ఇంట‌ర్ ఫ‌లితాల అవ‌క‌త‌వ‌క‌ల‌పై వివాదం కొన‌సాగుతూనే ఉంది. వివిధ విద్యార్థి సంఘాల నేత‌లు క‌ధం తొక్కారు. విద్యార్థుల‌కు జ‌రిగిన అన్యాయంపై గొంతొత్తెతారు. ఇంట‌ర్‌బోర్డు కార్యాల‌యం ఎదుట నిర‌స‌నకు దిగారు.. ధ‌ర్నా చేప‌ట్టారు. ఓ ద‌శ‌లో లోప‌లికెళ్లే ప్ర‌య‌త్నం చేశారు. కానీ అప్ప‌టికే అక్క‌డ మోహ‌రించిన పోలీసులు విద్యార్థుల‌ను అడ్డుకున్నారు. ఈ క్ర‌మంలో వారి మ‌ధ్య తోపులాట జ‌రిగింది. అవ‌క‌త‌వ‌క‌ల‌కు కార‌ణ‌మైన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేసిన విద్యార్థి సంఘాల నేత‌లు ఇంట‌ర్ బోర్డు కార్య‌ద‌ర్శి రాజీనామా చేయాల‌ని నిన‌దించారు. 


ఇక గ్లోబెరీనా అనే సాఫ్ట్‌వేర్ సంస్థ‌కు ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు ప్ర‌శ్న‌ప‌త్రాల మూల్యాంక‌నాన్ని ఇచ్చార‌ని విద్యార్థి సంఘాలు ఆరోపించ‌గా.. అధికారులు వాటిని తోచిపుచ్చారు. సంస్థ‌కు ప్ర‌భుత్వానికి ఎలాంటి సంబంధం లేద‌న్నారు. 4 కోట్ల కాంట్రాక్టును బోర్డు అధికారులు ఉల్లంఘించి గ్లోబెరీనా సంస్థ‌కు అప్ప‌గించార‌న్న విమ‌ర్శ‌ల‌కు వివ‌ర‌ణ ఇచ్చారు. అటు ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు ఫ‌లితాల వివాదం నేప‌థ్యంలో ప్రభుత్వం ఇప్ప‌టికే త్రిస‌భ క‌మిటీ వేసింది. 


ఇంట‌ర్  బోర్డు ఎదుట కాంగ్రెస్ నేత‌లు రేవంత్ రెడ్డి, సంప‌త్ కుమార్ కూడా ధ‌ర్నాలో పాల్గొని విద్యార్థుల‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. విద్యార్థుల‌కు న్యాయం చేయాల‌ని డిమాండ్ చేశారు. ఇంట‌ర్ బోర్డు అధికారులపై చర్య‌లు తీసుకోవాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. అయితే పోలీసులు రేవంత్ సంప‌త్‌ల‌ను అరెస్ట్ చేసి బేగంపేట పీఎస్‌కు త‌ర‌లించారు. 


అటు కార్పొరేట్ కాలేజీల ధ‌న‌దాహానికి విద్యార్థులు బ‌ల‌వుతున్నారా..? అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయి.. జ‌రిగితే విద్యార్థుల భ‌విష్య‌త్న‌నే కాదు.. ప్రాణాల‌తో చెల‌గాట‌మాడుతున్న‌దెవ‌రు..? 99 మార్కుల రావాల్సిన స్టూడెంట్‌కు సున్నా మార్కులేసిన పాపం ఎవ‌రిది. ? 16 మంది చిన్నారుల మృతికి బాధ్యులెవ‌రంటూ విద్యార్థి లోకం ప్ర‌శ్నిస్తోంది.. బాధ్యుల‌ను క‌ఠినంగా శిక్షించాలంటూ ధ‌ర్నాకు దిగింది.  స్టూడెంట్స్‌కు మ‌ద్ద‌తుగా పేరెంట్స్ సైతం రోడ్డెక్కారు. విద్యార్ఠుల భ‌విష్య‌త్‌పై ఇంత నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తారా అంటూ ఇంట‌ర్ బోర్డును నిల‌దీశారు. 


ఇంత పెద్ద గొడ‌వ జ‌రుగుతుంటే ఇంట‌ర్ బోర్డు మాత్రం అంత ఈజీగా ఎలా తీసుకుంటోంద‌ని విద్యార్థుల త‌ల్లిదండ్రులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇంట‌ర్ ఫ‌లితాల త‌ర్వాత 16 మంది విద్యార్థులు చ‌నిపోయారు. రెయింబ‌వళ్లు క‌ష్ట‌పడినా ఫెయిల్ అయ్యార‌ని క‌న్నీరుమున్నీర‌వుతున్నారు. తీవ్ర మ‌న‌స్తపం చెందారు. ఏ గ్రేడ్ తో పాస్ అవుతామ‌ని ధీమా గా ఉన్న విద్యార్థుల‌కు ఫ‌లితాల్లో జీరో మార్కులు ప‌డేస‌రికి కన్నీరుమున్నిర‌వుతున్నారు. మ‌రోవైపు ఇటు జిల్లాలో టాప‌ర్‌గా నిల‌వాల్స‌న నిరుపేద విద్యార్థికి తీవ్ర అన్యాయం జ‌రిగింది. విద్యార్థిని పేప‌ర్ దిద్దే క్ర‌మంలో పూర్తి నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించి మార్కులు వేయాల్సిన చోట రెండు సున్నాలు వేశారు. 


ఇటు ఫ‌లితాల్లో కార్పొరేట్ కాలేజీల మాయాజాలం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని అన్నారు విద్యార్థుల త‌ల్లిదండ్రులు. ప‌రీక్ష‌ల‌కు హాజ‌రుకాలక‌పోయినా ఎలా పాస్ అయ్యారంటూ ప్ర‌శ్నించారు. దీనిపై ప్ర‌భుత్వం సీరియ‌స్ గా ఆలోచించాల‌ని.. లేదంటే ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉంటుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 
ఇదిలా ఉంటే మ‌రోవైపు ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్షా ఫ‌లితాల‌పై పూర్తిస్థాయి ద‌ర్యాప్తు చేయిస్తామ‌న్నారు టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌. ఈ విష‌యంలో ఎలాంటి అపోహాలు న‌మ్మొద‌న్నారు. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారాయ‌న‌. రిజ‌ల్స్ విష‌యంలో విద్యార్థులు.. త‌ల్లిదండ్రులు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. 


ఇటు ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌పై అపోహాల‌ను నివృత్తి చేసేందుకు త్రిస‌భ్య క‌మిటీని ఏర్పాటు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి వెల్ల‌డించారు. తెలంగాణ స్టేట్ టెక్నాల‌జిక‌ల్ స‌ర్వీసెస్ ఎండీ వెంక‌టేశ్వ‌ర‌రావుతో పాటు హైద‌రాబాద్‌కు చెందిన ప్రొఫెస‌ర్ వాస‌న్‌, ఐఐటీ ప్రొఫెస‌ర్ నివాంత్‌ల‌తో కూడి క‌మీటీని ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు. ఫ‌లితాల విష‌యంలో వెంట‌నే ద‌ర్యాప్తు జ‌రిపి మూడు రోజుల్లో నివేదిక స‌మ‌ర్పించాల‌ని క‌మిటీని ఆదేశించారు. 
చివ‌ర‌కు ఈ విష‌యంపై  విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి స్పందించారు. అధికారులు చేసిన త‌ప్పుల‌ను ఒప్పుకున్నారు. 

ఇంటర్ ఫలితాలకు సంబంధించిన ఆరోపణలపై త్రిసభ్య కమిటీ విచారణ జరిపి, మూడు రోజుల్లో నివేదిక ఇవ్వనుందని అన్నారు. సిబ్బంది తప్పు చేసినట్టుగా తేలితే క్రమశిక్షణా  చర్యలు ఉంటాయని అన్నారు.  తప్పుడు మూల్యాంకనం చేసిన సిబ్బందికి రెండు వేలు జరిమానా విధించనున్నామనీ, ఈ జరిమానాను మరింత పెంచే ఆలోచన కూడా ఉందని స్పష్టం చేశారు. రీ వెరిఫికేషన్ లో సిబ్బంది వైపు నుంచి తప్పు జరిగిందని తేలితే, సదరు విద్యార్థులకు ఫీజు తిరిగి చెల్లించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టుగా చెప్పారు. ఫెయిలైన విద్యార్థులు ఆత్మహత్యలకి పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: