తెలంగాణ ఇంటర్ ఫలితాల గందరగోళంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ వైఫల్యాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థుల భవిష్యత్ ను అగమ్యగోచరంగా మార్చడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు పవన్. 
 
ఇంటర్ ఫలితాలు ప్రకటించాక 17 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరం.. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు బాధ్యత వహించాలి.. పరీక్ష ఫీజు చెల్లింపు, పేపర్ వాల్యుయేషన్ నుంచి ఫలితాల వెల్లడి వరకూ అనేక సందేహాలున్నాయి అని పవన్ ఓ ప్రకటనలో తెలిపారు. 


ప్రతి దశపైనా విద్యార్థుల్లోనూ, వారి తల్లితండ్రుల అనుమానాలు నివృత్తి చేసి, నిజాలు వెల్లడించాలి.. విద్యార్థులు, వారి తల్లితండ్రులపై ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు దాడిని ఖండిస్తున్నాం.. విద్యార్థులకు ఉచితంగా రీ వాల్యుయేషన్, రీ వెరిఫికేషన్ చేయాలి అని పవన్ డిమాండ్ చేశారు. 

జీవితం చాలా విలువైనది. ఈ ఫలితాలతో  నిరాశ చెంది ఆత్మహత్యలకు పాల్పడవద్దని పవన్ సూచించారు. విద్యార్థులకు జనసేన అండగా నిలుస్తుందని.. చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం చేసి తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు పవన్. తప్పిదాలకు కారణమైన బోర్డు అధికారులు, సాఫ్ట్ వేర్ సంస్థపై చర్యలు తీసుకుని న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: