ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీపై నిజామాబాద్‌కు చెందిన ప‌సుపు రైతులు బ‌రిలో దిగ‌నున్నార‌నే వార్త సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఎన్నికల ద్వారానే ఢీకొనాలని ఇందూరు పసుపు రైతులు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారని వార్త‌లు వ‌చ్చాయి. మోదీ పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గం నుంచి 50 మంది రైతులు పోటీచేయడానికి సిద్ధమయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా చివరి దశలో వారణాసిలో ఎన్నికలు జరుగనున్నాయి. ఏప్రిల్ 29 వరకు ఇక్కడ నామినేషన్‌కు గడువు ఉండటంతో 25 వ తేదీ నుంచి 28 లోపు వారణాసికి చేరుకొని నామినేషన్లు దాఖలు చేయాలని పసుపు రైతులు నిర్ణయించారు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ నియోజకవర్గాల నుంచి రైతులు వారణాసికి వెళ్ల‌నున్నారనే వార్త‌లు వ‌చ్చాయి.


అయితే, ఈ ప్ర‌క‌ట‌న వెనుక సంచ‌ల‌న అంశాన్ని నిజామాబాద్ బీజేపీ అభ్య‌ర్థి ధ‌ర్మ‌పురి అర‌వింద్ వెల్ల‌డించారు. కల్వకుంట్ల కవిత ప్రేరణతో నిజామాబాద్ పసుపు రైతులు వారణాసిలో నరేంద్ర మోదీపై ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని ఆరోపించారు. బ‌రిలో నిలుస్తున్న‌ పదిమంది రైతులు మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయలేదన్నారు. వీరంతా మొన్నటి ఎన్నికల్లో టీఆర్ఎస్ కండువాలు మెడలో వేసుకుని‌ ఆ పార్టీ కోసం పనిచేశారన్నారు. ``పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసిన వారంతా టీఆర్ఎస్ క్రియాశీలక సభ్యులు. ఇందులో వ్యవసాయం చేసేవారు సగం మందే.. పైగా పసుపు పండించే రైతు ఒక్కరు కూడా లేరు.`` అంటూ సంచ‌ల‌న అంశాల‌ను వెల్ల‌డించారు.
 
కవిత గత ఎన్నికల్లో పసుపు బోర్డు తెస్తానని ఇచ్చిన హామీని మరచిపోయార‌ని అర‌వింద్ ఆరోపించారు. ``రైతులు, నియోజకవర్గం సమస్యలపై కవిత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇది సమ్మర్ స్పాన్సర్ ప్యాకేజీ...నామినేషన్లు వేసే వాళ్లంతా అ తరువాత సమ్మర్ ఎంజాయ్ ప్రోగ్రామ్ కు వెళ్తున్నారు. ఇదంతా రాజకీయ డ్రామా.. పసుపు రైతులపై కవితకు నిజమైన ప్రేమ ఉండి ఉంటే ఎందుకు బోనస్ ఇప్పించలేదు. పసుపు,ఎర్రజొన్నకు గిట్టుబాటు ధర కల్పించి రైతుల బ్యాంకు ఖాతాలో వేస్తామని మా పార్టీ ఇటీవలి ఎన్నికల్లో హామీ ఇచ్చింది..పసుపు బోర్డు కూడా ఇస్తామని కూడా మా‌ మ్యానిఫెస్టోలో పెట్టడం జరిగింది.`` అని వెల్ల‌డించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: