టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపీ కవిత…బీజేపీ, కాంగ్రెస్ ల నుంచి బలమైన నాయకులు పోటీ చేస్తుండటం…ఏకంగా 178 మంది రైతులు బరిలో నిలవడం ...ఇలా సంచ‌ల‌న ప‌రిణామాల‌కు వేదిక‌గా నిలిచిన నిజామాబాద్ పార్ల‌మెంటు సెగ్మెంట్‌పై రాష్ట్రంలోనే కాదు… భారతదేశం అంతటా… చర్చ జరిగింది. త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం  రైతులు బ్యాలెట్ అస్త్రం ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ మేరకు ఒక్కో పోలింగ్ కేంద్రానికి పన్నెండు బ్యాలెట్ యూనిట్లను అమర్చనున్నారు. 1,788 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఎల్ ఆకారంలో ఈవీఎంల అమరికను కూర్పు చేశారు. మొత్తం 12వేల సిబ్బంది ఈ ఎన్నికల నిర్వహణలో పనిచేశారు.


ఇలా సంచ‌ల‌నానికి వేదిక‌గా నిలిచిన నిజామాబాద్ రైతులు మ‌రో క‌ల‌కలం రేపే నిర్ణ‌యం తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన 50 మంది రైతులు `చ‌లో వారణాసి` పేరుతో బ‌య‌ల్దేరి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీపై పోటీ చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఎంపీ కవిత పసుపు బోర్డు కోసం గత ఐదేళ్లుగా కృషి చేశారని అయితే, బీజేపీ వైఫల్యం చెందిందని ఆగ్రహం వ్య‌క్తం చేస్తూ, పసుపు బోర్డు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీపై పోటీ చేసేందుకు 50 మంది రైతులు వారణాసి బయల్దేరారు. వీరికి మద్దతుగా తమిళనాడు రైతులు కూడా చలో వారణాసికి పిలుపునిచ్చారు. ఇటీవ‌ల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాలకు త‌మ‌ను వాడుకొని టీఆర్ఎస్ అభ్యర్థి కవితను లక్ష్యంగా చేసుకొని విమర్శించారు. అందుకే త‌మ లక్ష్యం నిర్వీర్యం అయ్యిందని వాపోయారు. ``మేము పోటీ చేసేది మా సమస్యల కోసమే...గత ఐదేళ్లుగా కవిత పసుపు బోర్డు కోసం తీవ్రంగా శ్రమించారు. బీజేపీ ఇస్తామని చెప్పి మోసం చేసింది అందుకే మేము మోడీపై పోటీ చేసి జాతీయ పార్టీల నేతలను కలుస్తాం`` అని మీడియాకు రైతులు వెల్ల‌డించారు.


కాగా, నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండతో పాటు, జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, 15,53,385 మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్దేశించనున్నారు. వీరిలో పురుషులు 7,37,445 మంది ఉండగా, మహిళా ఓటర్లు 8,15,259 మంది ఉన్నారు. 29 మంది థర్డ్ జెండర్ ఓటర్లు, 547 మంది సర్వీస్ ఓటర్లు, మరో 105 మంది ప్రవాస భారతీయ ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ స్థానం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత పోటీలో ఉండగా, కాంగ్రెస్ తరఫున మాజీ ఎంపీ మధుయాష్కీ, బీజేపీ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్‌లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రధాన పార్టీలతో పాటు ఈసారి ఎర్రజొన్న, పసుపు రైతులు తమ సమస్యలను దేశ ప్రజలందరి దృష్టికి తేవాలనే ధృడ సంకల్పంతో 178 మంది మూకుమ్మడిగా నామినేషన్లు దాఖలు చేసి బరిలో నిలిచారు.


మరింత సమాచారం తెలుసుకోండి: