తెలుగుదేశం పార్టీలో ఇపుడు గెలుపు కలవరం పట్టుకుంది. అయిదేళ్ల పాటు పాలించిన పార్టీ. సుదీర్ఘమైన అనుభవం కలిగిన నాయకత్వంలోని పార్టీ. డక్కా మెక్కీలు తిన్న మేటి పోరాట యోధులు ఉన్న పార్టీ ఇపుడు విజయానికి దారేదీ అంటూ వెతుకులాట సాగిస్తోంది. పార్టీ అభ్యర్ధులతో చంద్రబాబు సాగించిన గంటల తరబడి మేధో  మధనం గెలుపు ఆశలను పెంచిందా


అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఎంత చెప్పినా ప్రభుత్వ వ్యతిరేకత కళ్ళకు కనిపిస్తోంది. మరో వైపు వివిధ వర్గాలు సర్కార్ కి దూరంగా జరిగిన పరిస్థితి ఉంది. బలమైన ప్రతిపక్షం ఇంకో వైపు ఉంది. పార్టీలో వర్గ పోరు, అసమ్మతి,  సిట్టింగుల మీద జనాల్లో పెరిగిన అసంత్రుప్తి ఇవన్నీ చూసుకున్నపుడు గెలుపు ధీమా ఎందుకు ఉంటుంది. ఐతే టీడీపీ మాత్రం ఒకే ఒక అశను పెట్టుకుంది. దాంతోనే గెలుపు గోదారిని ఈదేస్తామంటోంది.


అదే పసుపు కుంకుమ పధకం. మహిళలంతా పెద్ద ఎత్తున ఓట్లువేశారు కాబట్టి ఆ ఓట్లు అన్నీ మాకే అంటూ టీడీపీ నేతలు చెబుతున్నారు. దీనికి లాజిక్ ఉందా అంటే లేదనే చెప్పాలి. డ్వాక్రా  మహిళలనంతా గంపగుత్తగా ఓట్లేయడానికి టీడీపీ ఒక్కటే పార్టీ కాదుగా, వైసీపీ వారూ ఉన్నారు. వారు హామీలు ఇచ్చారు. వారు కూడా తాయిలాలు పంచారు. మరి అలా  ఒకే పక్షంగా ఓట్లు ఎలా పడిపోతాయి.


ఇక ముసలి వాళ్ళకు పించన్ల విషయం తీసుకున్నా ఆ హామీ జగన్ ఇచ్చినది అని అందరికీ తెలిసిపోయింది. అందువల్ల పూర్తిగా ఆ ఓట్లు టీడీపీకే పడుతాయని కూడా ఎవరూ లెక్కలు వేయలేరు. ఈ రెండూ తప్ప గెలిపించేందుకు ఇపుడు టీడీపీకి కొత్తగా అంశాలేవీ లేకపోవడమే తమ్ముళ్ళలో ఆందోళన పెంచుతోంది. చూడాలి మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: