ఇంటర్ బోర్డు వైఫల్యం నేపథ్యంలో ప్రభుత్వంపై విపక్ష పార్టీలు వత్తిడిని పెంచాయి. ఈ వైఫల్యాలపై విద్యార్థులు, తల్లితండ్రులకు క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎస్‌కు వినతిపత్రం సమర్పించారు. విద్యార్థులను దగా చేసిన బోర్డు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో 9.40 లక్షల కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొని ఉందని ఆయన చెప్పారు. ఇది చిన్న తప్పిదంగా బోర్డు కార్యదర్శి పేర్కొనడం అమానుషమని ఆయన మండిపడ్డారు.

ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలితాల్లో చోటుచేసుకున్న గందరగోళం సాధారణ విషయం కాదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన అతి పెద్ద కుంభకోణాల్లో ఇది ఒకటని బీజేపీ ఆరోపించింది. దాదాపు 10 లక్షల మంది విద్యార్థుల కుటుంబాలతో చెలగాటం ఆడటాన్ని ప్రభుత్వం సాధారణ విషయంగా తీసుకుందని మండి పడింది. ఇప్పటి వరకు 16 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్‌ చేసింది. 
Image result for bjp lakshman
వివిధ అంశాలపై గంటల తరబడి సమీక్షలు చేసే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ వ్యవహారంపై ఒక్కమాట కూడా మాట్లాడకపోవటం విడ్డూరంగా ఉందని పేర్కొంది. మానసిక వత్తిడికి గురవుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఊరట ఇచ్చే సమాధానం చెప్పడం లేదన్నారు. బోర్డు వద్ద ధర్నా చేస్తున్న విద్యార్థులు, తల్లితండ్రుల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తిస్తున్నారని లక్ష్మణ్ ఆరోపించారు. అధికారుల సమన్వయలోపంతోనే తప్పిదాలు జరిగినట్లు ప్రభుత్వం ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. సాంకేతిక తప్పిదాలు, తప్పుగా మార్కులు వేయడం, వాల్యూయేషన్‌ లో లోపాల వల్ల ప్రతిభావంతులైన విద్యార్థులు కూడా నష్టపోయారని బీజేపీ నేత ఆందోళన వ్యక్తం చేశారు. 
Image result for Dr K Laxman BJP and Ponnam Prabhakar Congress
పీసీసీ వర్కింగ్ అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఇంటర్ బోర్డు వైఫల్యాలకు కారణమైన ఏజన్సీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ కేసులో జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. గతంలో కాకినాడ జేఎన్‌టీయూకేలో ఇలాంటి ఘటనలు జరిగినవెంటనే గవర్నర్ జోక్యం చేసుకున్నారని ఆయన గుర్తుచేశారు.
Image result for KCR KTR
మంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషిని కలసి వినతిపత్రం అందజేసింది. అనంతరం లక్ష్మణ్‌ విలేకరులతో మాట్లాడారు. పదిలక్షల మంది విద్యార్థులను తీవ్రమనోవేదనకు, కొంతమంది ఆత్మహత్యలకు దారితీసిన ఈ ఉదంతాన్ని ప్రభుత్వం తేలికగా తీసుకోవటం భావ్యం కాదన్న విషయాన్ని సీఎస్‌ దృష్టికి తెచ్చినట్టు చెప్పారు.  విద్యా శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు దైర్యంగా ఉండాలని, ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని లక్ష్మణ్‌ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాన్ని దారిలోకి  తెచ్చేందుకు అన్ని కలెక్టరేట్ల ఎదుట బుధవారం దిష్టిబొమ్మలు దహనం చేయనున్నట్టు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: