తెలంగాణ రాష్ట్ర స‌మితికి బ‌ల‌మే బ‌ల‌హీన‌త కానుందా? పైకి అంతా మామూలుగా ఉన్న‌ప్ప‌టికీ టీఆర్ఎస్‌లో అంత‌ర్గ‌త సంక్షోభం వంటి ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయా?  టీఆర్ఎస్‌లో చీలిక ఇప్ప‌టికే మొద‌లైందా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను బ‌ట్టి. ప‌రిష‌త్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో పార్టీ నేత‌ల మ‌ధ్య స్ప‌ష్ట‌మైన చీలిక వ‌చ్చింద‌ని, కొన్ని చోట్ల పార్టీ ఓట‌మికి కూడా ఈ రాజ‌కీయాలు కార‌ణంగా మార‌నున్నాయ‌ని అంటున్నారు. ఈ క‌ల‌క‌లం పార్టీ పెద్ద‌ల‌ను సైతం ఆందోళ‌న‌కు గురిచేస్తోంద‌ని తెలుస్తోంది.


ఇటీవ‌ల జ‌రిగిన ముంద‌స్తు ఎన్నిక‌ల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి టీఆర్‌ఎస్ అభ్యర్థులపై విజయం సాధించిన నేతలు అనంత‌రం టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ఆయా మండలాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతలను అధిష్టానం స్థానిక శాసనసభ్యులకే అప్పగించటంతో కొత్త సమస్య తెరపైకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పనిచేసిన వారిని సదరు శాసనసభ్యులు దగ్గరకు రానివ్వటం లేదు. గత ఎన్నికల్లో తమకు మద్దతుగా పనిచేసిన వారికి ఎంపీటీసీ, జడ్పీటీసీ బీ-్ఫరాలు అందిస్తున్నారు. దీంతో మొదటి నుండి టీఆర్‌ఎస్‌లో పనిచేసిన షాక్ తింటున్నారు.


తాజా ఎమ్మెల్యే చేతిలో ఓటమి పాలైన టీఆర్‌ఎస్ నేత వర్గానికి మధ్య విభేదాలు బహిర్గతం అవుతున్నాయి. తమను కాదని ఎమ్మెల్యేలు ఇతరులకు టిక్కెట్టు ఇస్తే తాము మద్దతు ఇవ్వబోమని పార్టీలోని ప్రత్యర్థులు తెగేసి చెబుతున్నారు. తాము మొదటి నుండి టీఆర్‌ఎస్‌లో ఉన్నామని, అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపు కోసం పనిచేశామని, ఇప్పుడు కొత్తగా టీఆర్‌ఎస్‌లో చేరిన వారు తమపై ఆధిపత్యం చెలాయిస్తూ పార్టీ పదవులను దక్కించుకుంటే తామేం చేయాలని ప్రశ్నిస్తున్నారు. మొదటి దశలో ఎన్నికలు జరిగే మండలాల్లో అనేక చోట్ల రెబల్ అభ్యర్థులుగా కొందరు నామినేషన్లు కూడా దాఖలు చేశారు. 


త‌మ‌కు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సరైన న్యాయం జరగకపోతే పార్టీని వీడేందుకు కూడా సిద్ధమేనని ప్రకటించారు. ప్రధాన నేతలు జోక్యం చేసుకొని తమను పోటీ నుండి తప్పించే ప్రయత్నం చేసినా అంగీకరించమని, పోటీలోనే ఉంటామని పలువురు జడ్పీటీసీ అభ్యర్థులు స్పష్టం చేశారు. వీరికి ఇతర పార్టీలు మద్దతు పలకటం విశేషం. ప్రస్తుతం గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులను బట్టి ప్రతి గ్రామంలోనూ టీఆర్‌ఎస్ రెండు, మూడు వర్గాలుగా విడిపోయింది. అందరినీ సమన్వయం చేసి ఒక తాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నించిన నేతలకు గ్రామ నాయకుల నుండి తిరస్కారం ఎదురుకావటంతో రాష్ట్ర పార్టీకి నివేదిక అందించినట్టు తెలిసింది. ఈ చీలిక‌ను టీఆర్ఎస్ పెద్ద‌లు ఎలా స‌రిదిద్దుతారో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: