భారత రాజ్యాంగం అందరికీ ఒకటే కానీ తెలుగుదేశం వారికి మాత్రం ప్రత్యేక రాజ్యాంగంలా ఉంది కాబోలు. ఈసీ ఎవరు, ఎన్నికల కోడ్ ఏంటి, ఆంక్షలు ఎందుకు, సీబీఐ, ఈడీ, ఐటీ ఇలా దేశంలోని ప్రతీ ఏజెన్సీ ఎందుకు అన్న ధోరణిలో తెలుగుదేశం నేతల వాదనలు వింతగా ఉంటాయి. సమీక్షలు నిర్వహిస్తాం, ప్రభుత్వ ఆఫీసుల్లో పార్టీ కార్యక్రమాలు పెడతామని టీడీపీ నేతలు తెగేసి చెబుతూంటే ఇదేం తీరు అనిపించకమానదు.


ఇదిలా ఉండగా తాను పూర్తి స్థాయి   ముఖ్యమంత్రిని అని ఓ వైపు చంద్రబాబు చెప్పుకుంటూ ఉంటే ఆయన కొలువులో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తాను మాత్రం ఫుల్ టైం మంత్రిని ఎందుకు కానూ అంటున్నారు. ఓ వైపు ఎన్నికలు జరిగాయి. కోడ్ అమల్లో ఉంది. వచ్చే నెల తీర్పు రావాల్సి ఉంది. ప్రజాభిప్రాయం ఈవీఎంలలో భద్రంగా ఉంది. మరి నెల రోజులు ఓపిక పడితే రాజెవడో మంత్రి ఎవడో తెలుస్తుంది. కానీ అంతవరకూ సహనంగా ఉండలేకపోతున్నారులా ఉంది టీడీపీ తమ్ముళ్ళ పరిస్థితి.


ఇక సోమిరెడ్డి యధాప్రకారం పెద్ద నోరు వేసుకుని వైసీపీ నేత ఆనం రాం నారాయణరెడ్డిపై విరుచుకుపడ్డారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి బంగారం టీటీడీకి జాగ్రత్తగా  వస్తూంటే మధ్యలో కేంద్ర దర్యాప్తు  సంస్థల ఎంక్వైరీ అంటున్న ఆనంకు బుర్ర పనిచేయడంలేదా అంటూ పరుషంగానే మాటలు విసిరారు. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ ఇలా పార్టీలు మారిన ఆనం కి మతి పోయిందేమోనని కూడా సోమిరెడ్డి సెటైర్లు వేశారు. 


రిజర్వ్ బ్యాంక్ నిబంధలను కూడా తెలినని నేతలు వైసీపీ వారు అంటూ ఘాటు కామెంట్స్ చేశారు.  బాగా దిగజారి మాట్లాడుతున్నారంటూ బొత్స సత్యనారాయణ, విజయసాయిరెడ్డి, ఆనంలపై సోమిరెడ్డి అటాక్ చేశారు. ముఖ్యమంత్రిపై ఆరోపణలు సరి అయినవి కాదని, ఎంతో అనుభవం ఉన్న బాబు మీద మీ మాటల దాడి అంటూ చెరిగిపారేస్తున్నారు. సోమిరెడ్డి భాష, మాటలు చూస్తూంటే ఎన్నికల కోడ్ అసలు అమల్లో ఉందా అనిపించకమాన‌దు మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: