ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొని మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంటూ అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్ బాట పట్టడం కొన్నేళ్లుగా మనం చూస్తూనే ఉన్నాం.. ఈ పర్యటనల ద్వారా ఎన్ని పెట్టుబడులు వస్తున్నాయో ఏమో కానీ.. ఖర్చు మాత్రం తడిసిమోపెడవుతోంది.


తాజాగా.. ఈ ఏడాది జనవరిలో దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశానికి ముగ్గురు అధికారులతో కలిసి మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ హాజరయ్యారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఆయన ఈ సదస్సుకు హాజరయ్యారు. అయితే ఇందుకు అయిన ఖర్చు మాత్రం చాలా ఎక్కువగా ఉంది. 

కోటీ 58 లక్షల రూపాయలు దావోస్‌లో ఒక్క రోజు పర్యటనకు అయ్యాయట. ఈవిషయాలు ఆర్టీఐ ద్వారా వెలుగు చూశాయి. సమాచార హక్కు చట్టం ద్వారా అజయ్ దూబే అనే సామాజిక ఉద్యమకారుడు అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం నుంచి ఇలా సమాధానం వచ్చింది. 

ఈ ఖర్చు వివరాలు వెల్లడిస్తూ..  విమాన టికెట్లు, వీసా, వసతి, జ్యూరిచ్ విమానాశ్రయంలో వీఐపీ లాంజ్‌లోకి ప్రవేశించడానికి, ఇతర ఖర్చులు అన్నీ కలిపి అక్షరాలా ఒక్క కోటీ 58 లక్షల రూపాయలు ఖర్చు అయినట్టు ప్రభుత్వం వివరణ ఇచ్చిందట. 

ఈ ఖర్చుల వివరాలు అడగటం బాగానే ఉంది. అలాగే ఈ పర్యటన ద్వారా ఎన్ని పెట్టుబడులు వచ్చాయో కూడా అడిగితే ఇంకా బావుండేది.. అప్పుడు కానీ ఈ పర్యటనల వల్ల ఉపయోగం ఉంటుందా.. లేక.. నేతల విదేశీ పర్యటనల మోజుతో జనం సొమ్ము వృథా చేస్తున్నారా అన్న విషయం బయటపడేది.. ఏమంటారు..? 



మరింత సమాచారం తెలుసుకోండి: