వంగలపూడి అనిత విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గం నుంచి  గత ఎన్నికల్లో తొలి సారి అసెంబ్లీకి పోటీ చేసి సంచలన విజయం సాధించారు. అనిత‌ ఐదేళ్ల పాటు టీడీపీకి అసెంబ్లీ లోపల, బయట మహిళా మంచి వాయస్‌గా మారారు. ఓ మహిళా ఎమ్మెల్యేగా వైసీపీ విరుచుకుపడడంలో ఆమెను తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కూడా బాగా ఉపయోగించుకుంది. గతంలో టీడీపీలో ఉండి ఆ తర్వాత వైసీపీలోకి జంప్‌ చేసి తెలుగుదేశం పార్టీపై పదే పదే పంచ్‌ డైలాగులతో విమర్శలు చేసే నగరి ఎమ్మెల్యే, వైసీపీ ఫైర్‌ బ్రాండ్‌ రోజాకు ధీటుగా అనిత స్పందించేవారు. ఒకానొక దశలో 2017లో కేబినెట్‌ ప్రక్షాళన‌ జరిగినప్పుడు అనితకు ఎస్సీ, మహిళా కోటాలో మంత్రి పదవి వస్తుందన్న చర్చలు కూడా నడిచాయి. ఆ తర్వాత ఆమెకు టీటీడీ బోర్డ్‌ మెంబర్‌ రావడం, అది కాస్త వివాస్పదం కావడం జరిగిన సంగతి తెలిసిందే. 


అలాంటి అనితకు చివరకు ఈ ఎన్నికల ముందు సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభవం ఎదురైంది. నాలుగేళ్ల పాటు అనిత గ్రూపులను ఎంక్రేజ్ చేశారన్న అపవాదు ఎదుర్కొన్నారు. ఎన్నికల హడావుడి స్టార్ట్‌ కావడంతో అనితకు తిరిగి సీటు ఇస్తే చిత్తు చిత్తుగా ఓడిస్తామని తెలుగు తమ్ముళ్లు రోడెక్కి నానా రచ్చ రచ్చ చేశారు. తనపై ఉన్న అస‌మ్మ‌తిని చల్లార్చేందుకు అనిత చివరిలో నియోజకవర్గంలో పాదయాత్ర సైతం చేసినా టీడీపీ శ్రేణుల నుంచి ఆమెకు మద్దతు కరువైంది. చివరకు అధిష్టానం అనితను తిరిగి అక్కడ పోటీ చేయిస్తే రిస్క్‌ ఎదురవుతుందని భావించింది. అనిత మాత్రం అటు పాదయాత్ర చేసినా పార్టీ కేడర్‌ నుంచి సరైన స్పందన లేకపోవడంతో జిల్లాకే చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు మద్దతుతో చివరి నిమిషం వరకు పాయకరావుపేట టిక్కెట్‌ కోసం విఫల ప్రయత్నాలు చేసినా అధిష్టానం మాత్రం ఆమెకు అక్కడ సీటు ఇవ్వలేదు. 


పార్టీలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే ఇద్దరు కీలక నాయకులు అనితను వదులుకోవడం ఇష్టం లేక ఆమెను పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గం నుంచి రంగంలోకి దింపారు. మూడు జిల్లాలు దాటి వచ్చిన అనితకు కొవ్వూరు సీటు దక్కడం కొంత ఊరటే అయినా... ఎన్నికల సరళిని బట్టి చూస్తే కొవ్వూరులో అనిత గెలుపు అంత సులువు కాదని తెలుస్తోంది. నిన్నటి వరకు ఇక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న కేఎస్‌. జవహర్‌పై వ్యతిరేఖత రావడంతో ఆయనను కృష్ణా జిల్లాలోని తిరువూరుకు పంపిన అధిష్టానం అనితను ఇక్కడ రంగంలోకి దింపింది. వాస్తవంగా చూస్తే కృష్ణా జిల్లాకు చెందిన జవహర్‌ కొవ్వూరుకు నాన్‌ లోకల్‌. ఐదేళ్ల పాటు జవహర్‌కు, కొవ్వూరు టీడీపీ శ్రేణులకు పొసగ‌లేదు. స్థానికేతురులు తమకు వద్దని నియోజకవర్గ టీడీపీ శ్రేణులంతా నానా రచ్చ రచ్చ చేశాయి. 


స్థానికేతురుడు అన్న ముద్రతో జవహర్‌ తప్పించిన అధిష్టానం చివరకు మళ్లీ స్థానికేతురాలనే ఇక్కడ రంగంలోకి దింపింది. ఎన్నికల తర్వాత ఇక్కడ విశ్లేషణ‌లు అనితకు వ్యతిరేఖంగా వస్తున్నాయి. నియోజకవర్గంలో చాలా మందికి అనిత ఎవరో తెలియదు, నాన్‌ లోకల్‌ అన్న ముద్ర ఆమెపై పడిపోయింది. అలాగే జవహర్‌ వర్గంలో కొంత మంది ఆమెకు మద్దతు ఇవ్వలేదన్న గుసగుసలు కూడా కొవ్వూరు టీడీపీలో వినిపిస్తున్నాయి. అయితే జవహర్‌ను కొవ్వూరు నుంచి సాగనంపిన వర్గం మాత్రం ఇక్కడ అనితకు అండగా నిలిచింది. ఇక గత ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసి ఓడిపోయిన వైసీపీ అభ్యర్థి తానేటి వనిత ఐదేళ్ల పాటు నియోజకవర్గంలో కేడర్‌కు అందుబాటులో ఉన్నారు. గతంలో గోపాలపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచినా వనిత వివాదాలకు దూరంగా అందరిని కలుపుకుపోయే మనస్థత్వం ఉన్న వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. 


గత ఎన్నికల్లో ఓడిపోయిన వనితకు స్థానికత, సానుభూతి అస్త్రం కలిసి వస్తున్నాయి. ఇటు అనిత నాన్‌ లోకల్‌ కావడం టీడీపీలోని ఓ వర్గం మద్దతు కరువ‌వ్వ‌డంతో ఊరులో కొంత వెనకబడి ఉన్నట్టే తెలుస్తోంది. వాస్తవంగా చూస్తే కొవ్వూరు నియోజకవర్గం టీడీపీకి కంచుకోటే అయినా స్థానికులను కాకుండా విశాఖ జిల్లా నుంచి తీసుకువచ్చిన అనితను తమ మీద రుద్దడంతో నియోజకవర్గ టీడీపీకి పెద్ద తలకాయలుగా ఉన్న వాళ్లు సైతం అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. అదే టైమ్‌లో నియోజకవర్గంలో న్యూట్రల్‌ ఓటర్లలో చాలా మంది అనితను పరాయి నేతగానే చూసినట్లు పోలింగ్‌ సరళి చెబుతోంది. ఏదేమైనా చంద్ర‌బాబు అనిత ప్లేస్‌ మారినా ఫేట్ మార్చ‌లేక‌పోతున్న‌ట్టే వాతావ‌ర‌ణం చెపుతోంది. మరి తుది ఫలితం ఎలా ఉంటుందో మే 23 వరకు వేట్‌ చెయ్యాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: