈ సందర్భంగా రాహుల్ తాను రాలో పనిచేసిన అనుభవాలను వివరించారు. రూ.లక్ష కోట్ల చొప్పున మూడు సిరీస్‌లలో నకిలీ కరెన్సీని విదేశాల్లో ముద్రించారని, వాటిని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ రవాణా విమానాల ద్వారా హిండోన్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌కు తరలించారని అవతలి వ్యక్తికి చెప్పారు. వారిద్దరి సంభాషణను బట్టి ఈ కరెన్సీ మార్పిడి ఆపరేషన్ మొత్తం అమిత్‌షా నేతృత్వంలోనే సాగుతున్నదని అర్థమవుతున్నది. తాను ఇప్పటికే రూ.20 వేల కోట్ల విలువైన నకిలీ కరెన్సీని సీబీడీ బెలాపూర్ ఆర్బీఐకి బదిలీ చేశానని రాహుల్ చెప్పారు. డబ్బు చేతులుమారుతున్న కొద్దీ ప్రతీ దశలో కొంత పర్సంటేజ్ మిగులుతుందని రాహుల్ చెప్పారు.``అని వివరించారు. 


2018 జూలై 12న రికార్డు చేసిన వీడియో ప్రకా రం.. బ్యాంకు మేనేజర్ సంజయ్ చాన్నే, రిపోర్టర్ కరణ్ ఓ హోటల్‌లో కలుసుకొన్నారు. వాళ్లు అజిత్ దోవల్(జాతీయ భద్రతా సలహాదారు?), జైషా (అమిత్‌షా కొడుకు?), గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ వంటివారిని కలిసిన వివరాలను పంచుకొన్నారు. జైషా, నితిన్ పటేల్ నుంచి రూ.100 కోట్లు తీసుకున్నట్టు, తిరిగి వారికి ఆర్టీజీఎస్ విధానంలో డబ్బు చెల్లించినట్టు చెప్పుకొన్నారు.. అని సిబల్ చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: