ఫైర్‌బ్రాండ్ నేత‌గా ముద్ర‌ప‌డిన కాంగ్రెస్ నాయ‌కుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి ఇప్పుడు రాజ‌కీయంగా తీవ్ర డైలామాలో ప‌డ్డారు. ఆయ‌న చేస్తున్న వ్యాఖ్య‌లు, కొద్దికాలంగా జ‌రుగుతున్న ప్ర‌చారం కారణంగా త‌న ప్ర‌యాణం ఎటు సాగ‌నుంద‌నే విష‌యంపై ఆయ‌న‌కే స్ప‌ష్ట‌త లేని స్థితి నెల‌కొంది. ఇటీవ‌ల జ‌రిగిన ప్ర‌చార‌మైన సీఎల్పీ విలీనంతో ఇంకా డైలామా నెలకొంది. త‌న మాట‌కు ఏ మాత్రం విలువ లేన‌పుడు...తాను స్పందించ‌డం ఎందుక‌నే నిర్వేద‌పూరిత స‌మాధానం జ‌గ్గారెడ్డి ఇచ్చేవ‌ర‌కు ప‌రిస్థితి చేరిపోయింది.


భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య టీఆర్ఎస్ పార్టీలో చేరుతార‌ని, ఈ చేరిక‌తో శాసనసభలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోనుందనే ప్ర‌చారం పెద్ద ఎత్తున జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. దీంతో జ‌గ్గారెడ్డి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ, పార్టీ మార్పులపై ఖండనలకు విలువలేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను పార్టీ మారుతానా అనే ప్రచారానికి కాలమే సమాధానం చెబుతుందన్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్, సీఎల్ప నేత భట్టి విక్రమార్క తప్పితే అందరి మీద ఫోకస్ పెట్టిందన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా ఉత్తమ్ మంచి ప్రయత్నం చేస్తున్నారని దానికి సాక్ష్యం తానేన‌ని అన్నారు.


కాంగ్రెస్ పార్టీ మర్రి చెట్టులాంటిదని జ‌గ్గారెడ్డి అభివర్ణించారు. జగ్గారెడ్డి పార్టీ మారినా.. పార్టీ కార్యకర్తలు చెక్కుచెదరరు అన్నారు. కాంగ్రెస్ పార్టీని ఎవరు వీడినా పార్టీ సజీవంగా ఉంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. పార్టీ మారినవాళ్లు కావాలని పార్టీ మీద విమర్శలు చేయడం తప్పే అవుతుందన్నారు. ఇప్ప‌టికే పార్టీ వీడిన నేత‌లు వ్యక్తిగత కారణాలతో పార్టీ మారుతున్నట్టున్నారనే అనుమానాలు వ్యక్తం చేశారు. కాగా, ఒక‌నాడు ఫైర్ బ్రాండ్ నేత‌గా ఉన్న జ‌గ్గారెడ్డి నేడు...త‌న మాట‌కు విలువ లేకుండా పోయింద‌నే వ్యాఖ్య‌లు చేయ‌డం...ఆస‌క్తిక‌రంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: