రెండేళ్ల క్రితం వరకు దేశ రాజకీయ పరిస్థితులను నిశితంగా గమనిస్తే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో మళ్లీ ఎప్పుడైనా ఢిల్లీ పీఠం ఎక్కుతుందా ? అంటే కనుచూపుమేరలో కూడా ఆ అవకాశం లేదని అందరూ అనుకున్నారు. రెండేళ్ల క్రితం వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై తిరుగులేని అంచనాలు ఉన్నాయి. రెండేళ్లలో మోడీ గ్రాఫ్ క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. ఇందుకు మోడీ తీసుకున్న నిర్ణయాలు కొన్ని అయితే రాజకీయంగా ఆయన ఏకపక్ష, నియంతృత్వ విధానాలు మోడీ పతనావస్థకు చేర్చేశాయి. దేశంలో కేవలం బిజెపి మినహా మరే పార్టీ ఉండకూడదన్న లక్ష్యంతో రాజకీయం చేసిన మోడీ తీరు ఇప్పుడు ఏవగింపు కలిగిస్తోంది. రెండేళ్లలో జాతీయ రాజకీయాల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. బిజెపి ఖ‌చ్చితంగా గెలుస్తుంది అనుకున్న కర్ణాటకలో ఆ పార్టీ అధికారంలోకి రాలేదు. ఉత్తరప్రదేశ్‌లో ఎప్సీ + బీఎస్పీ కూటమి అక్కడ బిజెపికి ముచ్చెమటలు పట్టిస్తోంది.


గత ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా జరిగిన  పది లోక్‌స‌భ‌ సీట్ల ఉప ఎన్నికల్లో బిజెపి ఘోరంగా ఓడిపోయింది. గత డిసెంబర్‌లో జ‌రిగిన‌  తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ఘ‌డ్ లాంటి రాష్ట్రాల్లో బిజెపి అధికారంలోకి రాలేక పోయింది. వ‌రుస ఎదురుదెబ్బల‌తో బీజేపీ గ్రాఫ్ శరవేగంగా పడిపోయింది. తెలంగాణ లాంటి చోట్ల బిజెపి కేవలం ఒకే ఒక అసెంబ్లీ సీటుతో సరిపెట్టుకుంది అంటే ఆ పార్టీ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్నా మూడు రాష్ట్రాలను కోల్పోవడం కూడా మోడీకి పెద్ద ఎదురుదెబ్బ. ఇక సొంత రాష్ట్రమైన గుజరాత్ లో గెలిచేందుకు కూడా మోడీ ఎన్నో ఆపసోపాలు పడ్డారు. గత ఎన్నికల్లో 282 సీట్లతో మిత్రపక్షాలతో సంబంధం లేకుండా అధికారంలోకి వచ్చిన బీజేపీ. ఈ ఎన్నికల్లో 160 నుంచి 170లోపు సీట్ల‌కు మాత్ర‌మే  పరిమితమవుతున్న అంచనాలు వెలువడుతున్నాయి. 


దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 100 నుంచి 120 సీట్లు సాధించినా గొప్ప అన్నట్టుగా ఉంది. బిజెపి బలహీన పడుతుండటం అదే టైంలో  దేశంలో అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఆ మేరకు బలపడడంతో రేపు  బిజెపి లేదా కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే ఖ‌చ్చితంగా ప్రాంతీయ పార్టీల అవసరం తప్పనిసరి అవుతోంది. దక్షిణాదిలో బిజెపి 10 నుంచి 15 లోపు సీట్లకు మాత్రమే పరిమితం కానుంది. తమిళనాడులో డిఎంకె, కర్ణాటకలో జెడిఎస్‌తో పొత్తు కాంగ్రెస్ కు లభిస్తోంది. ఉత్తర భారతంలో యూపీ లాంటి చోట్ల బిజెపికి భారీగా సీట్ల కోత పడనుంది. పశ్చిమ బెంగాల్, ఒడిస్సా, బీహార్ లాంటి చోట్ల ఇదే పరిస్థితి రేపు ఎన్నికల ఫలితాల తర్వాత ఎవరికీ పూర్తి మెజార్టీ రాని పక్షంలో చాలా ప్రాంతీయ పార్టీలు మోడీకి సపోర్ట్ చేసేందుకు ఏమాత్రం సిద్ధంగా లేవు. మోడీ అంటే రగిలిపోతున్న మమతా బెనర్జీ, అఖిలేష్, మాయావతి, చంద్రబాబు లాంటి వాళ్ళు ఒక్కటై కాంగ్రెస్‌కు సపోర్ట్ చేస్తే రాహుల్ ప్రధానమంత్రి అయ్యేందుకు ఎక్కడో చిన్న ఆశ అయితే ఉన్నట్టే ప్రస్తుత రాజకీయ వాతావరణం కనిపిస్తోంది. మరి  రాహుల్‌కు భారతదేశ ప్రధానమంత్రి అయ్యే లక్ ఎంతవరకు ఉందో  ? ఎన్నికల ఫలితాల తర్వాత జరిగే రాజకీయమే డిసైడ్ చేయనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: