చంద్రబాబునాయుడును చూస్తుంటే పాపం అనిపిస్తోంది. ఏదో చేద్దామని అనుకుని మొదలుపెడితే ఇంకేదో అవుతోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో మొదలైన చంద్రబాబు కష్టాలు భూ కేటాయింపుల జీవోలు నిలిపేయటం దాకా కొనసాగుతునే ఉన్నాయి.

 

ఒకవిధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి  ఎల్వీ సుబ్రమణ్యం చంద్రబాబునాయుడుకు నిద్రపట్టకుండా చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఒకవైపు ఎన్నికల కమీషన్ మరోవైపు ఎల్వీ, ఇంకోవైపు వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చంద్రబాబును బాగా చికాకులు పెట్టేస్తున్నట్లే ఉన్నారు.

 

ఎంతైనా ముఖ్యమంత్రికి సబార్డినేటే కాబట్టి ప్రత్యేకించి ఎల్వీ పెట్టే చికాకులు సొంతంగా ఏమీ లేవనే చెప్పాలి. కాకపోతే చంద్రబాబు ఇచ్చిన భూ కేటాయింపుల ఆదేశాలు అమలు కాకుండా ఎల్వీ నిలిపేశారు.  అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 జీవోలు నిలిచిపోయాయి. అవన్నీ భూ కేటాయింపులకు సంబంధించిన జీవోలేనట. 2003లో కూడా చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇలాగే భూములను తనిష్టం వచ్చినట్లు పందేరం చేసేశారు.

 

అప్పట్లో ఇంత అవేర్ నెస్ లేదు కాబట్టి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం సైలెంట్ గా భూ కేటాయింపులను కానిచ్చేసింది. భూములను కేటాయించేయటం, భూములను అందుకున్న వాళ్ళు డబ్బులు కట్టేసి భూములను స్వాధీనం చేసుకోవటం లాంటవన్నీ యుద్ధప్రాతిపదికపై కానిచ్చేశారు. అయితే, ఇప్పుడు మాత్రం వైసిపి వాళ్ళు చంద్రబాబు ప్రతీ అడుగును జాగ్రత్తగా గమనిస్తున్నారు. పైగా ఎల్వీ కూడా చంద్రబాబుకు కొరకరాని కొయ్యగా మారారు. అందుకనే భూములు కేటాయిస్తు చంద్రబాబు ఇచ్చిన ఆదేశాల జీవోలన్నింటినీ ఎల్వీ నిలిపేశారు.

 

ముఖ్యమంత్రిగా పూర్తిస్ధాయిలో అధికారం చెలాయించలేరు. అలాగని మడికట్టుకుని కూర్చోనూలేరు. షెడ్యూల్ విడుదలైన దగ్గర నుండి చంద్రబాబు ప్రతీ అడుగును వైసిపి చాలా జాగ్రత్తగా గమనిస్తోంది. బహుశా చంద్రబాబంటే పడని ఉన్నతాధికారులో లేకపోతే టిడిపిలో కీలక వ్యక్తులో ఎవరో మొత్తానికి వైసిపికి బాగా సహకరిస్తున్నట్లున్నారు. నిజానికి 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు కాస్త హుందాగా ఉండుంటే ఇపుడీ సమస్యలు వచ్చేవి కావేమో. ఏం చేస్తాం చేసుకున్నవారికి చేసుకున్నంత.  

 


మరింత సమాచారం తెలుసుకోండి: