పార్టీల్లో  పై నుండి క్రింద వరకూ ప్రతీ పనిని అధినేతలే చూసుకోలేరు. ఏ పనైని చెప్పింది చెప్పినట్లు, అవసరాలు గమనించి చెప్పంది కూడా చేసుకురాగలిగే సామర్ధ్యమున్న నమ్మకస్తులు చాలా అవసరం ప్రతీ అధినేతకు. ఈ విషయంలో  వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి అదృష్టవంతుడనే చెప్పాలి. ఎందుకంటే పార్టీ పరంగా జగన్ సాధించిన ప్రతీ విజయం వెనుక విజయసాయిరెడ్డి పాత్రను చెప్పుకుని తీరాలి.

 

2014 ఎన్నికలతో పోల్చుకుంటే 2019లో పార్టీ పరిస్ధితి చాలా మెరుగైందనే చెప్పాలి.  ఆ తేడాకు ప్రధాన కారణం విజయసాయిరెడ్డి అనే చెప్పాలి. విజయసాయి లాంటి వ్యక్తిని పక్కన పెట్టుకోవటమే జగన్ సాధించిన పెద్ద విజయం. భవిష్యత్తును ఊహించే జగన్ తన అవసరాల కోసం విజయసాయిని రాజ్యసభ సభ్యుడిని చేసి ఢిల్లీకి పంపారు. ఢిల్లీ రాజకీయాల్లో విజయసాయే, జగన్ అవసరాలకు అనుగుణంగా వ్యవహారాలు చక్కపెడుతున్నారు.

 

విజయసాయి గురించి చంద్రబాబునాయుడు అండ్ కో ఇప్పటికి ఓ లక్షసార్లు మండిపడుంటారంటే పార్టీలో విజయసాయి ఎంత కీలకంగా ఉన్నారో అర్ధమవుతోంది. రాజ్యసభ సభ్యుడు అవ్వగానే పార్టీ అవసరాల కోసం ఉత్తరాంధ్రలో మకాం పెట్టారు. ఎందుకంటే పోయిన ఎన్నికల సమయానికి పార్టీ ఉత్తరాంధ్రలో చాలా బలహీనం. అలాంటిది పార్టీలో క్రియాశీలకం కాగానే ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టారు.

 

అదే సమయంలో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు వీలుగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పికె)ను జగన్ కు పరిచయం చేసింది కూడా విజయసాయేనట. రేపటి ఫలితాలు ఎలాగుంటాయో ఇపుడెవరు చెప్పలేరు. కానీ వైసిపిదే అధికారం అనే స్ధాయిలో పార్టీకి ఊపొచ్చిందంటే తెరవెనుక పికె బృందం చేసిన కృషి చాలానే ఉంది. ఇక వివిధ పార్టీల్లో నుండి బలమైన నేతలను వైసిపిలోకి రప్పించటం, చాలా చోట్ల అభ్యర్ధులను ఫైనల్ చేయటంలో కూడా విజయసాయి కృషి ఉందని పార్టీ నేతలే చెబుతుంటారు.

 

ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుండి చంద్రబాబునాయుడును విజయసాయి నీడలా వెన్నాడుతున్నారు. చంద్రబాబు వేసే ప్రతీ అడుగు వైసిపికి తెలిసిపోతోందంటే టిడిపిలో లేకపోతే ప్రభుత్వ యంత్రాంగంలో విజయసాయి నిఘా వ్యవస్ధ ఎంత బలంగా ఉందో అర్ధమైపోతోంది. ఎన్నికల సమయంలోనే ఇంత కీలకమైన పాత్ర పోషించిన విజయసాయి రేపు వైసిపి అధికారంలోకి వస్తే ఇంకెంత కీలకమవుతారో ఎవరికి వారు ఊహించుకోవాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: