మామూలుగా అయితే చంద్రబాబునాయుడు ఇంతగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నిజానికి. పోలింగ్ రోజు నుండి ఈ రోజు వరకూ ఈవిఎంలపై మండిపోతునే ఉన్నారు. అదే సమయంలో టిడిపికి 150 సీట్లు వస్తాయని అంటునే ఉన్నారు. పదే పదే టిడిపి గెలుస్తుంది..గెలుస్తుంది అని పదే పదే ఎందుకు చెబుతున్నారు. చంద్రబాబు చెప్పినా చెప్పకపోయినా అధికారంలోకి ఎవరు రావాలో ఓటర్లు తీర్పిచ్చేశారు.

 

 రిజర్వయిపోయిన ఓటరు తీర్పు మే 23వ తేదీన వెల్లడవుతుంది. మరి ఇంతటి దానికి చంద్రబాబు ఎందుకంతగా టెన్షన్ పడిపోతున్నారు ? చంద్రబాబులో కనబడుతున్న టెన్షన్  పార్టీ ఓడిపోతుందని కాదనే అనిపిస్తోంది. ఇంకేదో భయం ఉంది. అదేమిటంటే తన ఐదేళ్ళ పాలనలో జరిగిన అరాచకాలన్నీ బయటపడతానే చంద్రబాబు భయపడుతున్నట్లున్నారని జనాలు అనుమానిస్తున్నారు.

 

 రాజధాని నిర్మాణం,  పోవలరంతో కలిపి ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో భారీ అవినీతి, వివిధ పథకాల్లో తమ్ముళ్ళు దోచుకున్న వేల కోట్ల రూపాయలు, మహిళలకు, రైతులకు పోలింగ్ ముందు ప్రభుత్వ బ్యాంకు ఖాతాల్లో వేసిన డబ్బంతా ఇతరత్రా పథకాలనుండి తరలించిన డబ్బే.

 

వివిధ పథకాల పేర్లు చెప్పి మహిళలకు, రైతులకు డబ్బులు పంపిణీ చేయటానికి కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేసే టీచర్లు, అంగన్ వాడీ టీచర్లు, కార్యకర్తలు, ఆశా వర్కర్లు లాంటి సుమారు లక్ష మందికి జీతాలు ఆపేశారట. దాదాపు మూడు నెలల నుండి ఆరుమాసాల జీతాలను పెండింగ్ లో పెట్టి ఎన్నికల్లో తాయిలాలు పంచినట్లు చంద్రబాబు వాళ్ళ జీతాలను ఓట్ల కోసం వీళ్ళకు పంచేశారు. దాంతో వాళ్ళంతా మండిపోతున్నారు.

 

అదే సమయంలో అందినకాడికి ఎక్కడబడితే అక్కడంతా అప్పులు తీసేసుకున్నారు. వడ్డీ ఎంతన్నది చూడకుండా అప్పు ఇచ్చేవాళ్ళుంటే చాలన్నట్లు తయారైంది చంద్రబాబు పరిస్ధితి. ఇవన్నీ కూడా నిబంధనలను అతిక్రమించి చేసిన అప్పులే. ఒకవేళ ఖర్మకాలి ప్రభుత్వం మారితే  అదికారంలోకి వచ్చిన ప్రభుత్వం చంద్రబాబు బండారమంతా బయటపెడుతుంది. అంటే ఐదేళ్ళ పాలనలో జరిగిన అరాచకాలన్నీ బయటపడతాయన్నదే చంద్రబాబు భయమని అనుకుంటున్నారు. అదే సమయంలో రాబోయే ప్రభుత్వం గనుక ఐదేళ్ళ చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై కమిటి వేసి విచారణ చేయిస్తే భయంకరమైన వాస్తవాలు వెలుగు చూస్తాయని పలువురు అనుమానిస్తున్నారు. అందుకే చంద్రబాబు టెన్షన్ తట్టుకోలేకున్నట్లు అనుమానిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: