మొన్న జరిగిన ఎన్నికల్లో అనంతపురం పార్లమెంటు నియోజకవర్గంలో  తనకు రూ 50 కోట్లు ఖర్చయిందని టిడిపి ఎంపి  జేసి దివాకర్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ముక్కుసూటిగా మాట్లాడే తత్వం ఉన్న జేసి మనసులో మాటను ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తారు. తన లక్షణంతో ఎందరో సిఎంలను ఇబ్బంది పెట్టిన చరిత్ర కూడా జేసికి ఉంది. అందుకనే మీడియా కూడా జేసి కనబడితే చాలు వదిలిపెట్టదు. అటువంటి జేసి మీడియాతో మాట్లాడుతూ మొన్నటి ఎన్నికల్లో తమ నియోజకవర్గంలో రూ. 50 కోట్లు ఖర్చయిందన్నారు. వాళ్ళు ఖర్చు పెట్టారు..నేను ఖర్చుపెట్టాను..నీవు ఖర్చు పెట్టావు అన్నారు.

 

తమ నియోజకవర్గంలో అయినట్లే ప్రతీ నియోజవకర్గంలోను ఎన్నికల ఖర్చు రూ 50 కోట్ల పైమాటే కానీ తక్కువ మాత్రం ఖర్చయి ఉండదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అంటే మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో జేసికి బదులు ఆయన కొడుకు జేసి పవన్ రెడ్డి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో డబ్బులు ఇవ్వనిదే ఎవరూ ఓటేసే పరిస్ధితి కనబడటం లేదన్నారు. 2014 ఎన్నికల్లో తనకైన ఖర్చ గురించి స్పీకర్ కోడెల చెప్పి కోర్టు విచారణను ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా జేసి పరిస్దితి ఏమవుతుందో చూడాలి.

 

మొన్నటి ఎన్నికల్లో ఓటుకు 2 వేల రూపాయలు ఇస్తే వచ్చే ఎన్నికల్లో ఇంకెతంత ఇవ్వాల్సుంటుందో ఆలోచించుకోమన్నారు. ఎన్నికల్లో అవుతున్న ఖర్చును నియంత్రించేందుకు తాను మేధావులతో ఓ సమావేశం పెడుతున్నట్లు చెప్పారు. వచ్చేనెల 3వ తేదీన  రాజకీయ పార్టీలతో, మేధావులతో ఓ సమావేశం పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

 

అసలు జనాలు అభివృద్ధి కార్యక్రమాలను పట్టించుకోవటం లేదంటూ వాపోయారు. చంద్రబాబు ప్రభుత్వం 120 సంక్షేమ పథకాలను అమలు చేస్తే జనాలు మాత్రం చివరి నిముషంలో అమల్లోకి తెచ్చిన పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ, వృద్ధాప్య ఫించన్లు లాంటివే టిడిపిని గట్టెక్కిస్తాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ స్కీంల అమలును గనుక చంద్రబాబు ఇంకా ముందే చేసుంటే జనాలు వీటిని కూడా మరచిపోయుంటారని స్పష్టంగా చెప్పారు. అప్పుడు చంద్రబాబు పని గోవిందా అంటూ దణ్ణం పెట్టారు.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: