అయిదారు నెలల వరకు గెలుపు తమదే మళ్లీ నరేంద్ర మోడీ వరుసగా రెండోసారి భారత దేశ ప్రధానమంత్రి అవుతున్నారు అన్న నమ్మకంతో ఉన్న బీజేపీ శ్రేణులు ఆత్మ స్థైర్యం ఆత్మరక్షణలో పడిందా ? దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు జరిగిన మూడు దశల ఎన్నికల తర్వాత ఇవే అనుమానాలు బిజెపి అగ్రనాయకత్వంని వేధిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు మూడు దశల్లో సగానికి పైగా నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. ఈ మూడు దశల్లో పోలింగ్ జరిగిన తీరును బట్టి చూస్తుంటే బిజెపి పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేదని జాతీయ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్ర‌తిసారి నార్త్‌లో ప‌ట్టు సాధించాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోన్న బీజేపీ ఎన్నిక‌ల్లో బొక్క బోర్లా ప‌డుతూ వ‌స్తోంది. బిజెపి దక్షిణ భారతదేశంలో పూర్తిగా చేతులు ఎత్తేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక నార్త్‌లో ఆ పార్టీ భారీ స్థాయిలో ఆశ‌లు పెట్టుకున్న‌ రాష్ట్రాల్లో సైతం ఈ సారి ఎదురుదెబ్బలు తప్పేలా లేవు. 


ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీష్ఘ‌డ్, బీహార్, బెంగాల్,  ఒడిశా లాంటి రాష్ట్రాల్లో ఈసారి బిజెపి సీట్లలో భారీగా కోత పడనుంది. ఇక దక్షిణాదిలో కేసీఆర్ లాంటి వాళ్లు ఫెడరల్ ఫ్రంట్ అంటూ హడావుడి చేస్తున్నారు. బెంగాల్‌లో దీదీ ఎప్పటి నుంచో ఢిల్లీ పీఠంపై కన్నేశారు. ఈ సారి బెంగాల్‌లో 35 కు తగ్గకుండా పైనే సీట్లు గెలుచుకోనున్న‌ మమతా బెనర్జీ ఎలాగైనా ప్రధానమంత్రి పీఠంపై కూర్చుని తీరాలని అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించారు.  మరోవైపు యూపీలో బీజేపీకి బ్రేక్ వేయడానికి చేతులు కలిపిన మాయావతి, అఖిలేష్ యాదవ్ అక్కడ క‌నీసం 50 నుంచి 60 సీట్ల వ‌ర‌కు గెలుచుకునే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అదే జ‌రిగితే బిజెపికి పెద్ద ఎదురు దెబ్బే.  బిజెపికి, ఇటు కాంగ్రెస్‌కు ఎలాగో పూర్తి మెజార్టీ రాదన్నది తేలిపోయింది. ఇప్పుడు దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల కూటమిలో ఏర్పడే ఫెడరల్ ఫ్రంట్ కీలకం కానుంది. 


ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చేందుకు కావాల్సిన సీట్లు ఆ పార్టీలు సాధిస్తాయా ? అన్న‌ సందేహాలు కూడా ఉన్నాయి.  ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తామని పూర్తి ధీమాతో ఉంది. అసలు ప్రాంతీయ పార్టీల అవసరమే తమకు లేదన్నట్టుగా వ్యవహరించింది. నోటిఫికేషన్ విడుదల అయ్యాక జాతీయ రాజకీయాల్లో పరిణామాలు ఒక్కసారిగా మారుతూ వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అంచనాలకు మించి పుంజుకుంది, అదే టైంలో చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలోపేతమయ్యాయి. తమిళనాడులో కాంగ్రెస్ - డీఎంకే పొత్తు, కర్ణాటకలో కాంగ్రెస్ - జేడీఎస్ పొత్తు దక్షిణాదిలో పాగా వేయాలన్న బిజెపి ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది. ఈ పరిణామాలన్నీ కమలనాథుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నది నిజం. నరేంద్ర మోడీ ప్రాంతీయ పార్టీలను అణగదొక్కాలన్న‌నియంతృత్వ‌ విధానాలకు నిరసనగా ఉత్తరప్రదేశ్‌లో ఉప్పు - నిప్పులా ఉండే మాయావతి, అఖిలేష్ యాదవ్ సైతం కలిసిపోవడం రాజకీయంగా పెద్ద సంచలనమే. 


ఇక కమలనాథులు ముందు నుంచి ఉత్తరభారతంపైనే ప్రధానంగా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు యూపీలో  తమ సీట్లకు భారీగా కోత పడుతుండటం రాజ‌స్థాన్‌, అస్సాం, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘ‌డ్‌లో కాంగ్రెస్ రోజు రోజుకు స్ట్రాంగ్‌ అవుతుండ‌డంతో ఆ రాష్ట్రాల్లో బిజెపికి భారీగా సీట్లు తగ్గిపోతున్నాయి. ఏదేమైనా తొలి మూడు దశల్లో పోలింగ్ రోజు బాగా వెనకబడి పోయిన బిజెపి మిగిలిన దశలో నార్త్ పోలింగ్ జరుగుతున్న రాష్ట్రాలపైనే ఆశ‌లు పెట్టుకుంది. అక్క‌డ ఓ మోస్తరుగా సీట్లు ద‌క్కించుకున్నా... అప్పుడు అయినా ప్రాంతీయ పార్టీల మ‌ద్ద‌తు ఉంటేనే మ‌ళ్లీ మోడీ పీఎం పీఠంపై కూర్చోవ‌చ్చు. లేక‌పోతే ఎన్నిక‌ల త‌ర్వాత కాంగ్రెస్ లేదా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌లు చేసే మ్యాజిక్ మీదే ఢిల్లీ హీరో డిసైడ్ అవుతాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: