ఎన్నికలు ఒట్టి భూటకం...

ఈవిఎంలను ప్రతిపక్షం ట్యాంపరింగ్ చేసింది...

ఈవిఎంలపై మాకు నమ్మకం లేదు...

పేపర్ బ్యాలెట్ లోనే ఎన్నికలు జరగాలి...

 

ఇవి పోలింగ్ జరిగిన దగ్గర నుండి  చంద్రబాబునాయుడు పదే పదే చెబుతున్న మాటలు. కేంద్ర ఎన్నికల కమీషన్ దగ్గర నుండి రాష్ట్ర ఎన్నికల కమీషన్ వరకూ చంద్రబాబు దుమ్మెత్తిపోయని రోజు లేదు.  రేపు ఒకవేళ చాలామంది అంచనా వేస్తున్నట్లే వైసిపి అధికారంలోకి వస్తే చంద్రబాబు ఎలాగూ అంగీకరించరు. ఈవిఎంలను ట్యాంపరింగ్ చేసి హ్యాకింగ్ చేసి వైసిపి ఎన్నికల్లో గెలిచిందనే ఆరోపిస్తారు.

 

వైసిపిని ఎన్నికల్లో గెలిపించటానికి నరేంద్రమోడి, ఎన్నికల కమీషన్ కలిసి కుట్ర చేసినట్లు చెబుతారు. చివరకు వైసిపి విజయంపై కోర్టులో కేసు వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఒకవేళ టిడిపినే ఎన్నికల్లో గెలిస్తే ఏమవుతుంది ? ఈవిఎంలపైన, వైసిపిపైన, మోడి, ఎన్నికల కమీషన్ పైన ఇన్ని రోజులు తాను చేసిన ఆరోపణలను చంద్రబాబు వెనక్కు తీసుకుంటారా ?

 

ఎలాగూ ఈవిఎంలపై నమ్మకం లేదు కాబట్టి జరిగిన ఎన్నికలను, టిడిపి సాధించిన విజయాన్ని వద్దుపొమ్మంటూ ఎన్నికలను రద్దు చేసుకుంటారా ?  ఒక్క ఏపికి మాత్రం ప్రత్యేకంగా ఈవిఎంల ద్వారా కాకుండా పేపర్ బ్యాలెట్ ద్వారానే ఎన్నిక జరపాలని పట్టుబడతారా ?  చంద్రబాబు డిమాండ్లు ఏవైనా ఆచరణ సాధ్యమేనా అసలు ?  తాను గెలిచినపుడేమో ఈవిఎంల గురించి మాటమాత్రంగా కూడా మాట్లాడని చంద్రబాబు తన గెలుపు అనుమానంలో పడినపుడు మాత్రమే నానా యాగి చేస్తుంటారు.

 

తాజా ఎన్నికల్లో జరుగుతున్నది అదే. చంద్రబాబు అనుమాన పడుతున్నట్లుగా నిజంగానే ఈవిఎంలు ట్యాంపరింగ్ జరిగినా, హ్యాకింగ్ జరిగినా కచ్చితంగా వైసిపినే గెలవాలి కదా ? ఒకవైపు ఈవిఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తునే,  పనితీరుపై మండిపడుతునే మరోవైపు టిడిపికి 130 సీట్లు వస్తాయని చెప్పటం చంద్రబాబుకు మాత్రమే చెల్లింది.  ఈవిఎంలు ట్యాంపరింగ్, హ్యాకింగ్ కు గురయ్యాయని ఆరోపిస్తున్నపుడు టిడిపి గెలిస్తే ఎన్నికను రద్దు చేసుకుని మళ్ళీ ఎన్నికలకు వెళతామని చెప్పే ధైర్యం ఉందా చంద్రబాబుకు ?

 


మరింత సమాచారం తెలుసుకోండి: