రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు, శాశ్వ‌త మిత్రులు ఉండ‌ర‌ని అంటారు. ఏదైనా.. ఏమైనా.. ఏమ‌నుకున్నా.. ఆ వెంట‌నే క‌లిసి పోవడం, స‌మ‌యానికి త‌గిన విధంగా వ్య‌వ‌హ‌రించ‌డం అనేవి రాజ‌కీయ నేత‌ల‌కు వెన్న‌తో పెట్టిన విద్య‌. అయితే, తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం చంద్ర‌బాబులు ఇద్ద‌రూ కూడా శాశ్వ‌త శ‌త్రువులుగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఒక‌రిపై ఒక‌రు నిందారోప‌ణ‌లు చేసుకోవ‌డం నుంచి స‌వాళ్లు రువ్వుకునే వ‌ర‌కు కూడా ఈ ఇద్ద‌రు త‌మ త‌మ ప్ర‌తాపాల‌ను చూపి స్తున్నారు. ప్ర‌తి విష‌యంలోనూ ఆచి తూచి వ్య‌వ‌హ‌రించే చంద్ర‌బాబు కూడా కేసీఆర్ విష‌యంలో మాత్రం ఒకింత అస‌హ‌నం చూపిస్తున్నారు. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. 


ముఖ్యంగా డిసెంబ‌రులో జ‌రిగిన తెలంగాణ ఎన్నిక‌ల్లో టీడీపీ అధినేత‌గా చంద్ర‌బాబు అక్క‌డ కాంగ్రెస్‌తో జ‌త‌క‌ట్టి.. తెలం గాణ‌లో కేసీఆర్ పాల‌న‌ను ప‌డ‌గొట్టేందుకు చేసిన ప్ర‌య‌త్నం ఈ ఇద్ద‌రు నాయ‌కుల మ‌ధ్య మ‌రింత అఘాతం పెంచింది. ఈ క్ర‌మంలోనే శ‌త్రువుకు శ‌త్రువుగా ఉన్న జ‌గ‌న్ ను చేర‌దీసిన కేసీఆర్‌.. ఏపీలో అధికార పీఠాన్ని అందుకోవాల‌నే ప్ర‌య త్నం చేస్తున్న జ‌గ‌న్‌కు ఇతోధికంగా సాయం చేశారు.ఇక్క‌డ జ‌గ‌న్ అధికారంలోకి రావ‌డం క‌న్నా.. కూడా చంద్ర‌బాబు ఏపీలో ఓడిపోవాల‌నే ప్ర‌ధాన ల‌క్ష్యంతో కేసీఆర్ ముందుకు వెళ్లారు. ఈ క్ర‌మంలోనే త‌మ రాష్ట్ర రాజ‌కీయాల్లో వేలు పెట్టిన చంద్ర‌బాబుకు తాము కూడా అంతే రీతిలో బ‌హుమానం తిరిగి ఇస్తామ‌ని కేసీఆర్ అప్ప‌ట్లోనే ప్ర‌క‌టించారు. 


దీంతో చంద్ర‌బాబుకు కేసీఆర్ రిట‌ర్న్‌గిఫ్ట్ విష‌యంపై అనేక ర‌కాల ప్ర‌చారం సాగింది. ఈ గిఫ్ట్ ఏ రూపంలో ఉంటుంది? ఎలా ఇస్తారు? అనే చ‌ర్చ జోరుగా సాగింది. ఏపీ ఎన్నిక‌ల స‌మ‌యంలో దీనిపై మ‌రింత‌గా చ‌ర్చ జ‌రిగింది. ప్ర‌తి ఒక్క‌రూ దీనిపైనే చ‌ర్చించుకున్నారు. చంద్ర‌బాబు ఏకంగా రిటర్న్ గిఫ్ట్ లు ఇలాంటి వంద వ‌ర‌కు తాను ఇవ్వ‌గ‌ల‌న‌ని చెప్పుకొచ్చా రు. అయితే, ఈ రిట‌ర్న్ గిఫ్ట్ విష‌యం మాత్రం ఇప్ప‌టికీ ఓ ప్ర‌శ్నగానే ఉండిపోయింది. అయితే, తాజాగా దీనిపై కేసీఆర్ అనుచ‌రులు, టీఆర్ ఎస్ పార్టీ నాయ‌కులు మెల్ల‌గా నోరు విప్పారు. ఈనెల 11న జ‌రిగిన ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాలు మే 23న విడుద‌ల కానున్నాయి.


ఈ నేపథ్యంలో ఏపీలో జ‌నం నాడి తెలిసిన నాయ‌కుడిగా చంద్ర‌బాబుకు ప్ర‌జ‌లు వ్య‌తిరేకంగా ఉన్నార‌నే విష‌యం కేసీ ఆర్ గ్ర‌హించారు. ఈ క్ర‌మంలోనే 23 నాటి ఫ‌లితాల్లో జ‌గ‌న్ గెలుపు ఖాయ‌మ‌ని, ఆయ‌న సీఎంగా ఎన్నిక‌వ‌డం త‌థ్య‌మ‌ని కేసీఆర్ ఇప్ప‌టికే ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారు. ఈ క్ర‌మంలోనే సీఎంగా జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారం చేసే రోజున తాను ఏపీకి వ‌చ్చి.. జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మంలో పాల్గొంటార‌ని అంటున్నారు. ఇదే చంద్ర‌బాబుకు కేసీఆర్ ఇచ్చే రిట‌ర్న్ గిఫ్ట్ అని చెబుతున్నారు. మ‌రి ఇదే నిజ‌మైతే.. చంద్ర‌బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ అత్యంత ద‌గ్గ‌ర‌లోనే ఉంద‌ని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: