తెలుగుదేశంపార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే విషయమై పార్టీ నేతల్లో ఓ క్లారిటీ వచ్చేసినట్లుంది.  మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన ఎంఎల్ఏ, ఎంపి అభ్యర్ధులతో చంద్రబాబునాయుడు చాలా సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. మొన్నటి వరకూ గెలుపు విషయంలో పార్టీ అభ్యర్ధుల్లో చాలామంది ఒక దారి అయితే చంద్రబాబుది మాత్రం ఒకదారిగా ఉండేది. గెలుపు అవకాశాల తక్కువే అని నేతలంటుంటే చంద్రబాబు మాత్రం టిడిపికి 130 సీట్లు ఖాయమని చెప్పేవారు.

 

 నిజానికి పోలింగ్ జరగ్గానే చంద్రబాబులో కూడా మళ్ళీ గెలుపుపై ఏమాత్రం నమ్మకాల్లేవు. కానీ ఇదే పరిస్ధితి కౌంటింగ్ వరకు కంటిన్యు అయితే అసలు మే 23వ తేదీ కౌంటింగ్ ప్రక్రియకు నేతలే దొరకరన్న ఉద్దశ్యంతో చంద్రబాబు యు టర్న్ తీసుకున్నారు. టిడిపికి 130 సీట్లొస్తాయంటూ ఊదరగొడుతున్నారు ప్రతీరోజు. ఈ నేపధ్యంలోనే అభ్యర్ధులతో సమీక్ష జరిగింది.

 

సమీక్షల్లో పాల్గొన్న అభ్యర్ధులంతా ఒకచోట చేరారు కదా దాంతో తమ నియోజకవర్గాల్లో గెలుపోటములపై ఎవరికి వారుగా మాట్లాడుకున్నారు. దాంతో తమకు గెలుపు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు ఎవరికి వారుగా నిర్ధారణకు వచ్చారని సమాచారం. అందుకు ఉదాహరణగా పశ్చిమగోదావరి జిల్లాలోని దెందులూరు నియోజకరవర్గాన్నే చూపుతున్నారు.

 

 పోలింగ్ కు ముందు కూడా దెందులూరు అభ్యర్ధి చింతమనేని ప్రభాకర్ విజయం ఖాయమనే అనుకున్నారు. తీరా పోలింగ్ తర్వాత మాత్రం సీన్ రివర్స్ అయిపోయిందట. చింతమనేనికి వ్యతిరేకంగాను, వైసిపి అభ్యర్ధికి అనుకూలంగాను సైలెంట్ ఓటింగ్ బాగా జరిగిందని స్వయంగా చింతమనేనే చెప్పారట. ఖాయంగా గెలుస్తాడని అనుకున్న చింతమనేని గెలుపే కష్టమనుకున్నపుడు తమ పరిస్ధితి ఏంటనే భయం మిగిలిన వారిలో పెరుగుతోంది.

 

మొత్తం మీద అభ్యర్ధులందరూ ఒకచోట చేరటం వల్లే తేలిందేమిటంటే టిడిపి గెలుపు చంద్రబాబు చెబుతున్నట్లుగా ఖాయం కాదని. పసుపు కుంకుమ కారణంగా ఆడవాళ్ళ ఓట్లన్నీ గుండుగుత్తగా టిడిపికే పడలేదని కొందరు అభ్యర్ధులు విశ్లేషించారట. ప్రభుత్వం నుండి డబ్బులు అందుకున్న వాళ్ళల్లో వైసిపికి బలమైన మద్దతుదారులు కూడా ఉన్నారని తేలిందట. అసలు చంద్రబాబు మాటల్లోనే విజయంపై ధీమా వ్యక్తం కాకపోవటంతో  టిడిపి నేతల్లో టెన్షన్ మరింత పెరిగిపోతోంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: