ఏపీలో తాజాగా జరిగిన ఎన్నికల్లో రెండు బలీయమైన పార్టీలు పోటీ పడుతున్నాయి. ఒకటి టీడీపీ, రెండు వైసీపీ, ఈ రెండు పార్టీల మధ్యనే అధికారం ఈసారికి పరిమితమవుతుందన్న దాని మీద మెజారిటీ జనం కచ్చితమైన అభిప్రాయంతో ఉన్నారు. ఈ రెండు పార్టీలకు  2014 ఎన్నికలు సెమీ ఫైనల్స్ అయితే ఈసారి ఎన్నికలు ఫైనల్స్ గా మారాయి.ఎలాగైనా టీడీపీని దింపాలని  వైసీపీ  గట్టిగా పోరాడింది. అదే సమయంలో అధికారం నిలబెట్టుకోవడానికి టీడీపీ కూడా అంతే పట్టుదలతో నిలబడింది. 


ఇక ఈ ఎన్నికల్లో జనసేన, కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీలు కూడా పోటీ చేశాయి. నిజానికి జనసేన ఈసారి ఎన్నికల్లో కీలకం అవుతుందని అంతా అనుకున్నారు కానీ సీరియస్ ఫైట్  ఇవ్వలేకపోయిందని పోలింగ్ సరళి నిరూపించింది. అయితే బలంగా ఉనికి చాటుకుంటుందని కొన్ని సర్వేలు చెప్పడం ఆ పార్టీకు వూరటను ఇచ్చే పరిణామమే. అదే కనుక జరిగితే 2024కి టఫ్ ఫైట్ ఇచ్చేందుకు, పీఠం కోసం జనసేనను ప్రధాన పక్షంగా భావించాల్సిందే.


ఇక బీజేపీ ఈసారి కొన్ని సీట్లు అయినా గెలుస్తామని చెబుతోంది. ఐతే ఆ పార్టీ నాయకులు తమ టార్గెట్ 2024 అని గట్టిగా చెబుతున్నారు. ఏపీలో టీడీపీ కచ్చితంగా ఈసారి ఓడిపోతుందని, ఆ ప్లేస్ ని తాము భర్తీ చేస్తామని బీజేపీ అంచనాలు వేసుకుంటోంది. ఏపీలో టీడీపీకి, బీజేపీకి కొన్ని సారూప్యతలు ఉన్నాయి. రెండు పార్టీలు ప్రధానంగా బలమైన కమ్మ సామాజిక వర్గం అండతోనే ఓట్లు, సీట్లు తెచ్చుకుంటున్నాయి. టీడీపీ ఓడిపోతే కమ్మ సామాజిక వర్గానికి బీజేపీయే బెస్ట్ ఆప్షన్ అవుతుందని ఆ పార్టీ కచ్చితంగా చెబుతోంది. 


అదే విధంగా కాంగ్రెస్ ని తీసుకుంటే ఆ పార్టీ కూడా 2024 టార్గెట్ గానే ఈసారి ఎన్నికలను ఫేస్ చేసింది. ఆ పార్టీకి వైసీపీ ఓడిపోవడం కావాలి. ఎందుకంటే వైసీపీ ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ దే. సో. ఈ ఎన్నికల్లో జగన్ ఓడితే తమతో కలసి వస్తాడని, ఆ విధంగా 2024 నాటికి కాంగ్రెస్ లో గ్రూపులన్నీ కలిసిపోయి సీఎం పీఠం సాధిస్తామని  హస్తం నేతలు అంటున్నారు. మొత్తంగా చూస్తే ఇప్పటికిపుడు అధికారంలోకి రావాలని ఈ పార్టీలకు లేదన్నది వాస్తవం అంటున్నారు. చూడాలి, మరి కౌంటింగ్ తరువాత ఎన్ని చిత్రాలు జరుగుతాయో.


మరింత సమాచారం తెలుసుకోండి: