ఏపీలో అత్యంత ఆసక్తి రేపిన నియోజకవర్గాల్లో విశాఖ జిల్లా గాజువాక ఒక‌టి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయడంతో గాజువాక ఎన్నికల బరి ఆసక్తిగా మారింది. పవన్ కళ్యాణ్ తాను గాజువాక నుంచి పోటీ చేస్తే ఆ ప్రభావం విశాఖ జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల పై ఉంటుందన్న అంచనాతో ఇక్కడ నుంచి బరిలోకి దిగారు. పవన్ గాజువాకలో పోటీ చేయడానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో పవన్ ఫ్యాన్స్, కాపు సామాజికవర్గం యువత పెద్ద సంఖ్యలో ఉన్నారు. జనసేన పార్టీ సభ్యత్వాలు ఇక్కడ లక్షకి పైగా నమోదవడం కూడా ఈ నియోజకవర్గంలో జనసేన ఎంత స్ట్రాంగ్‌గా చెబుతోంది. గతంలో 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన చింతలపూడి వెంకట్రామయ్య 10 వేల ఓట్ల భారీ మెజారిటీతో అప్ప‌టి టిడిపి, కాంగ్రెస్ అభ్యర్ధులు విజయం సాధించారు. ముందుగా పవన్ గాజువాకలో నామినేషన్ వేసినప్పుడు మెజారిటీ 50 వేల పైనే ఉంటుందని ఆ పార్టీ వాళ్ళు లెక్కలు వేసుకున్నారు. 


ఎన్నికలకు ముందు ఏపీలోలో అన్ని నియోజకవర్గాల కంటే మూడు లక్షల కోట్లతో గాజువాక పెద్ద నియోజకవర్గంగా ఉంది. అక్క‌డ ప్రధాన పోటీ పవన్ వర్సెస్ టిడిపి నుంచి పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌రావు మధ్య ఉంటుందని అందరూ అనుకున్నారు. పోలింగ్ రోజుకు వచ్చేసరికి సీన్ మారిపోయింది. ఎవరు ఏ ప్లేస్‌లో ఉంటారో ? ఎవరు గెలుస్తారో ? ఎవరు మూడోస్థానంతో సరిపెట్టుకుంటారో ? కూడా ఎవ‌రి అంచ‌నాల‌కు అంద‌డం లేదు. ప్రచార ఘట్టంలో పవన్ దూకుడు తగ్గించడం, గాజువాకలో రోడ్ షోతో సరిపెట్టడం, నియోజకవర్గం మొత్తం తిరగకపోవడంతో మాస్ జనాలు సైతం చాలామంది పవన్‌కు ఓట్ల వెయ్య‌లేదని తెలుస్తోంది. అందరూ ముందు నుంచి అనుకుంట్టున్న‌ట్టుగా పోలింగ్‌ రోజున ఇక్కడ పోటీ టిడిపి వర్సెస్ జనసేన మధ్య కాకుండా జనసేన వర్సెస్ వైసీపీ మధ్య జరిగినట్టుగా తెలుస్తోంది. చివరిలో వైసీపీ అధినేత జగన్ గాజువాకలో పర్యటించి తమ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డిని గెలిపించాలని ప్రచారం చేయటం వైసీపీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చినట్లయింది. 


జగన్ సభలకు జనం గట్టిగా వచ్చారు, దీనికితోడు గత రెండు ఎన్నికల్లోనూ నాగిరెడ్డి వరుసగా ఓడిపోతూ వస్తున్నారు. తనకు వయసు అయిపోయిందని ఇవే తన చివరి ఎన్నికలు అన్న సానుభూతి అస్త్రాన్ని ఆయన బాగా ప్రచారం చేయడం కూడా వైసిపికి ప్లస్ అయింది. దీనికి తోడు కొన్ని వార్డులలో నాగిరెడ్డి  భారీగా డబ్బులు ఖర్చు చేసి మాస్ ఓటింగ్‌ను తన వైపునకు ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇక ముందు నుంచి గెలుపుపై ధీమాతో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ చివర్లో కాస్త వెనకబడినట్లు పోలింగ్ ట్రెండ్స్‌ చెబుతున్నాయి. ఇక ఎన్నికలకు ముందు వరకు పవన్ ఘన విజయం ఖాయమని, ఆయన మెజార్టీ మీదే లెక్కలు వేసుకోవచ్చని జనసేన శ్రేణులన్నీ ధీమాతో ఉన్నా... పోలింగ్ ముగిశాక పవన్ గెలుపు చాలా టైట్ అని వైసీపీ నుంచి గట్టి పోటీ ఎదురైందని లెక్కల వేసుకుంటుంది. ఏదేమైనా ఇప్పుడున్న అంచనాల ప్రకారం చూస్తే గాజువాకలో పవన్ గెలవొచ్చు లేదా రెండో స్థానంతో అయినా సరిపెట్టుకోవచ్చు అన్న టాక్ ఎక్కువగా నడుస్తోంది. ఇక ఫైనల్‌గా తుది ఫలితం ఎలా ఉంటుందో గాజువాక లో విన్నర్ ఎవరు ? ర‌న్న‌ర్ ఎవ‌రు. గాజువాక ఓటరు ఎవరికి మూడో స్థానం కట్టబెట్టాడు అన్న‌ది తుది ఫలితాల్లోనే తెలుస్తుంది. అప్ప‌టి వ‌ర‌కు ఈ ఉత్కంఠ త‌ప్ప‌దు.

మరింత సమాచారం తెలుసుకోండి: