ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకప్పుడు మంత్రిగా పనిచేసి  చక్రం తిప్పిన నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి  20 సంవత్సరాలుగా గెలుపు అనే మాటను మరిచి పోయారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నుంచి రాజ‌కీయాలు కంటిన్యూ చేస్తూ 1994, 1999 ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు గెలిచిన సోమిరెడ్డి బాబు క్యాబినెట్‌లో మంత్రిగా పని చేశారు. 1999 ఎన్నికల తర్వాత సోమిరెడ్డి 2004, 2009, 2012 కోవూరు ఉప ఎన్నిక, 2014 ఎన్నికల్లో వరుసగా ఓడిపోతూ రాజకీయంగా చాలా వెనకబడిపోయారు.  సోమిరెడ్డి వరుసగా నాలుగు సార్లు కూడిన చంద్రబాబు మాత్రం ఆయనపై అభిమానంతో, జిల్లాలో రెడ్డి సామాజిక వర్గాన్ని సంతృప్తి పరిచేందుకు ఆయన ఎమ్మెల్సీ చేసి మరి క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. మంత్రి పదవి వచ్చాక సోమిరెడ్డి సర్వేపల్లి నియోజకవర్గంపై బాగా దృష్టి సారించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన మాట వాస్తవం.  గత పదేళ్లతో పోలిస్తే మంత్రి పదవి చేతిలో ఉండటంతో సోమిరెడ్డి సర్వేపల్లిలో ఈ సారి బలంగా పాతుకు పోయారు.


ఈ ఎన్నికల్లో తాను పోటీ నుంచి తప్పుకుని తన కుమారుడు రాజగోపాల్ రెడ్డిని బరిలోకి దించాలని సోమిరెడ్డి భావించారు. అందుకు త‌గ్గ‌ట్టుగానే రాజ్‌గోపాల్‌రెడ్డి కూడా నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటూ త‌న ప‌ని తాను చేసుకుపోయారు. అయితే చివరిలో చంద్రబాబు సోమిరెడ్డిపై తీవ్రమైన ఒత్తిడి తేవడంతో మళ్ళీ ఆయనే ఎమ్మెల్యేగా బరిలో ఉండాల్సి వచ్చింది. చివరిలో సోమిరెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మరీ సర్వేప‌ల్లిలో ప్ర‌జా తీర్పు కోసం వెళ్లారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓడిన ఆయన గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి చేతిలో మరోసారి పరాజయాన్ని చవి చూశారు. 2012 ఉప ఎన్నికల్లో తన సమీప బంధువు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేతిలో కోవూరులో కూడా ఓడిపోయారు.  ఇప్పటికే వరుసగా నాలుగుసార్లు ఓడిపోయిన‌ సోమిరెడ్డిపై ఈసారి సర్వేపల్లి లో కాస్త సానుభూతి ఉన్నమాట నిజం. అదే టైంలో ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని సోమిరెడ్డి,  ఆయన తనయుడు రాజగోపాల్ రెడ్డి సర్వేపల్లి అభివృద్ధిపై బాగా కాన్సన్ట్రేషన్ చేశారు. 


ఎన్నికలకు ముందు వరకు సర్వేపల్లిలో సోమిరెడ్డికి కాస్త సానుకూల పరిస్థితులు  ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో గత దశాబ్దంన్నర కాలంలో టిడిపి చాలా బలహీనంగా ఉంటూ వస్తోంది. గత ఎన్నికల్లో ఈ జిల్లాలో టిడిపి గెలిచినా కొవ్వూరు, వెంకటగిరి,  ఉదయగిరి స్థానాల్లో టిడిపి అభ్యర్థులు చాలా స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. టిడిపి ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నా జిల్లాల్లో  కనీసం రెండు మూడు సీట్లు గెలుస్తుందంటే నమ్మకాలు ఆ పార్టీ వాళ్లకి లేవు. నారాయణ, సోమిరెడ్డి ఇద్దరికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవులు ఇవ్వడం కూడా జిల్లాలో పార్టీ బలపడ‌క‌ పోవడానికి కారణం.  ఎన్నికలకు ముందు టిడిపిలో ఉన్న సోమిరెడ్డి చిరకాల రాజకీయ శత్రువు ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీలోకి జంప్ చేయడం కూడా జిల్లాలో టీడీపీకి పెద్ద మైనస్. 


ఆదాల ప్రభాకర్ రెడ్డి  గతంలో సర్వేపల్లిలో సోమిరెడ్డిని రెండుసార్లు ఓడించారు. అక్కడ ఆయనకు ఓ వర్గం ఉంది.  తాజా ఎన్నికల్లో ఆదాల‌ నెల్లూరు నుంచి వైసిపి తరపున ఎంపీగా పోటీ చేయడంతో సర్వేప‌ల్లిలో ఆయన వర్గం మొత్తం కాకానికి సపోర్ట్ చేయడం కూడా సోమిరెడ్డి గెలుపుపై సందేహానికి మరో ప్రధాన కారణం. ఏదేమైనా సోమిరెడ్డి కేవలం సానుభూతిని నమ్ముకుని నాలుగు ఓటముల తర్వాత గెలుస్తామ‌ని అనుకుంటుండగా.... సర్వేపల్లిలో పోలింగ్ జరిగిన సరళిని బట్టి సోమిరెడ్డి గెలుపు అంత సులువు కాదని రాజకీయ వర్గాల్లో విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి కూడా సోమిరెడ్డి ఓడిపోతే ఇప్పటికే ఎమ్మెల్సీ పదవిని వదులుకోవ‌డం... ఐదు వరుస ఓటముల తర్వాత రాజకీయంగా ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ? ఆసక్తిగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: