ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు కచ్చితంగా నెల రోజుల సమయం ఉంది.  ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థులతో పాటు రాజకీయ విశ్లేషకులు, మీడియా వర్గాలతోపాటు సగటు ఓటర్ సైతం ఈ సారి ఏపీ సీఎం పీఠం ఎవరు ? దక్కించుకుంటారు అని ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభావం ఎన్నికల్లో నామమాత్రంగానే ఉందన్నది వాస్తవం. మహా అయితే పవన్ వేళ్ళ మీద లెక్క పెట్టే స్థాయిలో సీట్లు గెలుచుకోవడంతో పాటు కొన్ని నియోజకవర్గాల్లో బలంగా ఓట్లు చీల్చ‌డం వరకు మాత్రమే చేయగలరని తేలిపోయింది. ఇక ఫైనల్ గా ఏపీ సీఎం పీఠం కోసం చంద్రబాబు వర్సెస్ జ‌గ‌న్‌ మధ్య రసవత్తర పోరు నడుస్తోంది. వీరిలో ఎవరు ఎన్నికల్లో విజయం సాధించి ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు అన్నది ఒక్కటి మాత్రమే తేలాల్సి ఉంది.  ఇక ఈ ఎన్నికల్లో  సీఎం పీఠం సంగతి కాసేపు పక్కన పెడితే పలువురు కీలక నేతలు గెలుస్తారా ? వారి నియోజకవర్గాల్లో వారికి ఎంత ? మెజార్టీ వస్తుంది అన్న దానిపై సైతం ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. 


వైసీపీ అధినేత జగన్ తన సొంత నియోజకవర్గమైన పులివెందుల నుంచి పోటీ చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు  1989 నుంచి కుప్పంలో పోటీ చేస్తూ ఓటమి అన్నది లేకుండా వరుసగా ఘన విజయాలు సాధిస్తూ వస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఈ ఎన్నికల్లో తొలిసారి ప్రత్యక్షంగా బరిలోకి దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.  లోకేష్ కు ఇప్పటికే మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఈ ఎన్నికల్లో లోకేష్ పోటీ చేసేందుకు ఆరు, ఏడు నియోజకవర్గాలపై చంద్రబాబు పెద్ద ఎత్తున కసరత్తు చేశారు. చివరకు రాజధాని ఏరియాలో ఉన్న గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి లోకేష్ బరిలో ఉన్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సొంత జిల్లా పశ్చిమ గోదావరిలోని భీమవరంతో పాటు, విశాఖ జిల్లాలోని గాజువాక నుంచి పోటీ చేశారు. జగన్, చంద్రబాబు  గెలుపుపై ఎలాంటి సందేహాలు లేవు. రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్, నారా లోకేష్ గెలుపుపై మాత్రం మిశ్ర‌మ‌ స్పందన కనిపిస్తోంది. 


జగన్, చంద్రబాబు నియోజకవర్గాల్లో  వారి మెజారిటీలు ఎంత ఉంటాయి అన్న అంశం పైనే ప్రధానంగా చర్చలు నడుస్తున్నాయి.ఇక లోకేష్ గెలుపు ఊగిస‌లాట‌లో ఉంది. లోకేష్ గెలుస్తాడని టీడీపీ వాళ్లు చెబుతుంటే లేదు లేదు వైసీపీ నుంచి గట్టిపోటీ ఎదురైంది... కొన్ని సామాజిక వర్గాలు లోకేష్ కు వ్యతిరేకంగా పనిచేశాయి. ఈసారి మంగళగిరిలో లోకేష్‌కు త‌ప్ప‌ద‌ని చెబుతున్న వాళ్ళు కూడా ఎక్కువే ఉన్నారు. లోకేష్ గెలిస్తే స్థానికంగా తమకు రాజకీయంగా మనుగడ ఉండదు అన్న సందేహంతో నియోజకవర్గంలో బలంగా ఉన్న ఓ సామాజిక వర్గం టిడిపికి ఓటు వేయలేదు అన్న చర్చ కూడా ఎక్కువగానే నడుస్తోంది.  ఇక వైసీపీ నుంచి గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఐదేళ్ల పాటు ప్రజా సమస్యలపై ఉద్యమించడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వంపై సైతం న్యాయ పరంగా అనేక పోరాటాలు చేసి స్థానికంగా రైతులకు అందుబాటులో ఉండటం ఆయనకు కలిసిరానుంది. 


ఇక భీమవరంలో వైసీపీ నుంచి గట్టి పోటీ ఎదురవ్వడంతో పవన్ గెలుపుపై సందేహం నెలకొంది. వాస్తవంగా చూస్తే ఎన్నికల ముందు వరకు గాజువాకలో పవన్ గ్యారెంటీగా గెలుస్తాడ‌న్న ధీమా జ‌న‌సేన వర్గాల్లో ఉంది. తీరా పోలింగ్ రోజున చూస్తే గాజువాకలో పవన్ కు వైసీపీ నుంచి గట్టి పోటీ ఎదురైనట్టు తెలుస్తోంది. ఇటు భీమవరంలోనూ పవన్ గెలుపుపై సందేహాలు ఉండడంతో నియోజకవర్గంలో ఓ ప్రధాన సామాజిక వర్గంతో పాటు, పవన్ సామాజిక వర్గంలో ఆర్థికంగా బలంగా ఉన్న వారు చందాలు వేసుకుని జనసేన తరపున ఓట‌ర్ల‌కు డబ్బులు తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఇక ఈ నలుగురు నేతల్లో చంద్రబాబు, జగన్ గెలుపుపై ఎవరికీ సందేహాలు లేవు. పవన్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ, మంగళగిరిలో లోకేష్ గెలుస్తారా ?  లేదా అన్నది చూడాలి. 


ఈ నలుగురు కీలక నేతల మెజార్టీలో ఎవరిది ఎక్కువగా ఉంటుంది అన్న దానిపై కూడా ఏపీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలు, బెట్టింగులు నడుస్తున్నాయి.  ఈ పోటీ నుంచి ఇప్పటికే లోకేష్, పవన్ తప్పుకున్నట్టు తెలుస్తుంది. ఇక కుప్పంలో చంద్రబాబు కంటే పులివెందులలో జగన్ కి ఎక్కువ మెజార్టీ వస్తుందని జగన్ చంద్రబాబు ఏమాత్రం అనుకునే పరిస్థితి లేదని గతంలో కంటే ఎన్నికల్లో చంద్రబాబు మెజారిటీ బాగా తగ్గిపోతుంది అని కూడా తెలుస్తోంది. జగన్‌కు ఈసారి పులివెందులలో లక్షకు పైగా ఓట్ల మెజారిటీ వస్తుందని కూడా సేమ్ బెట్టింగులు జరుగుతున్నాయి అంటే అక్కడ వార్‌ ఎలా ఉందో తెలుస్తోంది. ఏదేమైనా ఈ నలుగురు కీలకనేతల మెజార్టీ విషయంలో జగన్ ను మిగిలిన ముగ్గురు ఏమాత్రం అందుకునే పరిస్థితి లేదని ఈ విషయంలో జగన్ దే టాప్ అని ఓపెన్‌గా  చెప్పేయొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: