విజయసాయిరెడ్డి.. వైసీపీలో జగన్ తర్వాత అంతటి ప్రభావవంతమైన నేత.. చాలావరకూ జగన్ నిర్ణయాల్లో..విజయసాయిరెడ్డి పాత్ర ఉంటుందని చాలామంది నమ్ముతారు. ఐతే.. ఇటీవల విజయసాయిరెడ్డి జేడీ లక్ష్మీనారాయణపై చేస్తున్న ట్వీట్ల యుద్ధం చాలా దూరం వెళ్తోంది. 


జనసేన 88 సీట్లు గెలుస్తుందన్న లక్ష్మీనారాయణ వ్యాఖ్యలపై విజయసాయి స్పందించడంతో వివాదం మొదలైంది. అసలు జనసేన సొంతంగా పోటీ చేసిందే 65 సీట్లు అంటూ  విజయసాయి కౌంటర్ ఇచ్చారు. అంతటితో ఆగకుండా..మీరు సీబీఐ కేసులు కూడా ఇలాగే దర్యాప్తు చేశారా అని కామెంట్ చేయడం వివాదాస్పదమైంది. 

ఆ తర్వాత దానికి జేడీ స్పందిస్తూ..  మళ్లీ మొత్తం లెక్కలు పెట్టారు. అక్కడితో ఆ వివాదాన్ని ఆపేయకుండా మళ్లీ విజయసాయి దాడి మొదలుపెట్టారు. చంద్ర బాబుకు మీ పార్టీ ఇచ్చిన బీ ఫారాలు పోను మిగిలింది 65 సీట్లు. మరో పార్టనర్ పాల్ బీ ఫారాలు పోగొట్టుకున్నట్టు గానే మీ నాయకుడూ 80 సీట్లలో డమ్మీలను దింపి త్యాగం చేశారంటూ వెటకారం ఆడారు. 

ఈ లెక్కలు తికమకగా ఉంటే బాబు దగ్గర ట్యూషన్‌కు వెళ్ళండి. మీ చీకటి పొత్తులను ప్రజలు చక్కగా అర్థం చేసుకున్నారు. His Master’s Voice అన్న బిరుదు మీకు చక్కగా సరిపోతుంది అంటూ మళ్లీ కెలికారు. మీరు ఈ రోజుకూ జేడీనే. కాకపోతే ఇప్పుడు తెలుగుదేశానికి-జనసేనకు జాయింట్ డైరెక్టర్! నేరగాళ్ళ పార్టీకి, విలువల్లేని పార్టీకి తమరే సంయుక్త సంచాలకులు.. అంటూ కామెంట్ చేశారు. 

దీనికి జేడీ స్పందిస్తూ.. మా లెక్కలు సరిగ్గా ఉంటాయి.మీరు CA చదివారు అయినా కూడా మీ లెక్కలు తప్పులు ఎలా అవుతున్నాయో మాకు అర్ధం అవ్వట్లేదు. మీ తప్పుడు లెక్కల వల్ల ఎంతోమంది ఇరుక్కున్నారు. ఇప్పటికైనా మంచి లెక్కలు నేర్చే విధానాన్ని మొదలుపెట్టండి.  నేను ప్రస్తుతం రాష్ట్రాన్ని, దేశాన్ని పట్టి పీడిస్తున్న పేదరికం, నిరుద్యోగం  నిర్మూలనకై పాలసీ తయారీలో నిమగ్నమైవున్నాను. దీనికి మీదగ్గర ఏమైనా ప్రత్యామ్నాయాలు వుంటే నాకు తెలియచేయగలరు. అంటూ కౌంటర్ ఇచ్చారు. 

ఈ మొత్తం వ్యవహారం చూసినవారికి విజయసాయిరెడ్డి జేడీపై వ్యక్తిగతంగా వెళ్లడం మంచిది కాదని.. అందులోనూ ఆయన వృత్తిగత జీవితాన్ని  రాజకీయ జీవితంతో ముడిపెట్టడం భావ్యం కాదని అంటున్నారు. మరి ఈ ట్వీట్ల యుద్ధం ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: