ఇంటర్మీడియట్ ఫలితాల వెల్లడి తర్వాత గడచిన నాలుగు రోజులుగా జరుగుతున్న ఆందోళనలను చూస్తుంటేనే తెలంగాణా ప్రభుత్వం ఎంత బాధ్యతగా పని చేస్తోందో అర్ధమైపోతోంది.  చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఇన్ని లక్షల మంది విద్యార్ధులు ఫెయిల్ అవ్వటం ఆశ్చర్యంగా ఉంది.  పరీక్ష రాసిన 9.71 లక్షల మందిలో 3.5 లక్షల మంది విద్యార్ధులు ఫెయిలయ్యారు. అందులోను మ్యాథ్య్ సబ్జెక్టులోనే 50 వేల మంది పరీక్ష తప్పారు.

 

పరీక్షలు సరిగా రాయకుండా ఫెయిల్ అయితే ఎవరూ ఇంటర్మీడియట్ బోర్టును తప్పు పట్టేవాళ్ళుండరు. కానీ ఈసారి రిజల్ట్స్ లో ఫస్టు క్లాసులో మార్కులు తెచ్చుకునే విద్యార్ధులు కూడా ఫెయిలవ్వటమే విచిత్రంగా ఉంది. రిజల్డ్స్ లో ఫెయిలైన విద్యార్ధుల్లో కొందరి పేపర్లను  రీ వాల్యుయేషన్ చేసిన తర్వాత మార్కులు 0 కు బదులు 99 రావటంలో ఎవరిది తప్పు. ఇప్పటికి కొన్ని వేలమందికి రీ వాల్యుయేషన్ కు, రీ కరెక్షన్ కు దరఖాస్తులు చేశారు. మరి వారి భవిష్యత్తు ఏమవుతుందో చూడాలి.

 

లక్షలాది మంది విద్యార్ధుల భవిష్యత్తుకు ముడిపడిన అంశం కాబట్టి హైకోర్టు కూడా వెంటనే స్పందించింది. కోర్టు స్పందిస్తే కానీ ప్రభుత్వం దిగిరాలేదు. దాంతో బోర్డు ఉన్నతాధికారులు కూడా విద్యార్ధులతోనే కాకుండా వారి తల్లి దండ్రులతో కూడా మాట్లాడారు. ఈ ఎపిసోడ్ మొత్తంలో మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి కెసియార్ కానీ లేకపోత విద్యాశాఖ మంత్రి జగదీశ్వరరెడ్డి కానీ మీడియా ముందుకొచ్చి ప్రకటన చేయకపోవటంతోనే ఎంత బాధ్యతగా ఉన్నారో అర్ధమైపోతోంది.

 

విద్యార్ధులు, వాళ్ళ తల్లి దండ్రులతో మాట్లాడిన బోర్డు కార్యదర్శి  వాళ్ళల్లో ఆత్మస్ధైర్యాన్ని నింపలేకపోయారు. అందుకే ఇప్పటి వరకూ రాష్ట్రంలో 18 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఎవరో చేసిన తప్పులకు ముక్కుపచ్చలారని విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకోవటం బాధాకరమే. అదే సమయంలో పరీక్షలో ఫెయిల్ అయ్యారంటే జీవితంలో ఫెయిలయినట్లు కాదన్న విషయాన్ని కూడా విద్యార్ధులకు చెప్పలేక పోతున్న విద్యా వ్యవస్ధ కూడా సమాన బాధ్యత వహించాల్సిందే.

 

ఇన్ని లక్షలమంది విద్యార్ధులు ఫెయిలైన తర్వాత కూడా బోర్డు చాలా సింపుల్ గా గ్లోబరెనా అనే కంపెనీదే తప్పని చేతులు దులిపేసుకున్నారు. కానీ ఆ కంపెనీ ఏమో తమదేమీ తప్పులేదంటూ ఎదురుతిరిగింది. దాంతో తప్పెవరిది అనే విషయంలో కీచులాటలు మొదలైందే కానీ నష్టపోయిన లక్షలాది విద్యార్ధులకు న్యాయం చేయాలన్న ఆలోచన మాత్రం ఎవరిలోను కనబడలేదు. అదే సమయంలో రీ కౌంటింగ్ కు, రీ వెరిఫికేఫన్ కు దరఖాస్తు చేసుకునేందుకు ఏర్పాటు చేసిన వెబ్ సైట్ కూడా పనిచేయటం లేదు. మొత్తం మీద అధికారాలే కానీ  బాధ్యతలు తీసుకోని పాలకులు ఉన్నంత కాలం పరిపాలన ఇలా అస్తవ్యస్ధంగానే ఉంటుంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: