విశాఖ ఎంపీ సీటుకు పోటీ పడిన వారిలో అందరికీ తెల్సిన పేరు కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి. ఆమె అయిదేళ్ళ పాటు 2009 నుంచి 2014 వరకూ విశాఖ  ఎంపీగా పనిచేశారు. అదే సమయంలో కేంద్రంలో కీలక శాఖలకు మంత్రిగా కూడా ఉన్నారు. ఆమె 2014లో బీజేపీ నుంచి రాజంపేట లోక్ సభకు పోటీ చేసి  ఓడిపోయారు. తాజా ఎన్నికల్లో విశాఖ నుంచి మరో మారుఎంపీగా  బీజేపీ తరఫున పోటీ చేశారు.


ఐతే ఇపుడు వినిపిస్తున్న మాట ప్రకారమైతే చిన్నమ్మ విశాఖలో దారుణంగా ఓడిపోతున్నారని. ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుని పోటీ చేసిన విశాఖ సీట్లొ అనూహ్యంగా జేడీ లక్ష్మీ నారాయణ రంగ ప్రవేశం చేసి బీజేపీ ఓటు బ్యాంక్ ని కూడా కొల్లగొట్టారని పోల్ అనంతర పోస్ట్ మార్టం లో వెల్లడైంది. విశాఖలో ఉత్తర భారతీయుల సంఖ్య గణనీయంగా  ఉంటుంది. వారెపుడూ బీజేపీకే ఓటు చేస్తారు. అటువంటిది ఈసారి జేడీ బరిలోకి దిగిన తరువాత మొత్తం సీన్ మారిందట.


మహరాష్ట్రలో సైతం పనిచేసిన జేడీ తన బంధాలను బయటకు తీసి ఉత్తర భారతీయులను బాగానే ఆకట్టుకున్నారని అంటున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో భారీ ఎత్తున నార్త్  ఇండియన్స్ ఓట్లు ఆయనకు పడ్డాయని సమాచారం. ఇక గతంలో బీజేపీ అభ్యర్ధి  హరిబాబుకు వచ్చిన బలమైన సామాజిక వర్గం ఓట్లను టీడీపీ అభ్యర్ధిగా ఉన్న శ్రీ భరత్ తీసుకెళ్ళాడని కూడా తెలుస్తోంది.  ఈ మొత్తం పోలింగ్ సరళిని చూసినపుడు బీజేపీ అభ్యర్ధిగా ఎన్నో ఆశలు పెంచుకుని పోటీ చేసిన చిన్నమ్మకు ఇపుడు డిపాజిట్ దక్కుతుందా అన్న డౌట్లు కూడా వస్తున్నాయట.


ఇదిలా ఉండగా ఆమెను వైసీపీలో చేరమని జగన్ ఎన్నో సార్లు కోరారని టాక్. ఆమె కనుక చేరితే విశాఖ ఎంపీ టికెట్ ఇస్తామని కూడా చెప్పారట. అందుకోసమే చివరి నిముషం వరకూ విశాఖ ఎంపీ సీట్ అలాగే ఉంచారని కూడా అంటున్నారు. అయితే చిన్నమ్మ బీజేపీలో ఉండాలని తీసుకున్న నిర్ణయం వల్ల ఆమె ఇపుడు ఎటూ కాకుండా పోయారని ఆమె వర్గీయులు బాధ పడుతున్నారు. చిన్నమ్మ వైసీపీ ఆఫర్ ని తిరస్కరించి పెద్ద తప్పు చేశారని కూడా అంటున్నారు. ఆమె వైసీపీ నుంచి పోటీ చేసి ఉంటే మంచి మెజారిటీతో సులువుగా విశాఖ ఎంపీ గా గెలిచేవారని కూడా చెబుతున్నారు. మొత్తానికి ఇదీ చిన్నమ్మ శిబిరంలో పోస్ట్ పోల్ సీన్.


మరింత సమాచారం తెలుసుకోండి: