ఏపీలో ఎన్నిక‌లు ముగిశాయి. ఈ నెల 11న జ‌రిగిన ఎన్నిక‌ల్లో అనేక చిత్రాలు, విచిత్రాలు కూడా క‌నిపించాయి. వైసీపీ వ‌ర్సెస్ టీడీపీగా సాగిన ఈ ఎన్నిక‌ల పోరులో రెండు పార్టీలు కూడా తీవ్రాతి తీవ్రంగా త‌ల‌ప‌డ్డాయి. మొత్తంగా ఈ ర‌ణం.. దేశంలోనే జ‌ర‌గ‌నంత జోరును, వేడిని కూడా పెంచింది. ఇక‌, ఎన్నిక‌ల ఫ‌లితం, ప్ర‌జ‌ల తీర్పు ఈవీఎంల‌లో నిక్షిప్తం అయిపోయింది. ఈ ప‌లితం కోసం మ‌రో 28 రోజులు ఎదురు చూడ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలోనే ఎవ‌రి చ‌ర్చ‌లు, ఎవ‌రి తీర్పులు వారు ఇచ్చుకుంటున్నారు. మేం గెలుస్తామంటే.. కాదు.. మేమే గెలుపు గుర్రం ఎక్కుతామ‌ని ఇరు పార్టీల అభ్య‌ర్థులు కూడా భారీ ఎత్తున ప్ర‌చారం చేసుకుంటున్నారు. సొంత స‌ర్వేల‌తో ఊద‌ర గొడుతున్నారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇప్ప‌టికే 150 స్తానాలు మావే అంటూ తీర్మానం చేశారు. 


ఇక‌, వైసీపీ కూడా 130 స్థానాల వ‌ర‌కు త‌మ‌వేన‌ని చెప్పుకొచ్చింది. ఇది మ‌రింత వేడి పెంచుతోంది. ఇక‌, నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ప‌రిస్థితిని అంచ‌నా వేసుకుంటే.. ప‌లు నియోజ‌క‌వ‌ర్గా్ల‌లో కీల‌క నాయ‌కులు పోటీకి దిగారు. ముఖ్యంగా రాజ‌కీయ వార‌సులు ఈ ద‌ఫా త‌మ అదృష్టాన్ని చ‌వి చూసు కుంటున్నారు.  కృష్ణా జిల్లా గుడివాడ నియోజ‌క‌వ‌ర్గం గురించి ప్ర‌త్యేకంగా చ‌ర్చ జ‌రుగుతోంది. వైసీపీ ఫైర్ బ్రాండ్‌, నోరు విప్పితే.. చంద్ర‌బాబుపై దారుణ వ్యాఖ్య‌ల‌తో విరుచుకుప‌డే వైసీపీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవేంక‌టేశ్వ‌ర‌రావు, ఉర‌ఫ్ నాని ఇక్క‌డ వ‌రుస విజ‌యాలు సాధిస్తు న్నారు. ఈ క్ర‌మంలోనే ఈయ‌న‌కు చెక్ పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్న చంద్ర‌బాబు అనూహ్యంగా విజ‌య‌వాడ‌కు చెందిన దేవినేని నెహ్రూ వార‌సుడు, దేవినేని అవినాష్‌ను రంగంలోకి దింపారు. నిజానికి ఈ నియోజ‌క‌వ‌ర్గానికి స్థానికేత‌రుడే అయిన‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు స్థానిక నాయ‌కుల‌ను బుజ్జ‌గించి మ‌రీ ఇక్క‌డ అవినాష్‌ను రంగంలోకి దింపారు. అయితే ఎన్నిక‌ల్లో అవినాష్ స్థానిక‌త అంశం పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేదు.


ఎన్నిక‌ల ప్ర‌చారంలో అటు నాని, ఇటు అవినాష్‌లు ఇద్ద‌రూ కూడా దూసుకుపోయారు. నాని సిట్టింగ్‌, సీనియ‌ర్ ఎమ్మెల్యే కావ‌డం భారీ ఎత్తున క‌లిసి వ‌స్తున్న అంశం. అయితే, తాను యువ నాయ‌కుడిన‌ని, త‌నను గెలిపిస్తే.. గుడివాడ‌లోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటాన‌ని అవినాష్ వెల్ల‌డిస్తూ.. ప్ర‌చారంలో దూసుకుపోయారు. హోరా హోరీగా సాగిన పోరుపై ఎన్నిక‌లు ముగిసిన అనంత‌రం బెట్టింగ్ రాయుళ్లు రంగంలోకి దిగారు. అవినాష్ గెలుపు త‌థ్య‌మ‌ని టీడీపీ నేత‌లు, కాదు, స్థానికుడు, నాని గెలుస్తాడ‌ని వైసీపీ నాయ‌కులు జోరుగా ప్ర‌చారం చేస్తున్న నేప‌థ్యంలో ఇరు ప‌క్షాల్లోనూ బెట్టింగులు కోట్ల‌కు కోట్లు దాటిపోయాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అంచ‌నాల ప్ర‌కారం దాదాపు ఈ ఒక్క సీటుపై రూ. 50 కోట్ల వ‌ర‌కు పందేలు క‌ట్టిన‌ట్టు స‌మాచారం. 


ఈ క్ర‌మంలో వైసీపీ వాళ్లు కోసు పందేలు కూడా క‌ట్టారు.  నిజానికి కృష్ణాలో 16 నియోజ‌క‌వ‌ర్గాలు ఉంటే.. గుడివాడ‌పై ఉన్నంత ఆస‌క్తి ఎక్క‌డా చూపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అవినాష్ గెలిచినా.. వైసీపీ కోట్ల‌లో న‌ష్ట‌పోతారు. నాని గెలిస్తే.. టీడీపీ వాళ్లు న‌ష్ట‌పోతున్నారనే బ‌హిరంగ ర‌హస్య‌మే.  అవినాష్ గ‌ట్టి పోటీ ఇచ్చిన నేప‌థ్యంలో ఇక్క‌డ నాని గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా చ‌మ‌టోడ్చారు. మ‌ళ్లీ త‌న‌దే గెలుపు అని, త‌మ పార్టీ వ‌స్తుండ‌డంతో తాను జ‌గ‌న్ కేబినెట్‌లో మంత్రి అవుతున్నాన‌ని నాని ఇప్ప‌టికే ప్ర‌చారం స్టార్ట్ చేసేశారు. ఇక అటు అవినాష్ కొడాలి నానిని తాను ఓడించి జెయింట్ కిల్ల‌ర్‌గా నిల‌వ‌డంతో పాటు స్టేట్ ఎట్రాక్ష‌న్ లీడ‌ర్ కానున్నాన‌న్న ధీమాతో ఉన్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. ఏదేమైనా ఇక్క‌డ ఎవ‌రు గెలిచినా... ఎవ‌రు ఓడినా ..? ప‌ందెం ఓడిన వాళ్లు కోట్ల‌లో మున‌గ‌డం అయితే షురూ..!


మరింత సమాచారం తెలుసుకోండి: