సార్వ‌త్రిక  ఎన్నికల్లో భాగంగా మూడో దశ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర‌ మోడీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా సహా పలువురు నేతలు, ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుజరాత్‌ సీఎం విజయ్ రూపానీ దంపతులు, ఓడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌, కేరళ సీఎం విజయన్‌లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌.. భువనేశ్వర్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ తన భార్య అంజలితో కలిసి ఓటేశారు. రాజ్‌కోట్‌లోని అనిల్‌ జ్ఞాన్‌ మందిర్‌ పాఠశాలలో వీరు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేరళ సీఎం పినరయి విజయన్‌.. కన్నూరు జిల్లాలోని పినరయిలో ఆర్‌సీ అమల బేసిక్‌ పాఠశాలలో ఓటేశారు. 


భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా గాంధీనగర్‌ నుంచి పోటీ చేస్తున్నారు. అమిత్‌ షా తన భార్య సోనాల్‌ షాతో కలిసి రనిప్‌లోని నిషాన్‌ హైయర్‌ సెకండరీ స్కూల్‌లో ఓటేశారు. ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికలతో 6 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. గుజరాత్‌లో 26 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. కేరళలో 20 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ కొనసాగుతోంది. 


ఇదిలాఉండ‌గా, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్.. ఈవీఎంల పనితీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా ఈవీఎంలు మొరాయిస్తున్నాయని, ఏ మీట నొక్కినా బీజేపీకే ఓటు పడుతుందని అఖిలేష్ ట్వీట్ చేశారు. పోలింగ్ సిబ్బందికి ఈవీఎంలు ఎలా ఆపరేట్ చేయాలో కూడా తెలియడం లేదన్నారు. ఇప్పటికే 350కి పైగా ఈవీఎంలను మార్చారని పేర్కొన్నారు. ఇది నేరపూరిత నిర్లక్ష్యమని అఖిలేష్ మండిపడ్డారు. ఎన్నికల కోసం రూ. 50 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: