ఏపీలో అధికార మార్పిడిని డిసైడ్ చేసేవి ఆ జిల్లాలేనట. గతంలోనూ ఇదే జరిగింది. ఇపుడు కూడా అదే జరుగుతుందని సర్వేశ్వరులు అంటున్నారు. ఈ జిల్లాలలో ఓట్లు, సీట్లు కూడా ఎక్కువ కావడంతో సీఎం పీఠానికి దారి చూపించే జిల్లాలు ఇవేనని అంటున్నారు. మరి ఇక్కడ ఎవరు జెండా ఎగరేస్తారో వారే విజేతలు అని కూడా చెబుతున్నారు.


గ్రేటర్ రాయలసీమ అంటే కడప, కర్నూల్, అనంతపూర్, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం. ఈ జిల్లాల్లో మొత్తం సీట్లు 74 ఉన్నాయి. ఇక్కడ రాజకీయంలో ఈసారి కూడా పెద్దగా మార్పు ఉండదని అన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అంటే మెజారిటీ సీట్లు యాభైకి పైగా వైసీపీ గెలుచుకుంటుందని  అన్ని సర్వేలు బల్ల గుద్ది చెబుతున్నాయి. మరి మ్యాజిక్ ఫిగర్ కి అవసరమైన మిగిలిన సీట్లు కోస్తా జిల్లాల నుంచి రావాల్సిందే.


ఇక్కడ దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా కలుపుకుని ఏడు జిల్లాలు గుంటూర్, క్రిష్ణ, ఉభయగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కలుపుకుని  మొత్తం 101 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో గతసారి వైసీపీ గెలుచుకున్నది అచ్చంగా 24 సీట్లు మాత్రమే దాంతో ఆ పార్టీ 67 సీట్లకు పరిమితం అయిపోయింది. అదే సమయంలో మిత్రపక్షం బీజేపీతో కలుపుకుని టీడీపీ ఏకంగా 87 సీట్లను కైవశం చేసుకుంది. ఈసారి ఇక్కడ దెబ్బ ఎవరికి పడుతుందన్నది పెద్ద  చర్చగా ఉంది.


గోదావరి జిల్లాల్లో పవన్ ఫ్యాక్టర్  వల్ల నష్టపోయేది టీడీపీ అని వైసీపీ అంటోంది. పైగా గతంలో వచ్చిన 24 సీట్లను నిలబెట్టుకుని మరో 24 సీట్లను గెలిస్తే తమదే సీఎం పీఠం అంటోంది వైసీపీ. తెలుగుదేశం వాదన చూస్తే కోస్తా జ‌నం తమ వెంటే వుంటారని, గతసారి సీట్లకు కొన్ని తగ్గినా మళ్ళీ అధికారంలోకి బొటాబొటీ మెజారిటీతో వచ్చి తీరుతామని చెబుతోంది. మరి చూడాలి కొస్తా దెబ్బ ఎవరికి పడుతొందో.



మరింత సమాచారం తెలుసుకోండి: