నూటికి వెయ్యిశాతం రాబోయేది తెలుగుదేశంపార్టీ ప్రభుత్వమే అంటూ చంద్రబాబునాయుడు జోస్యం చెప్పారు. మొన్నటి ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధులతో జరిగిన సమీక్ష సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతు సొంతడబ్బా బ్రహ్మాండంగా కొట్టుకున్నారు. అందరూ రాబోయేది వైసిపి ప్రభుత్వమే అని చెబుతన్న విషయాన్ని ఎద్దేవా చేశారు. ఎందుకంటే సమీక్షలో మాట్లాడిన మంత్రులు కళా వెంకటరావు, కాలువ శ్రీనివాసులు లాంటి వారంతా పోలింగ్ బ్రహ్మాండంగా జరిగిందని చెప్పారు.

 

ఏ నియోజకవర్గంలోని  పోలింగ్ కేంద్రం తీసుకున్నా మెజారిటీ ఓట్లు టిడిపికి మద్దతుగానే పడినట్లు మంత్రులు, అభ్యర్ధులు చెప్పారు. ఒకరు కాదు ఇద్దరు కాదు సమీక్షలో మాట్లాడిన వారిలో చాలామంది ఇలాగే మాట్లాడారు. దాంతో చంద్రబాబు జోక్యం చేసుకుంటూ నూటికి వెయ్యిశాతం రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది టిడిపినే అని చెప్పారు.

 

ఎన్నికల వ్యయం పెరిగిపోయిన విషయంలో చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేయటమే విచిత్రంగా ఉంది. అసలు ఎన్నికల వ్యయం పెంచేసిందే చంద్రబాబు. అలాంటిది మొన్నటి ఎన్నికల నిర్వహణ పరమ చెత్తగా ఉందనటం విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఏర్పాట్లు చేయాల్సింది చంద్రబాబు ప్రభుత్వమే కదా ? ఎన్నికల కమీషన్ కు అంటూ ఏర్పాట్లు చేయటానికి ప్రత్యేకంగా సిబ్బందంటూ ఎవరు ఉండరు.

 

చంద్రబాబు చెబుతున్నట్లు నూటికి వెయ్యిశాతం టిడిపినే అధికారంలోకి వచ్చే పరిస్దితే ఉంటే ఇంతలా యాగీ చేయరు. పోలింగ్ మొదలైన రెండు గంటలకే ఈవిఎంలు 30 శాతం పనిచేయటం లేదని, పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు లేవంటూ చంద్రబాబు ఎంత గోల చేశారో  అందరూ చూసిందే.  టిడిపి అధికారంలోకి మళ్ళీ వస్తుందో లేదో ఎవరికీ తెలీదు. అధికారంలోకి వచ్చే విషయంలో చంద్రబాబు అండ్ కోకే అనుమానం ఉన్నట్లుంది. అందుకనే జగన్, కెసియార్, మోడితో పాటు ఎన్నికల కమీషన్ ను కలిపి అన్ని శాపనార్ధాలు పెట్టింది.

 

ఇక జాతీయ స్ధాయిలో ఎన్నికల గురించి మాట్లాడుతూ  బిజెపికి ఎన్ని సీట్లు వస్తాయ్ ? అనే విషయంలో కూడా చంద్రబాబు జోస్యం చెప్పారు. బిజెపికి మహాఅయితే ఓ 160 సీట్లు వస్తాయని చెప్పారు. చంద్రబాబు చెప్పిన లెక్క ప్రకారమే బిజెపి సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవుతుందని అర్ధమవుతోంది. చంద్రబాబే బిజెపికి 160 వేశారంటే ఇంకొన్ని సీట్లు పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సరే ఎలా చూసినా కేంద్రంలో మళ్ళీ రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వమే అని అర్ధమవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: