ఇంటర్మీడియట్ అంటేనే అటూ ఇటూ కానీ దశ. విద్యార్ధికి భవిష్యత్తు బాట వేసే మాధ్యమ విద్య అది. అటువంటిది ఇంటర్ విద్యార్ధి జీవితంతో చెలగాటం ఆడితే ఎలా. వారిది వికసించీ వికసించని దశ. ఆ అనుభవ రాహిత్యం వారిని బలి తీసుకుంటే ఈ తప్పుకు బాధ్యత ఎవరు వహిస్తారు.


ఇపుడు అదే అందరినీ కలచివేస్తోంది. ఎన్నడూ లేని విధంగా పిట్టల్లా ఇంటర్ విద్యార్ధులు రాలిపోతున్నారు. ముక్కు పచ్చలారని పిల్లలు పదహారు మంది వరకూ ఇప్పటికీ  ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తోంది. ఎంతమంది మనో వేదనతో ఉన్నారో, మరెంతమంది పిచ్చి పనులు చేస్తారోనని తెలంగాణా సమాజంతో పాటు యావత్తు దేశం ఉలిక్కిపడి ఇటువైపు చూస్తోంది. 


ఇంటర్ ఫస్ట్ ఇయర్లో టాప్ ర్యాంక్, అదే సెకండ్ ఇయర్ లో ఫెయిల్. ఇదేం దిద్దుడు, ఐదేం పరీక్షా విధాన‌మని తల్లితండ్రులు గగ్గోలు పెడుతున్నారంటే వారి బాధకు ఓ అర్ధం ఉంది. ఇంటర్ బోర్డ్ ఎదుట ఈ రోజు తల్లితండ్రుల కన్నీరే ఏరులై ప్రవహించింది. దేశంలో ఎపుడూ ఈ తరహా ఘటనలు జరగలేదు. ఇది పూర్తిగా  బోర్డ్ వైఫల్యమే. దీని వల్ల తెలంగాణా సర్కార్ పరువు పోయింది. ఇప్పటికైనా తప్పులు దిద్దుకోవాలి. బాధ్యత వహించాలి. తల్లిదండ్రుల గర్భ శోకం తీర్చలేకపోయినా మిగిలిన పిల్లల భవిష్యత్తు నైనా భద్రంగా చూడాలి. ఆ దిశగా వేగంగా అడుగులు పడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: