అంటే పోలింగ్ ముందు కానీ పోలింగ్ రోజున కానీ జనసేన ఏదో ఇరగదీసిందని కాదు అర్ధం. ’వైసిపి, టిడిపిల్లా తాము సీట్లు లెక్కలేయం’  అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారంటే ఏమిటర్ధం ? ఎన్నికల్లో పోటీ చేసే ఏ పార్టీ అయినా తామే అధికారంలోకి వస్తామనే ధీమాను వ్యకం చేస్తాయి.  అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నా లేకపోయినా గెలుస్తామనే నమ్మకాన్ని కల్పించకపోతే పార్టీలో పనిచేయటానికి జనాలుండరు.

 

సరే మొన్నటి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే అవకాశం టిడిపి లేకపోతే వైసిపి రెండు పార్టీలకే ఉందన్న విషయం తెలిసిందే.  ఆ విషయం పవన్ కు కూడా బాగా తెలుసు. అయితే  ఒకసారి తానే ముఖ్యమంత్రయిపోతానని ప్రకటించుకున్నారు. ఇంకోసారి అధికారం అందుకోవటానికి మాత్రమే  జనసేనను ఏర్పాటు చేయలేదన్నారు. ఇలా చిత్ర విచిత్రమైన ప్రకటనలు ఇచ్చి అయోమయానికి తెరలేపారు. సరే మొత్తానికి ఏమనుకున్నారో ఏమో అధికారంలోకి రాబోయేది తమ పార్టీనే అంటూ గట్టిగా అరచి అరచి చెప్పారు.

 

అభ్యర్ధులు  కూడా ఏ నమ్మకంతో జనసేన నుండి పోటీ చేశారో తెలీదు. మిత్రపక్షాలతో కలిసి దాదాపు 140 మంది అసెంబ్లీలకు, 25 మంది ఎంపిలుగా పోటీ చేసినా నాలుగు సీట్లలో కూడా గెలుస్తుందన్న నమ్మకమైతే కనబడటం లేదు. ఈ విషయంలో పవన్ కు బాగా క్లారిటీ వచ్చే ఉంటుంది. అందుకనే పోటీ చేసిన అభ్యర్ధులతో మాట్లాడుతూ వైసిపి, టిడిపిల్లా తమ పార్టీ గెలిచే సీట్లను లెక్కేసుకోదని సెలవిచ్చారు. అంతకుముందేదో జేనసేన ఇన్ని సీట్లలో గెలిచేస్తుందన్న నమ్మకం ఎవరిలోను లేదనుకోండి అది వేరే సంగతి.

 

తమకు సీట్లకన్నా ఓట్లే ముఖ్యమని స్వయంగా పార్టీ అధ్యక్షుడే చెప్పేసిన తర్వాత అభ్యర్ధులు తమకు పడే ఓట్లపైన కూడా ఆశలు వదిలేసుకోవటం మంచిదని అర్ధమైపోతోంది.  ఇక వైసిపి, టిడిపిలేసుకునే లెక్కల సంగతి పవన్ కు ఎందుకు ? అధికారంలోకి వచ్చేస్తామనే నమ్మకంతో ఉన్నాయి కాబట్టి ఆ పార్టీలేవో వాటి లెక్కలు అవేసుకుంటున్నాయి.  ఆ నమ్మకం లేదు కాబట్టే పవన్ ఓట్ల గురించి మాట్లాడుతున్నారు.

 

చూడబోతే జనాలు అన్న చిరింజీవి ఏర్పాటు చేసిన ప్రజా రాజ్యమే మేలని అనుకున్నట్లున్నారు. ప్రజారాజ్యానికి 70 లక్షల ఓట్లతో పాటు ఓ 18 అసెంబ్లీ సీట్లను కూడా ఇచ్చారు. జనసేనకు ఆమాత్రం కూడా వచ్చేట్లు లేదు. ఎవరిని అడిగినా జనసేనకు మహా అయితే ఓ నాలుగో లేకపోతే ఐదు అసెంబ్లీలు గెలుస్తుందని మాత్రమే అంటున్నారు. అంటే గెలుస్తాయనే అసెంబ్లీలు కూడా పవన్ వల్ల కాదట. పోటీ చేసిన అభ్యర్ధుల సొంతబలం మీదే అన్నమాట. అసలింతకీ విషయం ఏమిటంటే, పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్ధులందరినీ మీటింగుకు రమ్మని కబురు చేస్తే వచ్చింది 14 మంది మాత్రమే సుమా ?


మరింత సమాచారం తెలుసుకోండి: