పోలింగ్ జరిగిన విధానం తర్వాత ఎవరి వాదనలు ఎలాగున్నా మొత్తం మీద ఓ 45 నియోజకవర్గాల విషయంలో మాత్రం రెండు ప్రధాన పార్టీలు ఎవరికి వారుగా ధీమాగా ఉన్నారు. అంటే ఓ విధంగా ఈ నియోజకవర్గాల్లో ఎవరు ఎక్కువగా గెలిస్తే వారికే ప్రభుత్వంలోకి వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు.  రెండు పార్టీల నేతల్లోను ఈ నియోజకవర్గాల్లో గెలుపు గురించే తీవ్ర స్ధాయిలో చర్చలు జరుగుతున్నాయి.

 

జిల్లాల వారీగా చూస్తే ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం, పలాసలో టిడిపి, వైసిపి అభ్యర్ధులు ఎవరికి వారుగా గెలుపు ధీమాతో కనిపిస్తున్నారు. విజయనగరం జిల్లాలోని ఎస్ కోట, విజయనగరం జిల్లాలో రెండు పార్టీల అభ్యర్ధులు కూడా గెలుపు తమదే అన్నట్లుగా ఉన్నారు. విశాఖపట్నం జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో రెండు పార్టీల మధ్య టైట్ ఫైట్ నడిచిన నియెజకవర్గాలు 6 ఉన్నాయట. నగరంలోని ఉత్తరం, పశ్చిమ నియోజకవర్గాలతో పాటు గాజువాక, పెందుర్తి, యలమంచిలి, నర్సీపట్నం ఉన్నాయి.

 

తూర్పుగోదావరి జిల్లాలో ఐదు నియోజకవర్గాలైన మండపేట, రాజమండ్రి రూరల్, రాజోలు, పెద్దాపురం, రాజానగరంలో గెలుపు ఎవరిదంటే చెప్పటం కష్టమే. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు, ఉండి నియోజకవర్గాల్లో కూడా పోటీ హోరా హోరీగా జరిగింది. గుంటూరు జిల్లాలోని తెనాలి, మంగళగిరి, సత్తెనపల్లి, రేపల్లె, గురజాలలో పోటీ గట్టి జరిగింది. ఇక కృష్ణా జిల్లాలోని నూజివీడు, మైలవరం, పెనమలూరు, గన్నవరం, జగ్గయ్యపేటలో రెండు పార్టీల అభ్యర్ధులు నువ్వా నేనా అన్నట్లుగా సాగింది పోరు.

 

అలాగే, ప్రకాశం జిల్లాలోని చీరాల, అద్దంకి, పర్చూరు, కొండెపిలో అనూహ్య ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి. నెల్లూరు జిల్లాలో నెల్లూరు సిటీ నియోజకవర్గం ఫలితంపై అందరిలో ఆతృత పెరిగిపోతోంది. ఇక చిత్తూరు జిల్లాలో పీలేరు, పూతలపట్టు, మదనపల్లి, చిత్తూరు నియోజకవర్గాల్లో ఫైట్ గట్టిగానే ఉంది. కడపలో జమ్మలమడుగు ఒక్కటే గెలుపు ఎవరిదో చెప్పలేని నియోజకవర్గమట. అనంతపురం జిల్లాలో హిందుపురం, కదిరి, రాప్తాడు, శింగనమలలో పోటీ బాగా జరిగింది. కర్నూలు జిల్లాలో ఆలూరు, కర్నూలు సిటీ నియోజకవర్గాల్లో పోటీ ఉత్కంఠగా జరిగింది.

 

టిడిపియేమో పసుపు కుంకుమ, వృద్ధాప్య ఫించన్లే తమను గట్టెక్కిస్తాయని జనరల్ గా చెబుతున్నా పై నియోజకవర్గాల్లో మాత్రం కచ్చితంగా విజయం మాదే అని చెప్పలేకుంది. అదే సమయంలో వైసిపి నేతలు కూడా పై నియోజకవర్గాల్లో గెలుపు తమదే అని చెబుతున్నా ఏమో ఏమైనా జరగవచ్చు అని కూడా అంటున్నారు. పై నియోజవర్గాల్లో గాజువాక, మంగళగిరి, రాప్తాడు, హిందుపురం, పీలేరు, గురజాల, మైలవరం లాంటి నియోజకవర్గాల్లో గెలుపోటములపై లక్షల రూపాయల్లో బెట్టింగులు కూడా జరుగుతున్నాయట పోటీ ఏ స్ధాయిలో జరిగిందో అర్ధమైపోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: