ఏపీలో ఢీ అంటే ఢీ అన్న స్థాయిలో పోటీ జరిగింది. ఇప్పటికైతే ఎవరు అధికారలోకి వస్తారన్నది ఏ రాజకీయ పండితుడు కూడా తేల్చి చెప్పలేని విషయంగా ఉంది. ఎన్నో ఎన్నికలు జరిగినా పోలింగ్ సరళి తరువాత అసలు విషయం తెలిసిపోయేది. ఈసారి మాత్రం ఓటరు గుంభనంగా ఉన్నాడు. అంటే అసలైన రాజకీయం అక్కడే ఉంది. మరి ఎవరు విజేత అంటే అంత సులువుగా చెప్పేలేని పరిస్థితి.


ఇదిలా ఉండగా కాకలు తీరిన రాజకీయ నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ లేటెస్ట్ గా ఓ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీలో రాజకీయంపై తనదైన కామెంట్స్ చేశారు. ఏపీలో ప్రభుత్వ సొమ్ము పెట్టి మహిళల ఖాతాల్లొకి డబ్బులు వేయ‌డం బహుశా ఇదే దేశంలో ప్రధమం అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇకపై అధికారంలో ఉండే ప్రభుత్వాలు అయిదేళ్ళు పనిచేయకుండా చివరి నిముషంలో డబ్బులు లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో వేసేసి సులువుగా గెలిచిపోవచ్చునని ఆయన సెటైర్లు వేశారు.  ఇది కొత్త పోకడ రాజకీయమని ఆయన అన్నారు.


ఏపీలో మహిళలు పదివేలు ఇచ్చినందుకు టీడీపీకి ఓటు వేశారా లేదా అన్నది కౌంటింగ్ లోనే చూడాలని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. ఇది అంత సులభంగా చెప్పే జవాబు కాదని చెప్పారు. ఇక గోదావరి  జిల్లాల‌లో గెలుపు ఓటములని జనసేన ప్రభావితం చేస్తుందని ఉండవల్లి చెప్పుకొచ్చారు. ఆ విధంగా ఆ పార్టీ ఎవరికి నష్టం చేసింది. మరెవరికి లాభం చెసిందన్నది అంచనా ఇపుడే వేయలేమని పేర్కొన్నారు.
ఇక జగన్ సీఎం అవుతారో లేదో తాను చెప్పలేనంటూ ఉండవల్లి షాకింగ్ కామెంట్స్ చేయడం విశేషం. జగన్ కనుక సీఎం అయితే వైఎస్ కొడుకు పెద్ద పదవిలో ఉన్నందుకు తాను కచ్చితంగా ఆనందపడతానని ఉండవల్లి చెప్పారు. ఏది ఏమైనా ఈ ఎన్నికల ఫలితాలను ఉండవల్లి లాంటి వారు కూడా అంచనా వేయలేకపోతున్నారంటే అనూహ్యమైనవిగా వస్తాయేమోనని అంతా భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: